రాబందులను పెంచితే రూ.100 కోట్లు

rabanduచనిపోయిన పశువుల్ని వూరిబయట పడేస్తే, రాబందులు వచ్చి తినేసేవి. కళేబరం కుళ్లిపోయి దుర్వాసన రాకుండా, బ్యాక్టీరియా వ్యాపించకుండా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచేందుకు దోహదపడేవి. అలాంటి రాబందులు ఇప్పుడు అంతరించే దశలో ఉన్నాయి. ఒకప్పుడు లక్షల్లో ఉన్న వీటి సంఖ్య… ఇప్పుడు దేశవ్యాప్తంగా రెండు, మూడు వేలకు మించి కన్పించడంలేదు.

రాబందులు అంతరించిపోవడం ముఖ్యంగా పార్సీలకు ఇబ్బందిగా. వీరి కుటుంబంలో ఎవరైనా మరణిస్తే మృతదేహాన్ని తీసుకువెళ్లి ఎత్తయిన ప్రదేశంలో వదిలేస్తారు. రాబందులు వాటిని ఆరగిస్తే మంచిదని భావిస్తారు. ఇప్పుడవి అంతరించడం పార్సీలకు తీవ్ర సమస్యగా మారింది. దీంతో వాటి సంతతిని పెంచే కార్యక్రమానికి రూ. వంద కోట్ల వరకూ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు.

దేశంలో రాబందులు 97 శాతానికిపైగా అంతరించాయని, మిగిలినవి రెండు మూడు శాతమేనని పరిశోధకులు, వణ్యప్రాణి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాబందులు జాడ చెప్పినా, ఫొటో పంపినా రూ.లక్ష బహుమతి ఇస్తామంటూ ప్రకటించింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, వీటి సంరక్షణకు కొన్ని చర్యలు చేపట్టింది. తెలంగాణ అటవీశాఖ బెజ్జురులోని రాబందుల సంరక్షణపై దృష్టి సారించింది.

పశువులకు జబ్బు చేసినప్పుడు ‘డైక్లోఫినాక్‌’ ఔషధం వాడేవారు. ఈ జంతువులు చనిపోతే, వాటిని తిన్న రాబందులపై ఎఫెక్ట్ పడింది.దీంతో సంతానోత్పత్తి నిలిచిపోతోంది. కేంద్రం డైక్లోఫినాక్‌ను నిషేధించినా, అప్పటికే తీవ్రనష్టం వాటిల్లింది. వాతావరణ కాలుష్యం, రసాయనాలు కూడా రాబందులు అంతరించిపోవడానికి కారణాలయ్యాయి.

కేంద్ర ప్రభుత్వం హరియాణాలోని ‘పింజోర్‌’, పశ్చిమ్‌బంగలో రాబందుల సంరక్షణ పునరుత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో రాబందులు అంతరించాయని కొన్నేళ్ల క్రితం నిర్ధారణకు వచ్చారు. అయితే 2011లో కుమురం భీం జిల్లా బెజ్జూరు మండలం పాలరాపుగుట్టలో వాటి ఉనికి కన్పించడంతో ఆశలు చిగురించాయి. అప్పుడక్కడ పది వరకు ఉన్నట్లు గుర్తించారు. వీటిని సంరక్షణపై దృష్టి పెట్టడంతో ఇప్పుడవి 30కి పైగా ఉన్నాయి. ఈజిప్లియన్‌ జాతికి చెందిన రెండు రాబందులు కూడా ఇక్కడ కనిపించాయి.

రాబందుల సంరక్షణ, ప్రత్యుత్పత్తి, పెరుగుదలపై అటవీశాఖ జాగ్రత్తలు తీసుకుంటోంది. వాటి ఆహారం కోసం ఆవులు, ఎద్దులను ప్రత్యేకంగా తీసుకొస్తున్నారు. ‘డైక్లోఫినాక్‌’ వాడకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో అవగాహన కల్పిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy