రాయలసీమలో జంపింగులుంటాయా

seemaరాయలసీమలో జంప్ జిలానీ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. కర్నూలు జిల్లా పత్తికొండలో చంద్రబాబు చేసిన కామెంట్లే దీనికి కారణమని సీమలో టాక్. జగన్ పార్టీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి రాబోతున్నారని, వాళ్ళతో సర్దుకుపోవాలని తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు చెప్పిన విషయం బయటకు పొక్కడంతో అది సెన్సేషన్ అయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ లో ఏకంగా కలకలం రేపింది.

 

రాయలసీమలో కోట్లాది రూపాయలతో అభివృద్ది పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్న తరుణంలో ప్రతిపక్షంలో ఉండి పోరాడి ఆర్ధికంగా నష్టపోయేకంటే.. పార్టీ మారి లాభం పొందాలనుకునే యోచన ఉన్న ఎమ్మెల్యేలను ఆహ్వానించాలని చంద్రబాబు కర్నూలుజిల్లాలోని  నియోజకవర్గాల నాయకులకు, ఇంచార్జీలకు ఒక ఇన్ డైరెక్ట్ సిగ్నల్ ఇచ్చారట. ‘కొత్తవాళ్ళతో సర్దుకుపొండి. దీనిమీద మీకు ఏదన్నా అబ్జెక్షన్లు ఉంటే సంక్రాంతిలోపు తేల్చి చెప్పండి’ అన్నారట బాబు.

కడప జిల్లాలో జగన్ పార్టీ ఎమ్మెల్యేల జాయినింగ్ కు తెలుగు తమ్ముళ్లే  మోకాలడ్డుతుండడంతో కర్నూలు జిల్లాలో అలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని చంద్రబాబు గట్టి పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తెలుగుతమ్ముళ్లకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

vlcsnap-2016-01-09-13h57m33s49కేశవరెడ్డి విద్యాసంస్థల ఛైర్మన్ ఎన్.కేశవరెడ్డి ఆమధ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. తనతోపాటు తన వియ్యంకుడు  వైఎస్సార్ కాంగ్రెస్ కు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని కూడా తెలుగుదేశం పార్టీలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే, ఆ ప్రయత్నం ఫలించేలోపే తన విద్యా సంస్థల్లో అక్రమంగా డిపాజిట్లు వసూలు చేసిన ఉదంతం బయటకు పొక్కడంతో కేశవరెడ్డి జైలుపాలయ్యారు. అయితే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాత్రం వైఎస్ఆర్ పార్టీకి దూరం దూరంగా ఉంటూ తెలుగుదేశం పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారు. కానీ, ఆదినారాయణరెడ్డిని చేర్చుకుంటే.. ఊరుకోబోమని అక్కడి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి.. ఆయన వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించడంతో అది పెండింగ్ లోనే ఉంది.

అయితే, కర్నూలు జిల్లాలో కూడా జగన్ పార్టీ ఎమ్మల్యేల జాయినింగ్ అంత తేలికేమీ కాదు. తమ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారన్న విషయం తెలిసి, జగన్ జాగ్రత్త పడుతున్నారు. ఆ ఎమ్మెల్యేలతో స్వయంగా  మాట్లాడారని సమాచారం. కలిసికట్టుగా ఈ వార్తలు ఖండించాలని జగన్ ఆర్డరేశారట. దీనితో 10 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియా సమావేశం పెట్టి పార్టీ మారే ప్రసక్తి లేదని చెప్పారు. జనంలో పెరుగుతున్న వ్యతిరేకతపై  దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు సరికొత్త మైండ్ గేమ్ కు తెరలేపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి విమర్శించారు.

టడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు మరో కారణం కూడా ఉంది. ఇప్పుడిప్పుడే రెక్కలు తొడుగుతున్న ప్రత్యేక రాయలసీమ ఉద్యమాన్ని దెబ్బ కొట్టడానికి కూడా ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగిస్తున్నట్టు చెప్తున్నారు.

vlcsnap-2016-01-09-13h53m41s27ఎన్నికలముందు వైసీపీలో చేరిన సీనియర్ నేత మైసూరారెడ్డి.. జగన్ తో ఇమడలేక పార్టీలో నుండి బయటకొచ్చి.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి చేపట్టిన రాయలసీమ ఉద్యమానికి.. మైసూరారెడ్డి తోడైతే సమస్యే. ఇద్దరూ కలసి ఒకేతాటిపైకి వచ్చినా.. వేర్వేరుగా చేసినా రాయలసీమ ఉద్యమం మరింత విస్తరించే పరిస్థితి వస్తుంది. జగన్ తో పొసగలేకపోతున్న మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక రాయలసీమకు తామంతా వ్యక్తిగతంగా మద్దతిస్తామని బాహాటంగా చెబుతుండడంతో పరిస్థితి అదుపు తప్పకముందు చెక్ పెట్టాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

అయితే, ‘ఆపరేషన్ ఆకర్ష్’ పై  తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వివరణ ఇచ్చారు. ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న వారెవరైనా.. ముందుకొస్తే పార్టీలకు అతీతంగా చేర్చుకుంటామని చంద్రబాబు చెప్పారే తప్ప ఐదుగురు ఎమ్మెల్యేలు వస్తారని చెప్పలేదన్నారు.

vlcsnap-2016-01-09-13h56m28s185టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్  వ్యవహారంపై రాయలసీమ పరిరక్షణ సమితి లీడర్, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ, ఐదుగురు ఎమ్మెల్యేలు కాదు.. మొత్తం 10 మంది వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లి చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. అధికార వ్యామోహం ఉన్న వారెవరో..  ప్రజాసేవకు కట్టుబడి పనిచేసేవారెవరో ప్రజలు గమనిస్తున్నారని అన్నారాయన.

మొత్తానికి, రాయలసీమలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నమాట నిజం. ఈ పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్ ను ఎంత భయపెడుతన్నాయో, టీడీపీవాళ్ళకూ అంతే బెదురు పుట్టిస్తున్నాయి. కొత్తవాళ్ళు వస్తే, తమ పని ఖాళీ అని టీడీపీ నాయకులు, కార్యకర్తల ఫీలింగ్.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy