రాష్ట్రంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు

రాష్ట్రంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు తెల్లవారు జాము నుంచే శివుడు, నాగదేవత ఆలయాలకి క్యూలు కట్టారు. పుట్టల్లో పాలు పోసి… పూజలు చేశారు. నైవేద్యాలను సమర్పించారు. అంతా చల్లగా ఉండేలా దీవించాలని నాగ దేవతను వేడుకున్నారు.
పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. గోదావరిఖని, ఎన్టీపీసి, రామగుండం, 8వ కాలని తదితర ప్రాంతాల్లో పాముల పుట్టల దగ్గర మహిళలు పూజలు చేశారు. పాముల పుట్టలను పసుపు, కుంకుమలతో ఆరాధించారు. పాలు, గుడ్డుతో పాటు నాగ దేవుడికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా సమర్పించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరిగాయి. ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ హరిహర క్షేత్రంలో మహిళలు శివాలయాలకు క్యూ కట్టారు. ఆదిశేషువుతో పాటు ఆయన సోదర సంతతికి ప్రీతికరమైనదే నాగుల పంచమి. స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామీ, శ్రీ అక్కపెల్లి రాజరాజేశ్వర స్వామీ ఆలయాల్లో మహిళలు పూజ కార్యక్రమాలను నిర్వహించి పుట్టలో పాలు పోశారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నాగుల పంచమి సందర్భంగా నాగదేవత ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి భక్తులు నాగదేవతకి పాలాభిషేకం చేశారు. రాత్రి నుంచే భజన, సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ లో వెలిసిన సంతాన నాగమ్మ ఆలయంలో నాగుల పంచమి సందర్భంగా మహిళలు భారీగా దేవాలయానికి చేరుకున్నారు. నాగమ్మను పూజిస్తే.. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఆలయంలోని పుట్ట దగ్గర పాలు పోసి పూజలు చేశారు. నాగమ్మ విగ్రహాన్ని దర్శించుకున్నారు భక్తులు. ఇక్కడ పుట్ట మీద ఉన్న జొన్న పేలాలను ఇంటికి తీసుకెళ్ళి… వినాయకచవితి వరకు వాటిని భద్రంగా ఉంచుకుంటామని భక్తులు తెలిపారు.
నాగుల పంచమి సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్లలోని ఆలయాల్లో భక్తులు మొక్కలు చెల్లించుకున్నారు. ఉదయం నుంచి పుట్టల దగ్గర మహిళలు బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో నైవేద్యాన్ని ఆలయాలకు తీసుకొచ్చి ప్రదక్షిణలు చేశారు. దీపాలు వెలిగించి పుట్టలకు పూజలు చేశారు.
సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నాగుల పంచమి సందర్భంగా మహిళలు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో పుట్టలో పాలు పోస్తే.. అంతా మంచి జరుగుతుందని చెప్పారు భక్తులు.
నిజామాబాద్ జిల్లాలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలో ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున నాగ దేవతకు పూజలు చేశారు. మహిళా కళాశాల, శివాలయం, తిలక్ గార్డేన్, నాగేంద్రుని ఆలయాల్లో ఉన్న పుట్టల్లో పాలు పోసారు. ఈసారి నగరంలోని గోశాలలు, ఇతర స్వచ్చంద సంస్థలు ఆవు పాలను ఉచితంగా సరఫరా చేసారు. పుట్టలో పాలు పోశాక… మిగిలిన పాలతో తమ సోదరుల కళ్ళు కడగడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది.

సిద్దిపేట జిల్లా దుబ్బాక లోని ఎల్లమ్మ దేవాలయంలో నాగుల పంచమి సందర్భంగా నాగదేవత చుట్టూ ప్రదక్షిణలు చేశారు. నాగదేవతకు పాలు పోస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళా భక్తులు. కోరిన కోర్కెలు తీరుస్తూ పాడిపంట, పశువులు సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏడాది నాగదేవతకు పాలు పోస్తూ పూజలు చేస్తామన్నారు.
సిద్దిపేట గాడిచర్ల పల్లెలోని కోటి పడగల సంతాన నాగ దేవత ఆలయంలో నాగపంచమి సందర్భంగా నాగమ్మ జాతర నిర్వహించారు. సిద్దిపేటతోపాటు చుట్టు పక్కల జిల్లాల నుంచి కూడా ప్రతి ఏటా కోటి పడగల సంతానం నాగదేవత దర్శనానికి భక్తులు వేలల్లో తరలివస్తారు. ఉదయం ఐదింటి నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఆలయంలో గణపతి పూజ, సుబ్రహ్మణ్యస్వామి పూజ, ప్రత్యేక నాగపూజ, అఖండ హారతి, బోనాల సమర్పణ, ప్రసాదాల వితరణ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy