రాష్ట్రంలో నాలుగున్నరేళ్లు అవినీతి పాలనే: రాహుల్


రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో అవినీతి పాలన సాగించారన్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెలంగాణ ఉద్యమ సమయంలో నీళ్లు, నిధులు నియామకాలు నినాదంతో ఉద్యమం ముందుకు సాగిందన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన … తెలంగాణ ఓ ఆదర్శ రాష్ట్రంగా ఉంటుందని అందరూ భావించారన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ఎంతో కృషి చేసిందన్నారు. తెలంగాణలో పాలన.. దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని అందరూ భావించారన్నారు. అందుకు విరుద్ధంగా అవినీతి పాలన సాగించారన్నారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధపు మాటలని… ఈ సారి ఎన్నికలలో అబద్ధాలను కాకుండా నిజాలను గెలిపించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు రాహుల్.

ఎన్నో ఆశలతో గత ఎన్నికలలో TRS గెలిపించిన తెలంగాణ ప్రజలకు ఎంత న్యాయం జరిగింది..? తెలంగాణ ప్రజల ఆకాంక్షకే కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని.. ఆకాంక్ష కోసమే తెలంగాణను ప్రకటించిందన్నారు రాహుల్. దేని కోసమైతే తెలంగాణ ప్రజలు ఉద్యమించారో ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోగా TRS తెలంగాణ ప్రజల ఆశలను వమ్ముచేసిందని ఆరోపించారు.

తెలంగాణ కోసం రైతులు పోరాడారని…. అలాంటి రైతులకు సంకెళ్లు వేశారన్నారు రాహుల్. రెవెన్యూ సర్ ప్లస్ గా ఆవిర్భవించిన తెలంగాణలో ప్రస్తుతం ప్రతి పౌరుడిపైనా 60 వేల రూపాయల అప్పు ఉందని అన్నారు. కేసీఆర్ మాత్రం రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నారని రాహుల్ విమర్శించారు. రీ డిజైనింగ్ పేరుతో పాత ప్రాజెక్టుల వ్యయం పెంచేశారన్నారు. అంతేకాదు అంబేద్కర్ పేరు మీద ఉన్న ప్రాణిహిత ప్రాజెక్టు పేరును మార్చారన్నారు.

కేజీ టు పీజీ విద్య, ఇంటింటికీ నీటి పథకం ఏమైందని రాహుల్ ప్రశ్నించారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కానీ.. కుటుంబ పాలనను విజయవంతం చేశారన్నారు. అనవసరమైన ఖర్చుతో తెలంగాణను అప్పుల్లో ముంచేశారన్నారు. కేసీఆర్ ఇంటి నిర్మాణానికి రూ.300కోట్లు ఉంటాయి కానీ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు డబ్బులు ఎందుకు ఉండవని ప్రశ్నించారు. ప్రధాని మోడీపై ఒత్తిడి తెచ్చి పసుపు బోర్డును కూడా ఏర్పాటు చేయించలేక పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు రాహుల్.

అంతేకాదు ప్రధాని మోడీ ప్రతి పనికీ కేసీఆర్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దును దేశ మంతా వ్యతిరేకిస్తే…కేసీఆర్ మాత్రం చాలా మంచి పని చేశారంటూ వత్తాసు పలికారన్నారు. కాపలా దారుడిగా ఉంటానన్న మోడీ ఎవరికి కపలా కాస్తున్నారో ఆలోచించాలన్నారు రాహుల్.  మోడీ తన మిత్రుడు అనీల్ అంబానీకి 30వేల కోట్ల రూపాయలు ప్రయోజనం చేకూరేలా రాఫెల్ డీల్ కట్టబెట్టారని విమర్శించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy