రాష్ట్రంలో హై అలర్ట్‌: మావోయిస్టు ప్రభావిత ప్రాంత MLAలకు భద్రత

ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను నిన్న(ఆదివారం,సెప్టెంబర్-23)న కాల్చి చంపారు. ఈ క్రమంలో ఏపీతో పాటు తెలంగాణ పోలీసులు అలర్టయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు, మావోయిస్టుల కదలికలపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఇంటెలిజెన్స్, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో అధికారులతో సమీక్షించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యకలాపాలు, కదలికలపై నుంచి ఆరా తీశారు. గతంలో జరిగిన దాడులు, సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను సమీక్షించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా ఉన్న జిల్లాలతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని తాజా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇతర నేతలకు భద్రత కట్టదిట్టం చేయాలని ఎస్పీలు, కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 2012 వరకు రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలు అక్కడక్కడా కొనసాగాయి. అయితే పోలీసుశాఖ ఆ తర్వాత నుంచి వ్యూహాత్మక చర్యలు చేపట్టడంతో మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌కే పరిమితమైంది. గోదావరి దాటి రాష్ట్ర సరిహద్దుల్లోకి రాకుండా గ్రేహౌండ్స్, స్పెషల్‌ పార్టీ బలగాలు మావోయిస్టు పార్టీని నియంత్రించడంతో తెలంగాణ మావోయిస్టు పార్టీ కమిటీ ఇప్పటివరకు పెద్దగా కార్యకలాపాలు సాగించలేదు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వస్తుండటంతో నేతలంతా నియోజకవర్గాల్లోనే మకాం వేశారు. మారుమూల గ్రామాలకు వెళ్లి ప్రచారం చేస్తున్నారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని నియోజకవర్గాలైన ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, చెన్నూర్, మంథని, భూపాలపల్లి, అటవీ ప్రాంతంగా ఉన్న ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, భద్రాద్రి నేతలను పోలీస్‌శాఖ అలర్ట్ చేసింది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా సంబంధిత డీఎస్పీ… ఎస్పీ అధికారికి సమాచారం ఇవ్వాలని, పోలీసు భద్రతతోనే వారు పర్యటనలు సాగించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించింది. నేతల హెచ్చరికలు పట్టించుకోని సమయంలో ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని పోలీస్‌శాఖ అత్యవసర సర్క్యులర్‌లో ఆదేశించింది. మంథని, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం జిల్లాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు మావోయిస్టు పార్టీ ప్రయత్నిస్తున్న సమాచారంతో అక్కడ అదనపు బలగాలను రంగంలోకి దించాలని, కూంబింగ్‌ పెంచాలని ఎస్పీలను పోలీసుశాఖ ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఉన్న సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంపులతో సమన్వయం చేసుకుంటూ మావోయిస్టుల కదిలకలను నియంత్రించాలని సూచించినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy