రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి

15ts-main6aదేశ 14వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి కోసం ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణం దగ్గరపడింది. భారత రాష్ట్రపతి పదవికి ఎన్నికలు సోమవారం (జూలై-17)జరగనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఈ దళిత నేత, అధికార ఎన్డీఏ కూటమి తరఫు అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ విజయం దాదాపు ఖాయమైనట్లే. అధికార కూటమిలో ఉన్న పక్షాలే కాకుండా టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ వంటి ఇతర పార్టీలూ ఆయనకు మద్దతు ప్రకటించడం, విపక్షాల నుంచి విడిపోయిన జేడీ(యు) కూడా కోవింద్‌వైపే మొగ్గడంతో ఎన్డీఏ పని మరింత సులువయింది. ఆత్మ ప్రబోధానుసారం ఓట్లు వేయాలంటూ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్ని పార్టీలకూ ఇప్పటికే విజ్ఞప్తి చేశారు.

సోమవారం (జూలై-17)ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల్లోని ఎంపీలు, శాసనసభల సభ్యులు ఓట్లు వేస్తారు. ఈ నెల 20వ తేదీన ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఏర్పాట్లన్నింటినీ ఎన్నికల సంఘం పూర్తి చేసింది. ప్రాధాన్య ఓటు పద్ధతికి ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో అవకాశం లేకపోవడంతో రాష్ట్రపతి ఎన్నికల్లో EVMలను వాడబోరు. సంప్రదాయ బ్యాలెట్‌ పత్రాలనే వినియోగిస్తారు. తొలి ప్రాధాన్య ఓటు తప్పనిసరిగా నమోదు చేసిన బ్యాలెట్లే చెల్లుతాయి. ఓటర్లకు బ్యాలెట్‌ పత్రాలతో పాటు కలాలను కూడా ఎన్నికల సంఘమే అందిస్తుంది. వేరే కలాన్ని ఉపయోగిస్తే ఆ బ్యాలెట్‌ చెల్లదు. పార్టీలు విప్‌ జారీ చేసే అవకాశం లేదు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ పదవీకాలం ఈ నెల 24వ తేదీతో ముగుస్తున్నందువల్ల దేశ 14వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అభ్యర్థి ఈ నెల 25వ తేదీన బాధ్యతలు చేపడతారు.

ఓటర్లు 4896 మంది: 

రాష్ట్రపతిని ఎన్నుకునే అర్హత 4896 మంది ప్రజా ప్రతినిధులకు ఉంది. నామినేటెడ్‌ సభ్యులు మినహా మిగిలిన చట్టసభ సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాట్లు పూర్తి

రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర శాసనసభా కార్యదర్శి, ఎన్నికల అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారి రాజ సదారాం తెలిపారు. సోమవారం(జూలై-17) ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందన్నారు. శనివారం(జూలై-15) ఆయన హైదరాబాద్ అసెంబ్లీ కమిటీ హాలులో పోలింగ్‌ బూత్, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ భన్వర్‌లాల్, కేంద్ర ఎన్ని కల పరిశీలకులు సునిల్‌ కుమార్‌తో కలసి పరిశీలించారు. ‘ఎమ్మెల్యేలందరికీ ఎన్నికల నిబంధనలను తెలియ జేశాం. ప్రాధాన్య ఓటు ఈసీ సమకూర్చిన పెన్నుతోనే ఎమ్మెల్యేలు తాము ఓటు వేయదల్చుకున్న అభ్యర్ధి పేరు ఎదురుగా ఉన్న గడిలో 1 అంకెను వేయాలి. తామేసిన ఓటును రహస్యంగానే ఉంచాలి’అని రాజసదారాం చెప్పారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy