రాష్ట్రపతి ఎన్నికలు : కేసీఆర్ నిర్ణయమే కీలకం

kcr-presidentరాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ద‌వీకాలం త్వ‌ర‌లో ముగుస్తుండ‌టంతో ఇప్పుడు.. కొత్త రాష్ట్ర‌పతి అభ్య‌ర్థి ఎన్నిక‌ ఆసక్తి రేపుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల హీట్ ప్రారంభ‌మైంది. తాము సూచించిన అభ్య‌ర్థే బ‌రిలో నిల‌వాలని బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏ కూట‌మి భావిస్తుండ‌గా .. మోడీ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా.. ప్రాంతీయ పార్టీల‌తో క‌లుపుకుని అభ్య‌ర్థిని బ‌రిలో దించే ప్ర‌య‌త్నం చేస్తోంది కాంగ్రెస్‌. ఇందులో భాగంగానే ఇప్ప‌టికే సోనియా గాంధీ ప్రాంతీయ పార్టీ అధ్య‌క్షుల‌తో మంత‌నాలు కొనసాగిస్తుండ‌టం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మోడీ అంటేనే క‌య్యానికి కాలుదువ్వే తృణ‌మూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, ఒడిషా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌, బీహార్ సీఎం నితీష్ కుమార్, డీఎంకే అధినేత స్టాలిన్‌ల‌తో సోనియా ట‌చ్‌లోకి వ‌చ్చిన‌ట్లు స‌మాచారం. ఒక వేళ అన్ని ప్రాంతీయ పార్టీలు ఏక‌మైతే రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి కోసం జ‌రిగే ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థి గెలుపు అంత సులువైన విష‌యం కాదంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపునకు సౌత్ ఇండియా కీలకం కానుంది. కేరళలో లెఫ్ట్, కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. తమిళనాడు విషయానికి వస్తే స్టాలిన్ కాంగ్రెస్ వైపు ఉన్నారు.. అన్నాడీఎంకేలోని పరిణామాలను బీజేపీ అనుకూలంగా మార్చుకుంటున్నది. ఇక ఏపీలో చంద్రబాబు మిత్రపక్షం. జగన్ కూడా బీజేపీకే మద్దతివ్వనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా జగన్ ను అడిగే పరిస్థితి లేదు. సౌత్ లో మిగిలింది తెలంగాణ. ఈ లెక్కలన్నీ వేసుకున్న బీజేపీ అధిష్టానం.. కేసీఆర్ మద్దతు వైపు ఆశగా చూస్తుంది.

ఒక‌వేళ బీజేపీ సూచించిన అభ్య‌ర్థికి ఎన్డీఏ కూట‌మిలోని అన్ని పార్టీలు ఓటు వేసినా రాష్ట్ర‌ప‌తి పీఠం ద‌క్కించుకునేందుకు ఇంకా 25వేల ఓట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇది కాంగ్రెస్‌కు క‌లిసొచ్చే అంశం. ఇక్క‌డే రాజ‌కీయ చ‌క్రం తిప్పాల‌ని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. మ‌న రాష్ట్రానికొస్తే టీఆర్ఎస్‌కు 22వేల ఓట్లు ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్ పార్టీ ఓట్లు కీల‌కం కానున్నాయి. గులాబీ పార్టీ  రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో డెసిష‌న్ మేక‌ర్ అయ్యే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా దిగ్విజ‌య్ సింగ్‌పై కేసీఆర్ స‌ర్కార్ సీరియ‌స్‌గా ఉంది. ముస్లిం యువ‌కుల‌ను ఐసిస్‌లో చేర్చేందుకు తెలంగాణ పోలీస్ ప్ర‌య‌త్నిస్తోందని తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డంతో స‌ర్కార్ డిగ్గీరాజాపై గుర్రుగా ఉంది. ఆయ‌న‌పై పోలీస్ కేసు కూడా న‌మోదు అయ్యింది. కేసీఆర్ స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటార‌ని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బీజేపీ అభ్య‌ర్థికి త‌మ మ‌ద్ద‌తు ఉంటుందా ఉండ‌దా అనే ప్ర‌శ్న‌పై మాత్రం ఇప్పటి వరకు ఓపెన్ స్టేట్ మెంట్ ఇవ్వలేదు టీఆర్ఎస్.

మిర్చి రైతుకు మ‌ద్ద‌తు ధ‌ర‌పై  కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుపై కూడా రాష్ట్ర ప్ర‌భుత్వం ఒక్కింత అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే మిర్చి రైతును ఆదుకోవ‌డంలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డంతోనే కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింద‌ని రాష్ట్ర బీజేపీ నేత‌లు చెబుతున్నారు. మిర్చి రైతు రోడ్డున ప‌డ్డాడంటే అందుకు కార‌ణం కేంద్ర‌ ప్ర‌భుత్వ‌మేన‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌లుసార్లు వేలెత్తిచూప‌డంతోనే కేంద్రం దిగొచ్చి మ‌ద్ద‌తు ధ‌ర ప్ర‌క‌టించింద‌ని గులాబీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

సో… ఈ అంశాల‌న్నీ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ప్ర‌భావం చూపుతాయ‌ని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కేసీఆర్ తీసుకునే నిర్ణ‌య‌ం.. ఇటు బీజేపీ – అటు కాంగ్రెస్ నిలబెట్టే రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి గెలుపునకు కీల‌కం కానుంద‌ని జాతీయ స్థాయిలో రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy