రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం: నీటమునిగిన పంటపొలాలు

rain-cropరాష్ట్రంలో వరుసగా రెండో రోజు కూడా వాతావరణం ఒక్కపారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. జనాలు బయటికి రావాలన్నా ఇబ్బంది పడ్డ పరిస్థితి. మధ్యాహ్నం తర్వాత వెదర్ మారింది..  చాలా జిల్లాల్లో భారీవర్షాలు పడ్డాయి. వానలకు  ఈదురు గాలులు తోడు కావడంతో చేతికందిన పంట నీటిపాలయ్యింది. ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈదురుగాలులతో వాన బీభత్సం  సృష్టించింది. వరంగల్,  ఆదిలాబాద్,  కరీంనగర్, నిజామాబాద్ లో  వర్షం కురిసింది.  దీంతో  అప్పటివరకూ  కొనసాగిన ఎండ వేడిమి  ఒక్కసారిగా  తగ్గిపోయింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. పరకాలలో వడగళ్ల వర్షం కురిసింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఎల్బీ కాలేజీ ఆవరణలో ఈదురు గాలులకు  చెట్లు విరిగిపడి వాహనాలు ధ్వంసం అయ్యాయి. భారీ గాలులతో  చాలా చోట్ల చెట్లు కూలిపోయాయి. రెవెన్యూ  అధికారులు అప్రమత్తంగా ఉండాలని.. సహాయ చర్యలు  తీసుకోవాలని  ఆదేశించారు  కలెక్టర్ అమ్రాపాలీ.

వర్థన్నపేట మండలంలోని పలుగ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం పడింది. అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయింది. భూపాలపల్లి జిల్లా కాటారం, మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర్, పలిమెల మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో మార్కెట్ లో అమ్మకానికి తెచ్చిన ధాన్యం నీటి పాలైంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అకాల వర్షం రైతులను నిండా ముంచింది. మంచిర్యాలలో భారీ వర్షం, ఈదురుగాలులతో నష్టం వాటిల్లింది. సిర్పూర్, కౌటాల, బెజ్జూరు మండలాల్లో ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.  పెద్దపల్లి జిల్లా బందంపల్లి దగ్గర రాజీవ్ రహదారిపై ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ దంచికొట్టినా…తర్వాత ఈదురు గాలులు, వర్షంతో జనం ఉపశమనం పొందారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ అకాల వర్షం రైతులను ముంచింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, అర్వపల్లి మండలాల్లోను ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. కారుమబ్బులతో పట్టపగలే చీమ్మ చీకట్లు కమ్ముకున్నాయి.

క్యుములో నింబస్ మేఘాలు..  మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు వాతావరణ అధికారులు. దీని ప్రభావంతో మరో రెండురోజులు ఇలాగే వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy