రాష్ట్ర పతి ఆమోద ముద్ర పడిన లోక్ పాల్ బిల్లు – స్పాట్ లైట్

LOKPAL                                                                  
lokpal

దశాబ్దాలుగా అసహనం. ఏళ్లుగా కొనసాగిన పోరాటం. ఎప్పుడు మొదలు పెట్టినా అదే వేడి. అదే స్పందన. ఎవరు లీడ్ చేసినా సరే అదే జోరు. అదే అవినీతి వ్యతిరేకపోరాటం. అవినీతి భారతీయుల బ్లడ్ లోనే ఉంది… అది అంతం కాదన్న భావనకొచ్చింది ప్రపంచం. కానీ దాన్ని అంతం చేసేందుకు మనకిప్పుడో  ఛాన్స్ వచ్చింది. మనకు సపోర్ట్ గా నిలబడడానికి లోక్ పాల్ బిల్లు వచ్చింది. బిల్లుకు ఆమోదముద్ర పడింది. ఇక చట్టంగా మారడమే నెక్ట్స్ స్టెప్. ఇంతకీ లోక్ పాల్ తో అవినీతి అంతమైపోతుందా ? కుంభకోణాలకు అడ్డుకట్ట పడ్డట్టేనా ?  చట్ట రూపందాల్చబోతున్న లోక్ పాల్ బిల్లుపై V6 స్పాట్ లైట్.

ఇందుగలడు అందుగలడు, ఎందెందు వెతికిన అందులో గలడు అని సర్వాంతర్యామి గురించి చెప్తారు. అవినీతి కూడా అంతే… దేశంలో వేళ్లూనుకుంది. అవినీతికి అలవాటుపడిపోయింది దేశం. దాన్ని ఓ జబ్బుగా భరిస్తూ వస్తున్నాడు కామన్ మెన్. కానీ దానికిప్పుడు చెక్ పెట్టే రోజులొచ్చాయి. లోక్ పాల్ బిల్లుతో అద్భుతాలు కాకపోయినా కొంతైనా మార్పు వస్తుందని ఆశిస్తోంది దేశం.

నాటి బోఫోర్స్ లో ఎనభై కోట్లు

2జీ స్కాంలో లక్షా 70 వేల కోట్లు

కామన్ వెల్త్ గేమ్స్ లో 70 వేల కోట్లు

కోల్ స్కాం దాదాపు 2 లక్షల కోట్లు

వందల నుంచి వేలు, లక్షల కోట్లకు చేరిన అవినీతి

స్వాతంత్ర్యానికి ముందే దేశంలో అవినీతి వేళ్లూనుకుంది. 1940ల్లో అతిపెద్ద అవినీతి కేసు జీప్ స్కాం. 80 లక్షల పక్కదారి పడితే దేశం గొల్లుమంది. ఆ తర్వాత అది పదులు, వందలు, వేల కోట్లను దాటి ఇపుడు లక్షల కోట్లకు చేరింది. అయినా సరే మిన్నుకుండిపోవడం తప్ప దోచుకున్న వాళ్లకు శిక్షలు పడవు. పడ్డా వ్యవస్థను ప్రభావితం చేసి బయటకొచ్చి కాలర్ ఎగరేసే క్రిమినల్స్ మన చుట్టూ చాలామందే. అలా తయారైంది ఇండియన్ సొసైటీ.

అలాంటి వ్యవస్థను కదిలించేందుకు రెండేళ్ల క్రితం ఉప్పెనలా మొదలైన ఉద్యమం.. నేతాగణాన్ని తట్టిలేపింది. 78 ఏళ్ల వృద్ధుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగంగా ఆమరణ దీక్షకు దిగితే దేశం మొత్తం అతని అడుగులో అడుగేసింది. గాంధీ ఉప్పు సత్యాగ్రహానికొచ్చినంత రెస్పాన్స్ వచ్చింది. మరో స్వతంత్ర్య సంగ్రామాన్ని తలపించింది. జనాగ్రహాన్ని గమనించిన నేతలు.. బిల్లును ఆమోదించకపోతే పార్టీలన్నింటికీ కలిపి పాడె కట్టడం గ్యారెంటీ అన్న సంకేతం పంపినట్టైంది. అందుకే లోక్ సభలో బిల్లు ఆమోదానికి ఒక్క సమాజ్ వాదీ పార్టీ తప్పితే… దాదాపు అన్ని పార్టీలు మద్ధతిచ్చాయి. మొన్నటి ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కామన్ మ్యాన్ డేంజర్ సిగ్నల్స్ పంపించాడు. దాంతో బిల్లును పాస్ చేయడం తప్ప మరో మార్గం లేకపోయింది కేంద్రానికి. దానికి సహకరించకపోతే ప్రతిపక్షాలకు కూడా ముప్పు తప్పదని నిరూపించింది. నేతలు మేం మారాం అని చెప్పుకోకతప్పని పరిస్థితి. ఇక మారాల్సింది జనమే.

రెండేళ్లుగా పార్లమెంట్ లో బిల్లుపై చర్చ జరుగుతూనే ఉంది. రకరకాల కొర్రీలు. బిల్లును పక్కదారి పట్టించేందుకు మరెన్నో కుట్రలు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని చులకన చేసేలా కామెంట్లు. ఉద్యమం చేస్తున్నవాళ్లను బ్లేమ్ చేసిన తీరును దేశం గమనించింది. అందుకే మొదటి దెబ్బగా కాంగ్రెస్ కు నాలుగు రాష్ట్రాల్లో వాతపెట్టారు. ఢిల్లీలో బీజేపీకి చుక్కలు చూపించారు. ఈ రెండు ఇన్సిడెంట్స్ తో ఆమ్ ఆద్మీ ఇంకేదో కోరుకుంటున్నాడన్న సంకేతాలిచ్చినట్టైంది. అందుకే పార్టీల తీరు కూడా మార్చుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ ప్రిన్స్ చార్మింగ్ రాహుల్ గాంధీ లోక్ పాల్ తప్పదని మొదటిసారి బయటికొచ్చి గట్టిగా చెపాడు.

దీంతో ఈసారి కేవలం రెండ్రోజుల వ్యవధిలో ఉభయ సభల్లో లోక్ పాల్ బిల్లు చాలా వేగంగా ఆమోదముద్ర వేయించుకుంది. రెండేళ్లుగా రకరకాల కొర్రీలు పెడుతూ వచ్చారంతా. ఈ దఫా మాత్రం కొన్ని సవరణలతో ఆమోదం పొందింది.

జన లోక్ పాల్ Vs లోక్ పాల్

మొదట్లో లోక్ పాల్ లో సామాజిక ఉద్యమకారులుండాలన్న డిమాండ్ పెట్టింది హజారే టీం. స్వతంత్ర్యంగా పనిచేసే వ్యవస్థలా తయారు చేయాలని సలహాఇచ్చారు. దానిపై పెద్దఎత్తున చర్చ జరిగింది.

పార్లమెంట్ ఆమోదం పొందిన లోక్ పాల్ లో సభ్యులు రాజకీయ పార్టీలకు చెందనివాళ్లై.. ఏ పార్టీతో సంబంధం లేని వాళ్లై ఉండాలి. ప్రధాని, లోక్ సభ స్పీకర్, లోక్ సభ ప్రతిపక్ష నేత, సుప్రీం చీఫ్ జస్టిస్, మరో ప్రముఖ న్యాయవేత్తతో కూడిన ప్యానెల్ లోక్ పాల్ టీంని ఎంపిక చేస్తుంది. ఇక తొలగించాలంటే లోక్ సభలో పిటిషన్ పెట్టాలి. దానిపై కనీసం వంద మంది ఎంపీలు సంతకం చేయాలి.

ప్రభుత్వం నుంచి నిధులు పొందే సొసైటీలు, ట్రస్టులు, అసోసియేషన్లన్నీ లోక్ పాల్ పరిధిలోకి వస్తాయి. సీబీఐ విచారణ విభాగానికి ఇక నుంచి స్పెషల్ డైరెక్టర్ ఉంటారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సిఫార్సుతో డైరెక్టర్ ని నియమిస్తారు. సీబీఐ ఎంక్వైరీ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ తో పాటు సీబీఐ డైరెక్టర్ పదవీకాలం రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. కేసును మధ్యలో వదిలేయకుండా విచారణ పూర్తయ్యే వరకు సేమ్ డైరెక్టర్ ని కొనసాగించేందుకు  చర్యలు తీసుకున్నారు.

సుప్రీంకోర్టు విచారణ తర్వాతగానీ, సుప్రీంకోర్టు ఇంటరిమ్ ఆర్డర్ తోగానీ లోక్ పాల్ సభ్యుడిని రాష్ట్రపతికి తొలగించే అధికారం ఉంటుంది. ప్రధాని కార్యాలయం కూడా లోక్ పాల్ పరిధిలోకి చేర్చారు. ఇక ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి ఏ స్థాయివాడైనా నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది. ఇక ఎప్పుడు పడితే అప్పుడు లోక్ పాల్ సభ్యులను తీసే వీల్లేదు. బదిలీ తప్పదనుకుంటే ప్యానెల్ అప్రూవల్ తప్పనిసరి. ఇక బిల్లు చట్టరూపం దాల్చాక ప్రతీ రాష్ట్రం తప్పనిసరిగా లోకాయుక్తను సంవత్సరం లోగా ఏర్పాటు చేసుకోవాలి.
లోక్ పాల్ చరిత్ర:

లోక్ పాల్ బిల్లు. అదే సిటిజన్ అంబుడ్స్ మెన్ బిల్. 1963లో ఏఆర్ సింఘ్వీ తీసుకొచ్చిన డ్రాఫ్ట్. అప్పట్లో ఆయన పార్లమెంట్ సభ్యుడు. ఆ తర్వాత దాన్ని 1968లో ప్రశాంత్ భూషణ్ పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. అప్పట్నించి బిల్లు ఎన్నో సవరణలు, రూపాలు మార్చుకుంటూ దాదాపు పదిసార్లు పార్లమెంట్ దాకా వెళ్లింది. 1971, 1977, 1985, 1989, 1996, 1998, 2001, 2005, 2008లో లోక్ సభకు వెళ్లింది. ప్రభుత్వాలు మారినట్టే బిల్లు దశ కూడా మారుతూ వచ్చింది.

1968లో పార్లమెంటరీ కమిటీ రివ్యూకు వెళ్లింది. అప్పట్లో బిల్లు పరిధిలోకి ప్రధానిని చేర్చకూడదన్న వాదన తెరపైకొచ్చింది. 1969లో కొన్ని మార్పులతో మరోసారి పార్లెమెంట్ దాకా వెళ్లింది. రెండు సభల్లోనూ ప్రవేశపెట్టినా కనీసం చర్చకు కూడా రాలేదు. 1971లో కొన్ని సవరణలో మరోసారి లోక్ సభకు వెళ్లింది. అప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లోకాయుక్తలు ఏర్పాటు కావడంతో లోక్ పాల్ బిల్లు తీవ్రత తగ్గింది. హర్డిల్స్ దాటలేకపోయింది.
1977 నుంచి 2011 వరకు మరో ఆరుసార్లు బిల్లు పార్లమెంట్ కు చేరింది. కానీ పాస్ కాలేదు. 1989లో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో లోక్ పాల్ పరిధిలోకి ప్రధానిని చేర్చాలన్న వాదన తెరపైకి వచ్చింది. ఆ తర్వాత 2011 ఎప్రిల్ 4న యాంటి కరప్షన్ మూవ్ మెంట్ ని అన్నా హజారే మొదలుపెట్టడంతో దేశం ఏకమైంది. ప్రభుత్వం, అన్నా టీంతో చర్చలు మొదలుపెట్టింది. తర్వాత బిల్లు కోసం జాయింట్ ప్యానెల్ కు ప్రధాని ప్రతిపాదించంతో హజారే దీక్ష విరమించారు.

2011 జూన్ 30న లోక్ పాల్ డ్రాఫ్ట్ బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకొచ్చింది. కానీ దానిపై అన్నా టీం అసంతృప్తి వ్యక్తం చేసింది. దాంతోపాటు అన్నా టీం సభ్యుల రాజకీయ కోణం బయటపడింది. ఇదే సాకుగా అన్నా టీం సభ్యులపై ఎంక్వైరీలు, కామెంట్లు చేస్తూ కాలం గడిపారు అన్ని రాజకీయ పక్షాల నేతలు.

2011 అగస్ట్ 4. చట్టానికి ప్రధాని అతీతుడు కాడంటూ లోక్ పాల్ పరిధిలోకి పీఎంను తేవాల్సిందేనంటూ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అదే నెల 16న అన్నాహజారే మరోసారి దీక్షకు దిగారు. వేలాది మందిని పోగేసి శాంతిభద్రతలకు విఘాతం కల్గించారంటూ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించారు. మూడు రోజుల తర్వాత 19న రిలీజ్ చేశారు. బయటకొచ్చాక మరోసారి రామ్ లీలా మైదాన్ లో ఆమరణ నిరహార దీక్షకు దిగారు హజారే.

anna

2011 అగస్ట్ 29న 13 రోజుల హజారే తన దీక్షను విరమించారు. తమ డిమాండ్లనుంచి తగ్గేదే లేదని పటిష్టమైన లోక్ పాల్ బిల్లును ఆమోదించాల్సిందేనని అన్నా టీ పట్టుబట్టింది. ప్రభుత్వంతో ఓ ఒప్పందం కుదరడంతో వెనక్కి తగ్గారు. డిసెంబర్ 20న అన్నా టీం డిమాండ్లను పక్కనపెట్టి… కేంద్ర క్యాబినెట్ సొంత బిల్లును తయారుచేసింది. 23న మంత్రులు ఆమోదించిన బిల్లునే పార్లెమెంట్ లో ప్రవేశపెట్టారు. దానిపై నిరసనలు వ్యక్తమవడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. డిసెంబర్ 27న లోక్ పాల్ లోకాయుక్త బిల్లు లోక్ సభలో పాస్ అయింది. కానీ రాజ్యసభలో నెగ్గలేదు. కొన్ని సవరణలను ప్రతిపాదించడంతో బ్యాక్ స్టెప్ వేసింది ప్రభుత్వం.

మళ్లీ ఏడాది తర్వాత 2012 సెప్టెంబర్ లో రాజ్యసభ ఎంపిక చేసిన ఓ కమిటీ బిల్లును పునర్ పరిశీలించింది. అదే ఏడాది నవంబర్ లో శీతాకాల సమావేశాల్లో బిల్లుపై ఉభయ సభల్లో చర్చ జరిగింది. మళ్లీ 2013 అగస్ట్ లో మాన్ సూన్ సెషన్ లో మరోసారి పార్లమెంట్ లో చర్చకు వచ్చింది బిల్లు. డిసెంబర్ ఐదున కొన్ని సవరణలతో బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుంచారు. ఇపుడు ఏకంగా బిల్లుకు ఆమోదముద్ర పడింది.

లోక్ పాల్ బిల్లుతో భారతదేశంలో కొత్త శకం మొదలవుతోందని అంటున్నారు కొందరు నేతలు. ప్రైవేటు వ్యవస్థలనూ, ఎన్జీఓలను కూడా బిల్లు పరిధిలోకి తెచ్చి ఉంటే కరప్షన్ కొంతైన కంట్రోల్ చేసే ఛాన్స్ ఉంటుందన్నది మరికొందరి వాదన. అవినీతి విషయంలో సప్లయ్, డిమాండ్‌ సూత్రాన్ని గుర్తుచేస్తున్నారు. వ్యాపార సంస్థలు రాజకీయ పార్టీలకు ఇస్తున్న విరాళాలను కూడా కంట్రోల్ చేస్తే అవినీతికి అసలు ఛాన్సే లేకుండా చెయ్యొచ్చన్నది కొందరి సూచన.

ఏదైతేనేం మరో కల నెరవేరింది. పార్టీలపై ఎదురుతిరుగుతున్న సమాజం, రాజకీయాలపై పెల్లుబికుతున్న అసంతృప్తికి ఉద్యమాలు అద్దం పడుతున్నాయి. నవ యువ భారత భవిత పై కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి.

లోక్ పాల్ బిల్లుతో అడుగడుగునా లోకకళ్యాణం జరుగుతుందని ఎవరూ ఆశించట్లేదు. విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని ఎవరూ ఊహించట్లేదు. కానీ వ్యవస్థ ప్రక్షాళనకు, విప్లవాత్మక మార్పులకు ఇది తొలి అడుగు కావాలని ఆశిద్దాం.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy