రాష్ట్ర పర్యటనలో వరాలు ప్రకటించిన నితిన్ గడ్కరీ

nitinరాష్ట్ర పర్యటనలో వరాలు ప్రకటించారు కేంద్ర రోడ్డు రవాణా, జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ. హైదరాబాద్ లో రోడ్ల అభివృద్ధికి 5 వేల 550 కోట్ల నిధులిస్తామని చెప్పారు. జల రవాణా మార్గానికి 2 వేల కోట్లు ఇస్తామని తెలిపారు. సిటీలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు… నాలుగు కొత్త రోడ్ల నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులతో కలిసి శంకుస్థాన చేశారు. కాళేశ్వరం పనులు చూసేందుకు త్వరలో మళ్లీ వస్తానని చెప్పారు నితిన్ గడ్కరీ.

హైదరాబాద్ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. అంబర్ పేట్, ఉప్పల్-నారపల్లి ఎలివేటెడ్ కారిడార్లతోపాటు ఆరాంఘర్-శంషాబాద్ రోడ్డును ఆరులేన్లుగా అభివృద్ధి చేయడం, ఔటర్ రింగురోడ్డునుంచి మెదక్ వరకు 62 కిలోమీటర్లమేర రోడ్డు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మొత్తం 15 వందల 23 కోట్లతో చేపడుతున్న 4 ప్రాజెక్టులకు హైదరాబాద్ రాంమంతాపూర్ లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ పై జనాభా ఒత్తిడిని తగ్గించేందుకు ఇలాంటి మరో నాలుగు నగరాలను అభివృద్ధి చేయాలని, చుట్టూ టౌన్ షిప్ లను అభివృద్ధి చేయాలని సూచించారు గడ్కరీ. రాష్ట్రంలో చేపట్టబోయే రహదారుల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తామన్నారు. రీజినల్ రింగు రోడ్డుకు 5 వేల 500 కోట్లు, బోధన్-మద్నూర్ మధ్య 50 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేసేందుకు వెయ్యి కోట్లు, జిల్లాల్లో రోడ్ల అభివృద్ధికి సీఆర్ ఎఫ్ కింద మరో 750 కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు. మోడీ హయాంలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ఎన్నో నిధులిచ్చామని గుర్తుచేశారు గడ్కరీ.

 

ఇక నీటిపారుదల రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందించారు గడ్కరీ. కాళేశ్వరం ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు చెప్పారని అన్నారు. ప్రాజెక్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని గుర్తుచేశారు. ప్రాజెక్టు పనులను చూసేందుకు త్వరలోనే వస్తానని చెప్పారు గడ్కరీ. 3 వేల టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయని, వీటిని వాడుకోవాలంటే గోదావరి పై రెండు డ్యామ్ ల నిర్మాణం అవసరమన్నారు. నగరాల్లో కాలుష్యం ఎక్కువవుతుందన్నారు గడ్కరీ. కాలుష్యం కంట్రోల్ కు ఎలక్ట్రిక్ వాహనాలు, ఇథనాల్ తో నడిచే ఆటో రిక్షాలు, బస్సులను ప్రోత్సహించాలని చెప్పారు.

హైదరాబాద్ చుట్టూ 338 కిలోమీటర్ల మేర ప్రాంతీయ రింగురోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. దీనికి నిధులివ్వాలని గడ్కరీని కోరారు. గోదావరి నదిపై మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 14 వందల కిలోమీటర్లు జల రవాణా అభివృద్ధికి సహకరించాలన్నారు తుమ్మల నాగేశ్వరరావు,

జూబ్లీ బస్ స్టేషన్ నుంచి కరీంనగర్ వెళ్లే రాజీవ్ రహదారిపై ఒకటి, అలాగే, ప్యాట్నీ నుంచి సుచిత్ర వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి 2 వేల 500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయన్నారు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. కేంద్ర రక్షణశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో ఇవి పెండింగులో ఉన్నాయన్నారు. సమస్య పరిష్కారానికి సహకరించి అనుమతులు వచ్చేలా చూడాలని గడ్కరీని కోరారు కేటీఆర్. సంగారెడ్డి-గజ్వేల్-చౌటుప్పల్, చౌటుప్పల్-యాచారం-కంది రహదారిని నాలుగులేన్ల రీజినల్ రింగురోడ్డుగా చేసేందుకు తగిన నిధులివ్వాలని కోరారు.  వివిధ ప్రాజెక్టులకు నిధులిస్తామని గడ్కరీ ప్రకటించడంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy