రివ్యూ : భరత్ అనే నేను

BHARAT-ANE-NENU-MOVIE-REVIEWటైటిల్ : భరత్ అనే నేను
నటీనటులు : మహేష్‌ బాబు, కైరా అద్వానీ, ప్రకాశ్‌ రాజ్‌, శరత్‌ కుమార్‌, బ్రహ్మాజీ, రావు రమేష్‌ తదితరులు
మ్యూజిక్ : దేవీశ్రీ ప్రసాద్‌
దర్శకత్వం : కొరటాల శివ
నిర్మాత : డీవీవీ దానయ్య
సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌
రిలీజ్ : 2018, ఏప్రిల్ 20

శ్రీమంతుడు తర్వాత అదే కాంబినేషన్ లో వచ్చిన మూవీ భరత్ అనే నేను. ఏప్రిల్ 20వ తేదీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. భరత్ అనే నేను అంచనాలను అందుకుందా.. ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది చూద్దాం.
స్టోరీ
లండన్ ఆక్సఫర్డ్ యూనివర్సిటీలో ఐదు డీగ్రీలు అందుకున్న ఒక యువకుడు.. తన తండ్రి చనిపోవడంతో సడెన్ గా సీఎం అవుతాడు. తప్పు చేయకూడదు అనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మే హీరో.. మార్పు కోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. దీని వల్ల సీఎంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడనేదే కథ.
నటీనటులు
హీరోగా మహేష్.. ఇలాంటి పొలిటికల్ మూవీ చేయడం ఇదే ఫస్ట్. యంగ్ సీఎం పాత్రలో ప్రిన్స్ అదరగొట్టాడు. లుక్ పరంగా మహేష్ కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. పొలిటకల్ డ్రామాకి మహేష్ లాంటి యాక్టర్ చేయడంతో ఈ సినిమాకు వెయిట్ పెరిగింది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకుని వచ్చిన హీరోకి ఇక్కడి రాజకీయాలు, సిస్టమ్ గురించి అవగాహన ఉండదు. దీంతో మార్పుకి సంకల్పిస్తాడు. రాజకీయ వ్యవస్థను కరెక్ట్ చేసే పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. మహేష్.. వన్ మేన్ షోగా సాగుతుంది మూవీ. హీరోయిన్ కైరా అద్వానీ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ వరకు ప్రాధాన్యత లేని పాత్రగా కనిపించినా.. చివరకు ఆ క్యారెక్టర్ తోనే సినిమాను మలుపు తిప్పడం బాగుంది. ప్రకాష్ రాజ్ పాత్ర.. హీరోతో సమానంగా ట్రావెల్ అయ్యింది. ఇక మహేశ్ తండ్రి పాత్రలో శరత్ కుమార్ ఓకే అనిపించాడు. రవిశంకర్, శత్రు, పోసాని, దేవరాజ్ క్యారెక్టర్లు ఈ మూవీకి ఉపయోగపడ్డాయి.
కథనం :
డైరెక్టర్ కొరటాల శివ.. అనుకున్న కథను తెరపై చక్కగా ప్రెజంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. పొలిటికల్ కథకు బలమైన సోషల్ ఎలిమెంట్.. కమర్షియల్ హంగులు జోడించి క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇలాంటి సినిమాలో.. సమకాలీన రాజకీయ నాయకుల ఛాయలు కనిపించడం కామన్. అయితే కొరటాల.. ఎక్కడా ఎవరిని విమర్శించకుండా తనదైన స్టోరీ, కథనంతో భరత్ అనే నేను మూవీని చక్కగా ప్రెజెంట్ చేశాడు. ప్రజా సమస్యలని ఆధారంగా చేసుకుని ఆయన రాసిన డైలాగ్స్.. సొల్యూషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్.. భరత్ మూవీకి మరో హైలెట్. అక్కడక్కడ ఒకే ఒక్కడు, అతడు మూవీ ఛాయలు కనబడినా.. తనదైన టేకింగ్ తో వాటిని అధిగమించాడు కొరటాల. రాయలసీమల దుర్గా మహల్ ఫైట్ సీన్స్.. ప్రీ క్లైమాక్స్ ముందు మరో ఫైట్ తో ప్రేక్షకులను ఆలోచింపచేసే డైలాగులు ప్లస్ పాయింట్స్. దేవీశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కెమెరా వర్క్ తో పాటు.. అసెంబ్లీ సెట్ బాగున్నాయి.
ఫ్లస్‌ పాయింట్లు :
మహేష్‌ బాబు
కథ, కథనం
పాటలు, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌
సమకాలీన రాజకీయాంశాలను సమతుల్యంగా చూపించటం

మైనస్‌ పాయింట్లు:
స్లో నెరేషన్‌
సాగదీత సన్నివేశాలు
క్లైమాక్స్‌
విశ్లేషణ
హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్లతో జోరు మీదున్న కొరటాల.. మహేష్‌తో చేసిన ప్రయత్నం ఆకట్టుకుంది. రాజకీయాలపై అవగాహన లేని వ్యక్తి ఏకంగా సీఎం అయిపోవటం.. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ ఇబ్బంది పెట్టడం, అసెంబ్లీలో సరదా సన్నివేశాలు… ఫస్టాఫ్‌ను ఎంటర్‌టైనింగ్‌గా మలిస్తే, సామాజిక సందేశం, హీరోయిజం ఎలివేట్‌ అయ్యే సన్నివేశాలు సెకండాఫ్‌ ను నిలబెట్టాయి. 10 నిమిషాల్లోనే కథలోకి ఎంటర్‌ అయిన డైరెక్టర్.. తర్వాత కథనాన్ని నెమ్మదిగా నడిపించాడు. సీఎం స్థాయి వ్యక్తి రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమించటం లాంటి విషయాల్లో కాస్త ఎక్కువగానే సినిమాటిక్‌ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. కొరటాల గత చిత్రాల్లో కనిపించిన వీక్‌ నెస్‌ ఈ సినిమాలోనూ కొనసాగింది. క్లైమాక్స్‌ అభిమానులు ఆశించిన స్థాయిలో లేదు. భరత్‌ సీఎంగా రాజీనామా.. తిరిగి పగ్గాలు చేపట్టడం సన్నివేశాల్లో డైరెక్టర్ నాటకీయత ఎక్కువగా జోడించాడు. మొత్తానికి సామాజిక సందేశంతో పాటు కమర్షియల్ హంగులున్న సినిమాలు చూడాలనుకునే వాళ్లకు భరత్ అను నేను బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
బాటమ్ లైన్ : భరత్ అనే నేను ఓ పొలిటికల్ డ్రామా

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy