రివ్యూ : మహానటి

mahnatiరన్ టైమ్: 2 గంటల 57 నిమిషాలు

నటీనటులు: కీర్తి సురేష్, దుల్ఖర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, తనికెళ్ల భరణి, శాలినీ పాండే, భాను ప్రియ, దివ్యవాణి తదితరులు

సినిమాటోగ్రఫీ : డాని

మ్యూజిక్ : మిక్కీ.జె.మేయర్

డైలాగ్స్ : సాయి మాధవ్ బుర్రా

నిర్మాతలు : ప్రియాంక దత్,స్వప్నా దత్

స్టోరీ, డైరెక్టర్ : నాగ అశ్విన్

రిలీజ్ డేట్ : మే 9, 2018

కథేంటి :

1960, 70 దశకాల్లో తెలుగు చిత్రసీమలో వెలుగు వెలిగి, మహానటి అనిపించుకున్న సావిత్రి జీవిత కథే ఈ మహానటి. నటిగా తను ఎలా ఎదిగింది.. పర్సనల్ లైఫ్ లో ఎదుర్కొన్న సమస్యలు, అంత పెద్ద స్టార్ చివరకు ఎలా నేల రాలి పోయిందనేదో చూపించాడు డైరెక్టర్ నాగ అశ్విన్.

నటీనటుల పర్ఫార్మెన్స్ :

సావిత్రిగా నటించిన కీర్తి సురేష్ ఆ పాత్రలో జీవించిందనే చెప్పాలి. సినిమా చూస్తుంటే మనకు కీర్తి సురేష్ కాకుండా సావిత్రిని చూస్తున్నమనే ఫీల్ కలుగుతుంది. ఆ పాత్ర కోసం తను చేసిన హోమ్ వర్క్, తనను తాను సావిత్రిలా అనునయం చేసుకున్న తీరుకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. తన కెరీర్ లో ‘‘మహానటి’’ గొప్ప సినిమాగా నిలిచిపోతుంది. జెమినీ గణేషన్ పాత్రలో నటించిన దుల్ఖర్ సల్మాన్ కూడా గుర్తిండిపోయే నటన కనబరిచాడు. జర్నలిస్ట్ గా నటించిన సమంత సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. తనకు జోడీగా విజయ్ దేవరకొండ మెరిసాడు. సావిత్రి పెద్దనాన్న పాత్రలో నటించిన రాజేంద్రప్రసాద్ నటన అద్భుతం. ప్రకాష్ రాజ్, నరేష్ ఒదిగిపోయారు. డైరెక్టర్లు క్రిష్, అవసరాల శ్రీనివాస్, తరుణ్ భాస్కర్, సందీప్ వంగా కూడా అలనాటి దర్శకుల పాత్రల్లో తళుకున్న మెరిసారు. ఎస్వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు సూట్ అయ్యారు. నాగేశ్వరరావు పాత్రలో హీరో నాగచైతన్య కామియో బాగుంది. షాలినీ పాండే, మాళవిక నాయర్ ఫర్వాలేదు.

టెక్నీషియన్స్ వర్క్:

అప్పటి మూడ్ ను క్రియేట్ చేయడం అంటే మాములు విషయం కాదు. టెక్నిషయన్ల నుంచి మంచి సపోర్ట్ ఉండటం వల్ల ఔట్ పుట్ బాగా వచ్చింది. డానీ తన సినిమాటోగ్రఫీ తో ప్రేక్షకులను 60 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. అలాగే ఆర్ట్ వర్క్ కూడా.. అప్పటి లొకేషన్లు, వస్తువులు, కాస్ట్యూమ్స్ సినీ స్టూడియోలను అద్బుతంగా క్రియేట్ చేశారు. మిక్కీ మ్యూజిక్ సినిమాకు మరో ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ను క్యారీ చేసింది. సాయి మాధవ్ బుర్రా డైలాగులు మెప్పించేలా ఉన్నాయి.

విశ్లేషణ:

మహానటి సావిత్రి గురించి ఇప్పుడున్న వాళ్లలో చాలా మందికి తెలియదు. తక్కువ కాలంలో గొప్ప స్టార్ గా ఎదిగిందో, అంతే తక్కువ కాలంలో దుర్బరమైన జీవితాన్ని గడిపి నేలరాలింది. అలాంటి గొప్ప నటి జీవితకథను అందరికీ చెప్పాలనుకున్న దర్శకుడు నాగ అశ్విన్ ఆలోచనను అభినందించాల్సిందే. సావిత్రి కథలో గొప్ప ఎమోషన్స్ ఉన్నాయి. మంచి సందేశం కూడా ఉంది. ఎంత వాళ్లయినా సరే అందరికీ కష్టాలు, బాధలొస్తాయి.. విధికి ఎవరు అతీతులు కారనేది అంతర్లీనంగా మనకు బోధపడుతుంది. అందుకే ఈ కథ అందరికీ కనెక్టవుతుంది. ఇక ‘‘మహానటి’’ని నాగ అశ్విన్ తెరకెక్కించిన విధానానికి ముగ్దులమైపోతాం. ఈ సినిమా కోసం తను ఇచ్చిన డిటెయిలింగ్ ఆకట్టుకుంటుంది. అంత గొప్పనటి చరిత్రను తెరపై చూస్తుంటే సమయం కూడా తెలీదు. నిజంగా కళ్ల ముందే సావిత్రి గారే ఉన్నారేమో అనిపించేంత ఆహ్లాదకరంగా ఉంటుంది. మూడు గంటల సినిమాలో బోర్ అనిపించే సన్నివేశాలు చాలా తక్కువ. ఫస్టాఫ్ అంతా సావిత్రి సక్సెస్ ను చూపిస్తే.. సెకండాఫ్ మొత్తం తన డౌన్ ఫాల్ ను ప్రజెంట్ చేశాడు డైరెక్టర్. చివరి 30 నిమిషాలు ఎమోషనల్ గా సాగుతుంది. ఇక తన కథతో ట్రావెల్ అవుతున్న మనకు సమంత, విజయ్ దేవరకొండ ట్రాక్ పంటికింది రాయిలా తగులుతుంది. ఫస్టాఫ్ లో అవసరమైన ఈ ట్రాక్ సెకండాఫ్ లో ఇబ్బందిగా మారుతుంది. బహుషా వీళ్ల ట్రాక్ వల్లే సినిమా లెంగ్త్ ఎక్కువైన భావన కలుగుతుంది. ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ తప్ప ‘మహానటి’ ఈ మధ్య వచ్చిన గొప్ప సినిమా అని చెప్పొచ్చు. సావిత్రి గారి గురించి తెలుసుకోవాలనుకునే వారికే కాకుండా, ఓ మంచి కథను తెరపై చూడాలి అనుకునే వాళ్లకు కూడా ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి కథను చెప్పాలనుకున్న డైరెక్టర్ నాగ అశ్విన్ కు, ప్రోత్సహించిన నిర్మాతలను ప్రశంసించాల్సిందే.

బాటమ్ లైన్: మన కథ..- ‘‘మహానటి’’

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy