రెండు విడతలుగా  పీఆర్సీ బకాయిలు

prc-telanganaరాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఉద్యోగులు, పెన్షన్‌దారులకు ఇవ్వాల్సిన తొమ్మిది నెలల PRC బకాయిల ఫైలుపై  సీఎం కేసీఆర్  సోమవారం (మే 22) సంతకం చేశారు. దీంతో రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దాదాపు 3.50 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందినట్లయింది. నగదు రూపంలోనే బకాయిలను చెల్లించాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు సీఎం.

50 శాతం బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలోపు, మరో 50 శాతం బకాయిలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెల్లించేందుకు సీఎం సుముఖత వ్యక్తం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన 2014 జూన్‌ 2 నుంచి పదో PRC అమల్లోకి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయం ఆ మరుసటి సంవత్సరం ప్రారంభంలో జరిగింది. దీంతో పీఆర్సీ ప్రయోజనాలను నగరు రూపేణా 2015 మార్చి నుంచి ఉద్యోగులకు అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఉద్యోగులకు 43 శాతం మేరకు వేతనాలు పెరిగాయి. అయితే, 2014 జూన్‌ నుంచి 2015 ఫిబ్రవరి వరకు(తొమ్మిది నెలలు) సంబంధించిన బకాయిలను ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఖజానా పరిస్థితి సహా ఇతరత్రా పలు కారణాలతో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు ఇంతవరకూ అందలేదు. ఎట్టకేలకు సీఎం కేసీఆర్‌ సోమవారం నిర్ణయం తీసుకోవడంతో… ఉద్యోగులకు పీఆర్సీ బకాయిల చెల్లింపులకు మార్గం సుగమమైంది. మొత్తం 3.50 లక్షల మంది సర్వీస్‌ ఉద్యోగులకు, మరో 2.20 లక్షల మంది పింఛనుదారులకు పీఆర్సీ బకాయిల చెల్లింపులు జరగాల్సి ఉంది. ఈ బకాయిల మొత్తం రూ. 3,500 కోట్ల మేరకు ఉంటుంది. కాగా మొదటి విడత బకాయిలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే చెల్లించనున్నట్లు చెబుతున్నప్పటికీ… వచ్చే నెల(జూన్‌) జీతాలతో పాటే బకాయిలను చెల్లించే అవకాశముందని ప్రభుత్వవర్గాల సమాచారం. కాగా పింఛనుదారులకు కూడా బకాయిల మొత్తాన్ని రెండు విడతల్లో చెల్లించనున్నట్లు తెలిసింది. అలాగే పింఛనుదారులకు కూడా జూన్‌ నెల పింఛనుతోనే తొలి విడత బకాయిలను చెల్లిస్తారని ప్రభుత్వవర్గాలనుంచి వినిపిస్తు సమాచారం. పీఆర్సీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం కొద్ది నెలలుగా పలు ప్రతిపాదనలను పరిశీలించింది. బకాయిల మొత్తాలను GPF ఖాతాల్లో జమ చేయాలన్నది వాటిలో ఒకటి. ఒక దశలో బకాయిలను నగదు రూపంలో బదులు బాండ్ల రూపంలో చెల్లించాలన్న ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలించింది. వీటితోపాటు 50 శాతం బకాయిలను GPF లో కలిపి, మరో 50 శాతం బకాయిలను నగదు రూపంలో ఇవ్వాలని, అంతేకాకుండా మొత్తం బకాయిలను మూడు లేదా నాలుగు విడతలుగా ఇవ్వాలన్న ప్రతిపాదనలపై కూడా కసరత్తు చేసింది. అయితే చివరకు బకాయిలను నగదు రూపంలోనే రెండు విడతలుగానే ఇవ్వడానికి సీఎం సుముఖత వ్యక్తం చేయడంతో ఉద్యోగుల ఎదురుచూపులకు తెరపడింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy