
జీఎస్టీ అమలుతో తమ ఉత్పత్తులపై పన్ను ప్రభావం చాలా వరకు తగ్గనున్నట్లు హిందుస్తాన్ యూనీలీవర్ సంస్థ భావిస్తోంది. దీంతో ఉత్పత్తుల సంఖ్యను పెంచేందుకు ఆ సంస్థ యోచిస్తోంది. మరోవైపు ప్రాక్టర్ అండ్ గాంబుల్ (P&G) సంస్థ మాత్రం జీఎస్టీ అమలైతే తమ ఉత్పత్తులపై పన్ను ప్రభావం అధికంగా పడుతుందని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే P&G నుంచి తయారయ్యే షాంపూలు, టూత్‌పేస్టులు, సబ్బులు లాంటి వస్తువుల ధరలను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
జీఎస్టీ అమలుతో హిందుస్తాన్ యూనీలీవర్ నుంచి తయారయ్యే కొన్ని ఉత్పత్తులపై పన్ను ప్రభావం పెద్దగా ఉండదని ఆ యాజమాన్యం భావిస్తోందని… దీంతో మార్జిన్ పెరిగే అవకాశం ఉన్నందున ఉత్పత్తులు తయారీని కూడా పెంచినట్లు అధికారి ఒకరు వెల్లడించారు. అదే P&Gకు వచ్చేసరికి పరిస్థితి మరోలా ఉందన్నారు. మార్కెట్ లో ఎక్కువగా P&G వస్తువులే ఉన్నాయి కాబట్టి ఆ సంస్థ ధరలు పెంచితే అది వినియోగదారులపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది.
జీఎస్టీ కింద చాలా వరకు రిటైల్ వస్తువులపై 18శాతం నుంచి 28 శాతం వరకు పన్ను పడే అవకాశం ఉంది. అయితే హిందుస్తాన్ యూనీలీవర్ మాత్రం ప్రస్తుతం ఉన్న 23 శాతం నుంచి 18శాతానికి పన్ను తగ్గే అవకాశమున్నట్లు అంచనా వేస్తోంది. P&G అయితే కచ్చితంగా 28శాతం పన్ను పడుతుందని భావిస్తోంది. హిందుస్తాన్ యూనీలీవర్ ఊహించినట్లుగానే ట్యాక్స్ రేట్లు తగ్గుముఖం పడితే ముందుగా కొత్తగా ఉత్పత్తిని తగ్గించి జీఎస్టీ తేది కంటే ముందుగా తయారైన ప్రాడక్ట్స్‌ను మార్కెట్లో అమ్మకానికి ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడంతో పాత టాక్స్ రేట్స్ ఈ ఉత్పత్తులకు వర్తిస్తాయి కనుక ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశం కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.