
ఎప్పటిలాగే ఈసారి కూడా సేమ్ సీన్ రిపీటయ్యింది. రెండు నెలల కిందటి వరకు మూడువేల ధర పలికిన నంబర్ వన్ క్వాలిటీ ఉల్లి ధర ఒక్కసారిగా వెయ్యికి పడిపోయింది. దీంతో ఉల్లి రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. సరైన సమయానికి వర్షాలు లేకపోవడం…డిమాండ్ కు తగ్గ ఉల్లి దిగుబడి రాకపోవడంతో…మొదట్లో ధరలు మూడు వేలకు చేరాయి. అయితే సీజన్ మొదలయ్యాక…ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా రాష్ట్రంలోని తాండూరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఏరియాల నుంచి పెద్ద ఎత్తున ఉల్లి మార్కెట్లకు రావడంతో..ఊహించనిరీతిలో ధరలు పడిపోయాయి. వచ్చే ఉల్లికి క్వాలిటీనీ బట్టి క్వింటాలు ఆరు వందల నుంచి వెయ్యి వరకు పలుకుతోంది. అదే ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న ఉల్లి క్వింటాలుకు 11 వందల నుంచి 12 వందల వరకు పలుకుతోంది.
ఉల్లి ధరలు చూసి రైతన్నలు తలలు పట్టుకుంటున్నారు. మార్కెట్లో ప్రస్తుతమున్న ధరలకు కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ఎకరా ఉల్లి సాగుకు 50 వేలు పెట్టుబడి పెడితే…. ఖర్చులు పోనూ అదనంగా 20 నుంచి 30 వేల భారం పడుతుందంటున్నరు. క్వింటాలు ఉల్లికి కనీసం 15వందల నుంచి 2వేలు ఉంటే తప్పా రైతులకు గిట్టుబాటు కావడం కష్టమంటున్నారు. రైతన్నల దగ్గర పది రూపాయలకు కూడా కొనని వ్యాపారుల…అదే రిటైల్లో అయితే కిలో 20 రూపాయల వరకు అమ్ముతున్నారు. దీంతో తమకు గిట్టుబాటు ధర వచ్చేల ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు అన్నదాతలు.