రైతు చెప్పిందే ధర.. ఆర్గానిక్ పంటలతో మారుతున్న తలరాత

  • ఆర్గానిక్ పంటలతో ‘మార్కెట్’ మార్చిన రైతులు

దేశంలో అన్ని వస్తువుల ధరల్ని వాటిని తయారు చేసేవాళ్లు నిర్ణయిస్తున్నారు.. ఒక్క రైతు తప్ప. రైతు కష్టపడి పండించే పంటల ధరలను మాత్రం మార్కెట్‌ ఖరారు చేస్తోంది. కష్టానికి ప్రతిఫలం లెక్కలోకి రావడం లేదు. అయితే ఆర్గానిక్‌ వ్యవసాయం అలా కాదు.. ఇక్కడ రైతు చెప్పిందే ధర. మార్కెట్‌ రైతుల చేతుల్లోనే ఉంటుంది.

‘వెలుగు’ ప్రత్యేక ప్రతినిధి: ఆరోగ్యం పై పెరుగుతున్న చైతన్యం ప్రజలను ఆర్గానిక్‌ ఫుడ్‌ వైపు మళ్లిస్తోంది. మార్కెట్‌ లో ఆర్గానిక్ బ్రాండు మీద ఉన్నవన్నీ సేంద్రియమో కాదో డౌటే. ఎందుకంటే వాటిని అమ్మేది రైతులు కాదు.. వ్యాపారులు. కానీ స్వయంగా రైతులే రంగంలోకి దిగి పంటసాగు నుంచి అమ్ముకునే వరకు ఒక చెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఏర్పడి సంస్థను రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. అదే ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ ‘.

తెలంగాణ, ఏపీల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులే ఇక్కడ ధర నిర్ణేతలు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఉత్పత్తిదారులు. 2008లో సుస్థిర వ్యవసాయ కేంద్రం (సీఎస్ఏ) రైతుల్ని ఓ గొడుగు కిందికి తీసుకొచ్చి వాళ్లను సేంద్రియ బాట పట్టించింది. సిద్దిపేట జిల్లా అడవి మజీద్ గ్రామ రైతు బాబూమియా ఆర్గానిక్ సాగుమొదలు పెట్టారు. సీఎస్ఏ సహకారంతో అడవి మజీద్ గ్రామంతోపాటు ఐదారు గ్రామాల్లోని 546 మంది రైతులు ఓ సహకార సంఘంగా ఏర్పడ్డారు. ఇలాంటి సంఘాలు తెలంగాణ, ఏపీలో 21 ఉన్నాయి. సుస్థిర వ్యవసాయ కేంద్రం వీరికి శిక్షణ ఇచ్చింది. ఇక గిట్టుబాటు ధర కోసం ‘సహజ ఆహారం ప్రొడ్యూసర్ కంపెనీ ’ని పెట్టి దుకాణాలను ఏర్పాటు చేశారు.

తెలంగాణలో 4, ఏపీలో ఐదు జిల్లాలు

ఆదిలాబాద్, సిద్దిపేట, జనగామ, కామారెడ్డి జిల్లాలతోపాటు ఏపీలో విజయనగరం, విశాఖ, కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లోని ఆర్గానిక్ రైతులు విడివిడిగా కో ఆపరేటివ్స్ ఏర్పాటు చేసుకొని ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్ కంపెనీ లో చేరారు. విశాఖ, ఆదిలాబాద్ జిల్లాల్లో ట్రైబల్ కో ఆపరేటివ్స్ ఏర్పడ్డాయి. వీరంతా తమ ఉత్పత్తులను హైదరాబాద్లోని కంపెనీ కి పంపుతారు. అక్కడే ప్యాకింగ్ చేసి స్టోర్ కు తరలిస్తారు. ప్రతి నెలా ఐదు టన్నులకుపైగా కూరగాయల్ని సహజ ఆహారం బ్రాండ్ కింద హైదరాబాద్లో అమ్ముతారు. ప్రస్తుతం కూరగాయలు, బియ్యం, తృణధాన్యాలు, పప్పులు, వేరుశనగ, తేనె, సబ్బులు, నూనెలు, పచ్చళ్లు, బిస్కెట్లు ఇలా 125 ఉత్పత్తులను మార్కెట్ చేస్తున్నారు.

రైతులే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు

ఈ కంపెనీ ని లాభాల బాట పట్టించేందుకు, ధరలు నిర్ణయం, పర్యవేక్షణకు రైతులే డైరెక్టర్లుగా గవర్నింగ్ బాడీ పని చేస్తుంది. విజయనగరం జిల్లాకు చెందిన ఎర్రాప్రగడ సూర్యం అనే రైతు బోర్డ్ చైర్మన్, మరో ఐదుగురు రైతులు డైరెక్టర్లు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జీవీ రామాంజనేయులు ఎక్స్‌ పర్ట్‌‌‌‌ డైరెక్టర్. వీరితోపాటు ఒక సీఈవో, 20 మంది సిబ్బంది ఉన్నారు. ఫీల్డు వర్కర్లు మరో పది మంది.

ఎందరికో స్ఫూర్తి

నాబార్డ్, సెర్ప్, ఎన్ఐఆర్డీ, ఎన్ఐఏఎన్ సంస్థలు, వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖలు సహజ ఆహారం రైతుల కంపెనీ నుంచి స్ఫూర్తి పొందాయి. సిక్కిం , త్రిపుర ప్రతినిధులు ఈ విధానాన్ని పరిశీలించి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సంస్థకు నాబార్డు రుణం ఇచ్చింది. ఇప్పటికే సహజ ఆహారం రైతులు ఆస్ట్రేలియా నుంచి ఆర్డర్ అందుకున్నారు. సింగపూర్, అమెరికాలకూ ఉత్పత్తులను పంపే ప్రయత్నాల్లో ఉన్నారు.

50 శాతం వాటా రైతులకే..

సాధారణంగా మనం మార్కె ట్లో కొనే వ్యవసాయ ఉత్పత్తుల్లో వందకు 22 రూపాయలే రైతుకు వెళ్తుంది. కానీ ఈ పద్ధతిలో అన్ని ఖర్చులు పోను 50 శాతం రైతుకు వెళ్తోంది.

రూ. ఐదు కోట్ల టర్నోవర్ లక్ష్యం : రానున్న మూడేళ్లలో రూ.ఐదు కోట్ల టర్నోవర్ సాధిం చాలనేది టార్గెట్ . కోఆపరేటివ్స్ సంఖ్య 30కి పెంచాలి. చాలా మంది స్టోర్స్ నడుపుతామంటున్నారు. వారికి రెగ్యులర్ గా సరఫరా చేసేంత ఉత్పత్తులు లేవు. భవిష్యత్తు సేంద్రియ రైతుదే. – కె. రవి, సీఈఓ, సహజ ఆహారం

రైతులు ఆలోచనలో పడ్డరు : నాకు అరఎకరం ఉంది. కూరగాయలు వేస్తా. ఏడాదికోసారి వరి వేస్తా. ఇంటికి వచ్చి సరుకు తీసుకెళ్తారు. మార్కెట్ రేటుకంటే ఎక్కువకే అమ్ముతా. ఇప్పుడిప్పుడే నా తోటి రైతుల కూడా ఆలోచన చేస్తున్నరు. – శ్రీశైలం, ఆర్గానిక్ రైతు, ములుగు

లాభాల పత్తి పండిస్తున్నం : మా ఊరిలో 20 ఏళ్ల ముందు మేమే సేంద్రియ సాగు మొదలు పెట్టినం. ఐదెకరాల్లో ఒడ్లు, పత్తి వేస్తం. మిగతా వాళ్లంతా పత్తికి రసాయనాలు పోసి నష్టాలొచ్చి ఉరిబెట్టుకునే పరిస్థితి తెచ్చుకుంటున్నరు. మేం సేంద్రియ పత్తి వేస్తున్నం. పత్తి బరువు బాగా వస్తది. – కవిత, ఏనబావి, జనగామ జిల్లా

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy