రైతు బంధు : తొలకరి వర్షాలకు ముందే చేతిలో డబ్బు

kcr1404తొలకరి వర్షాలు కురవడానికి ముందే రైతుల చేతిలో డబ్బులుండాలని చెప్పారు సీఎం కేసీఆర్.  అందుకోసమే  కార్యక్రమం నిర్వహిస్తున్నామని వివరించారు. రైతుబంధు చెక్కులు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, మిషన్ భగీరథ, నాలుగో విడత హరితహారం సన్నద్ధత అంశాలపై  కేసీఆర్ కలెక్టర్లతో సమావేశమై చర్చించారు. రాష్ట్రంలోని అటవీ భూములకు కూడా రైతుబంధు పథకం వర్తించనుంది.

అటవీ హక్కుల చట్టం పత్రం ఉన్నవారికి ఎకరాకు రూ. 4 వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మేరకు అటవీ భూములకు ఆర్థిక సాయం వర్తింపచేస్తూ వ్యవసాయ శాఖ ఏప్రిల్ (21) శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 93 వేల మందికి పైగా రైతులు లబ్ధిపొందే అవకాశం ఉంది. 3 లక్షల ఎకరాలకు పైగా పెట్టుబడి సాయం అందనుంది. గిరిజన సంక్షేమ శాఖ విధివిధానాల ప్రకారం లబ్ధిదారులను గుర్తించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏజన్సీ ఏరియాలో వ్యవసాయం చేసే గిరిజనేతరులతో సహా పట్టాదారులైన రైతులందరికీ కొత్త పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి మద్దతు పథకం కింద ఆర్థిక సహాయం అందించే చెక్కులను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. కలెక్టర్ల నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగమంతా తమ శక్తియుక్తులను, వ్యూహ చతురతను పూర్తి స్థాయిలో వినియోగించి మే 10 నుంచి వారం రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించాలని సీఎం కోరారు.

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఎవరూ ఎత్తుకోని భారం మనం ఎత్తుకున్నామన్నారు సీఎం. భూ రికార్డులను సర్వే చేసి, కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం, రైతులకు పెట్టుబడి ఇవ్వడం లాంటి కార్యక్రమాలు గతంలో ఎప్పుడూ ఎవరూ నిర్వహించలేదన్నారు. గతానుభవం లేదు కాబట్టి.. కార్యక్రమాలను మనమే రచించుకుని, అమలు చేస్తున్నామన్నారు. అత్యంత జాగ్రత్తగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు. దార్శనికతతో కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. 58 లక్షల పాస్ పుస్తకాలు, చెక్కులు పంపిణీ చేయాల్సి ఉందన్న సీఎం.. నెలాఖరు వరకు పాస్ పుస్తకాలు, చెక్కుల ముద్రణ పూర్తవుతుందన్నారు.

జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా బుక్కులు, చెక్కులు వస్తాయని.. వాటిని జిల్లాల్లో భద్రపరిచి, గ్రామాలకు చేర్చాలన్నారు. చెక్కులు తీసుకున్న రైతులు వెంటనే బ్యాంకుల నుంచి నగదు పొందేందుకు ఏర్పాట్లు చేశామని.. పంట పెట్టుబడి మద్దతు పథకం కోసం రూ.12వేల కోట్లను బడ్జెట్ లో పెట్టుకున్నామన్నారు. మొదటి దఫా వర్షాకాలం పంట పెట్టుబడి కోసం రూ.6వేల కోట్లను సమీకరించామన్న సీఎం… ఈ డబ్బులు బ్యాంకుల్లో సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతులు చెక్కు ఇచ్చిన వెంటనే బ్యాంకులో నగదు చెల్లించాలని. లేనట్లయితే బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy