రైల్వే ‘మన కోసం’ జాబ్ మేళాకు అనూహ్య స్పందన

 

Dattatreyaరైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం దక్షిణమధ్య రైల్వే, కేంద్ర కార్మిక శాఖ తొలిసారిగా నిర్వహించిన జాబ్‌ మేళా ‘మన కోసం’ కు అనూహ్య స్పందన వచ్చింది. తార్నాక రైల్వే డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన ఈ మేళాను ప్రారంభించారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ. వివిధ కంపెనీల్లోని 10 వేల ఉద్యోగాల కోసం నిర్వహించిన ఈ మేళాకు 21 వేల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా 25 వేల మంది హాజరయ్యారు. దీంతో ప్రాంగణం కిటకిట లాడింది. పరిసర ప్రాంతాల్లో ఐదు గంటలకు పైగా ట్రాఫిక్‌ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దక్షిణమధ్య రైల్వే 6వ డివిజన్‌ పరిధిలోని సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, విజయ వాడ, గుంతకల్లు, నాందేడ్‌ సర్కిళ్ల రైల్వే ఉద్యోగులు, మాజీ ఉద్యోగుల పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జాబ్‌మేళాలో వివిధ కంపెనీలు అక్కడికక్కడే ఐదువేల మందికి నియామక ఉత్తర్వులిచ్చాయి. మిగిలిన ఐదువేల మందికి వారం తరువాత ఉత్తర్వులిచ్చి, శిక్షణ కార్య క్రమాలు చేపడుతామని చెప్పారు ఆ కంపెనీల అధికారులు. అయితే ఇందులో పాల్గొన్న 109 కంపెనీల్లో చాలావరకు టెలీకాలర్, సేల్స్, డెలివరీ బాయ్స్, సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌ వంటి ఉద్యోగాలే ప్రకటించడంతో ఎంతో ఆశతో వచ్చిన ఉన్నత విద్యావంతులైన నిరుద్యోగులు నిరుత్సాహపడ్డారు.

100 కెరీర్‌ గైడెన్స్‌ కేంద్రాలు: దత్తాత్రేయ

దేశoలో 60 శాతం ఉన్న యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రధాని మోడీ వివిధ పథకాలు తెస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. బ్రెజిల్‌ తదితర దేశాలతో ఉద్యోగ నియామకాలపై అవగాహన ఒప్పందాలు కుదిరాయన్నారు. దేశ వ్యాప్తంగా 100 జాతీయ కెరీర్‌ సేవల కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ కేంద్రం ప్రారంభించామని, త్వరలో వరంగల్, కరీంనగర్‌లతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, చిత్తూరు, వైజాగ్‌లలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందులో ఉద్యోగాలు రాని వారి కోసం ఆగస్టు మొదటి వారంలో మరో జాబ్‌మేళా నిర్వహిస్తామని చెప్పారు దక్షిణమధ్య రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ యాదవ్‌.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy