లక్ష్మీనారాయణ… జాయింట్ కమిషనర్ ఆఫ్ థానే

రాష్ట్రంలో అవినీతి కేసుల్లో అక్రమార్కులకు వణుకు పుట్టించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త బాధ్యతలకు రెడీ అయ్యారు. కొన్ని నెలలుగా పోస్టింగ్ ఇవ్వకుండా ఖాళీగా ఉంచిన మహారాష్ట్ర సర్కారు చివరికి థానే జాయింట్ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చింది. ఇన్వెస్టిగేషన్ లో ముక్కుసూటిగా, స్ట్రిక్ట్ గా పేరున్న లక్ష్మీనారాయణను ఉపయోగించుకోకుండా ఖాళీగా ఉంచడంపై చాలాకాలంగా మహారాష్ట్ర సర్కారుపైనా, కేంద్రంపైనా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రంలో జగన్ ఆస్తుల కేసుతో పాటు ఎమ్మార్ కేసు, ఓఎంసీ కేసు, సత్యం రామలింగరాజు కేసులను ఆయన దర్యాప్తు చేశారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో కావాలనే ఆయన్ను ఖాళీగా ఉంచారన్న విమర్శలు కూడా ఉన్నాయి. సమర్థుడైన అధికారిగా రాష్ట్రంలో ప్రజల్లోనూ మంచి క్రేజ్ తెచ్చుకున్న లక్ష్మీనారాయణ విధుల్లో ఉంటే తమకు తలనొప్పిగా మారతారనే మహారాష్ట్ర సర్కారు పోస్టింగ్ ఇవ్వకుండా నిలిపేసిందన్న విమర్శ కూడా ఉంది.

మరోవైపు ఖాళీగా ఉన్నా కూడా ఆ టైంని కూడా తనకు నచ్చిన పని చేయడానికి ఉపయోగించుకున్నారు లక్ష్మీనారాయణ. వివేకానందుడిని ఆదర్శంగా తీసుకున్న లక్ష్మీనారాయణ రిటైరయ్యాక మంచి స్కూలు పెట్టి మంచి వ్యక్తిత్వం ఉన్న పౌరుల్ని తయారుచేస్తానని తరచూ చెబుతుంటారు. కొన్ని నెలల కాలంలోనే రాష్ట్రమంతా తిరిగి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు. ఆయనకు ఉన్న గుర్తింపు చూసి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా ఆహ్వానం వచ్చింది. ఆలోచిస్తానని వారితో అన్నట్టు ఈ మధ్యే లక్ష్మీనారాయణ కామెంట్ చేశారు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఆయనకు పోస్టింగ్ రావడం విశేషం. పోలిస్ అధికారి అంటే ప్రభుత్వ సర్వెంట్ కాదని, ప్రజలకే సర్వెంట్ అని చెప్పే లక్ష్మీనారాయణ పోలీస్ అధికారులకు కూడా ఆదర్శంగా నిలిచారు.Lakshmi Narayana

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy