లాభమా – నష్టమా : భారత్ – చైనా యుద్ధం వస్తే ఏమవుతోంది

india-chinaఆ రెండు దేశాలు ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి సాధిస్తున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. అంతేకాదు… అత్యధిక జనాభా ఉన్న దేశాలు కూడా. ప్రపంచ జనాభాలో దాదాపు మూడో వంతు జనాభా ఈ రెండు దేశాల్లోనే ఉంది. అటువంటి రెండు దేశాలు చిన్న సరిహద్దు తగాదా విషయంలో యుద్ధానికి దిగితే? అది ద్వైపాక్షిక వాణిజ్యం మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఆర్థికంగా నష్టం ఏస్థాయిలో ఉంటుంది ? ఏ దేశం ఎక్కువగా నష్టపోతుంది? అనేవి ఆసక్తికరమైన ప్రశ్నలు. ఈ దేశాలు ఒకటి భారత్‌, మరొకటి చైనా. ఇరుగుపొరుగు దేశాలే అయినా ఏనాడూ ఈ దేశాల మధ్య  సయోధ్య లేదు. భారత్‌- భూటాన్‌- చైనా కూడలిలో తలెత్తిన సరిహద్దు తగాదా యుద్ధం వరకూ వెళ్తుందని ఎవరూ అనుకోవటం లేదు. కానీ పరిస్థితులు చేజారి, ఉద్రిక్తతలు పెరిగి ఇరుపక్షాలూ పట్టుదలకు పోతే యుద్ధం అనివార్యం అవుతుంది. అదే జరిగితే ఈ రెండు దేశాలు ఆర్థికంగా ఎంతో నష్టపోతాయంటున్నారు నిపుణులు.

అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ

.. మనదేశంతో పోల్చితే చైనా ఆర్థిక వ్యవస్థ ఐదు రెట్లు పెద్దది. దాదాపు 11.5 ట్రిలియన్‌ డాలర్ల చైనా ఆర్థిక వ్యవస్థ ఏటా 6- 7 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. ఒక ట్రిలియన్‌ డాలర్లంటే భారత కరెన్సీలో 65 లక్షల కోట్ల రూపాయలకు సమానం.

.. చైనా ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఎగుమతులు. ప్రపంచంలో ఏమూల ఏదేశంలో చూసినా చైనా వస్తువులు కనిపిస్తాయి. తయారీ రంగంలో సాధించిన అద్భుతమైన విజయాలే ఆ దేశం అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా ఎదిగేలా చేశాయి.

.. అగ్రరాజ్యమైన అమెరికాను సవాలు చేయాలని చైనా కలలు కంటూ… గత రెండు దశాబ్దాలుగా ఆ దేశం బలమైన ఆర్థిక వ్యవస్థను ఏర్పాటు చేసుకొంది.

.. ఎలక్ట్రానిక్స్‌, ప్లాస్టిక్స్‌, స్టీలు, బల్క్‌ డ్రగ్స్‌, సోలార్‌ ప్యానెళ్ల తయారీలో ఇప్పట్లో చైనా ఆధిపత్యాన్ని సవాలు చేసే దేశం లేదంటే అతిశయోక్తి కాదు.

..  139 కోట్ల మందితో ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా.

వేగంగా వృద్ధి సాధిస్తున్న దేశం

.. భారతదేశం ప్రత్యేకతలు వేరు. ఆర్థిక వ్యవస్థ 2.5 ట్రిలియన్‌ డాలర్లు మాత్రమే అయినప్పటికీ అత్యంత వేగవంతమైన వృద్ధిని సాధిస్తూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. ఏటా 7 శాతానికి పైగా వృద్ధి నమోదు చేస్తున్నది భారతదేశమే. 
..  భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా, చైనా, జపాన్‌ లకు దీటుగా మారుతుందని అంతర్జాతీయ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. 
.. చైనాకు భిన్నంగా దేశీయ వినియోగంపై భారత ఆర్థిక వ్యవస్థ అధికంగా ఆధారపడి ఉంది. 
* ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఫార్మాసూటికల్స్‌, ఆటోమొబైల్‌, దుస్తుల తయారీ, వజ్రాభరణాల తయారీలో భారతదేశం ముందంజలో ఉంది.
.. జీఎస్‌టీ వంటి సంస్కరణలు, మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో వేగవంతమైన వృద్ధి సాధన దిశగా భారతదేశం ముందుకు సాగుతోంది. 
.. జనాభా పరంగా చూస్తే చైనా తర్వాత అత్యధిక జనాభా ఉన్న దేశం భారత్‌. దాదాపు 130 కోట్ల మంది జనాభా ఉండగా, అందులో యువకుల శాతం అధికంగా ఉండటం ప్రత్యేకత.

నష్టం మనకే..

మనదేశానికి చైనా నుంచి దిగుమతులు నిలిచిపోతాయి. తత్ఫలితంగా తీవ్రమైన ఇబ్బందులు తప్పవు. కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు, విడిభాగాలు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు నిలిచిపోయి కమ్యునికేషన్ల రంగం ఇబ్బందిలో పడుతుంది. ప్రపంచ దేశాలన్నీంటికీ ఔషధాలు తయారు చేయగల ఫార్మాసూటికల్‌ పరిశ్రమ మనదేశంలో అభివృద్ధి చెందింది. కానీ ఔషధాల తయారీకి అవసరమైన బల్క్‌ ఔషధాల కోసం ఇక్కడి కంపెనీలు చైనాపై అధికంగా ఆధారపడుతోంది. అక్కడి నుంచి బల్క్‌ ఔషధాలు రాని పక్షంలో ఔషధాల తయారీ నిలిచిపోతుంది. మనదేశం నుంచి చైనాకు ఇనుప ఖనిజం, ఇతర వస్తువుల ఎగుమతులు అధికంగా నమోదు అవుతున్నాయి. ఈ ఎగుమతులు నిలిచిపోయి విదేశీ మారకద్రవ్యాన్ని మనం కోల్పోవలసి వస్తుంది. మరోపక్క భారతదేశంలో కొత్తగా పెట్టుబడులు పెట్టవద్దని చైనా కంపెనీలకు తాజాగా హెచ్చరిక చేసింది  చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy