లారీల సమ్మె: నిత్యావసర వస్తువులపై ఎఫెక్ట్

trucksతెలుగు రాష్ట్రాల్లో లారీ యజమానులు చేపడుతున్న సమ్మెకారణంగా సరుకు రవాణ స్తంభించిపోయింది. దీని ప్రభావం నిత్యావసర వస్తువులపై పడింది. తెలంగాణలోని అన్ని మార్కెట్లపైనా సమ్మె ఎఫెక్ట్ చూపుతోంది. లారీల యజమానులు మూడు రోజుల పాటు కొన్నిరకాల నిత్యావసరాలపై కొన్ని వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అన్నిరకాల ఉత్పత్తుల రవాణాను నిలిపివేశారు. దీంతో ముఖ్యమైన నిత్యావసరాలు, కూరగాయలు, ఇతర వస్తువులు రాకపోవడంతో ముఖ్యమైన హోల్‌సేల్‌ మార్కెట్లలో సమ్మె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సమ్మె ప్రారంభమై రెండు రోజులే అవుతున్న కారణంగా పరిస్థితి కొంత అదుపులోనే ఉన్నా మరో రెండు మూడు రోజులు దాటితే మాత్రం నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూరగాయలపై ప్రభావం తక్కువగా ఉన్నా, మిర్చి, ఉల్లి, కొబ్బరికాయలు, భవన నిర్మాణ సామగ్రి, ఇతర అనేక రకాల ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది.

తెలంగాణలోని కీలకమైన హోల్‌సేల్‌ మార్కెట్లకు వచ్చే సరుకుల్లో శుక్రవారం దాదాపు యాభై శాతం తగ్గినట్టు అధికారులు తెలిపారు. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌ మార్కెట్లకు వచ్చే ఉల్లి విషయానికి వస్తే పూర్తిగా నిలిచిపోయిందంటున్నారు వ్యాపారులు. మహారాష్ట్ర నుంచి రోజుకు దాదాపు 50 నుంచి 75 లారీల ఉల్లి హైదరాబాద్‌లోని మలక్‌పేట, బేగంబజార్‌ మార్కెట్లకు తరలి వస్తుంది. సమ్మెతో ఉల్లి దిగుమతి నిలిచిపోయింది. ప్రస్తుతానికి ప్రభావం తీవ్రంగా లేకపోయినా మరో రెండు మూడు రోజులు గడిస్తే పరిస్థితి చేయిదాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొంతమంది వ్యాపారులు ఇదే అదనుగా పెద్ద మొత్తంలో సరుకును గోడౌన్లకు తరలిసున్నారు. ఇక ప్రస్తుతం సీజన్ కావడంతో మార్కెట్లకు వచ్చే మిర్చిపై కూడా బంద్‌ ప్రభావం కనిపిస్తోంది. దీంతో మార్కెట్‌కు వచ్చే మిర్చి కూడా తగ్గింది. ఇప్పటికే ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. లారీల సమ్మెతో వారు మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. దీన్ని కొందరు దళారులు తమకు అనుకూలంగా మార్చుకుని రైతుల నుంచి తక్కువ ధరలకే మిర్చి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

మరోవైపు లారీ యజమానుల సమ్మెకు మద్దతుగా శనివారం హయత్‌నగర్‌ నుంచి ఆటోనగర్‌ వరకు భారీ రాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో లారీ యజమానుల సంఘం సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy