లాల్ దర్వాజ బోనాలకు భారీ ఏర్పాట్లు

Temple1తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు దర్పణం పట్టే లాల్‌దర్వాజా బోనాలకు ఓల్డ్ సిటీ ముస్తాబయింది. అమ్మవారికి బోనాల సమర్పణ కార్యక్రమం ఆదివారం(జూలై-16)న జరుగనుంది. ప్రధాన ఆలయాలకు వెళ్లే మార్గాలు, కూడళ్లలో స్వాగత తోరణాలు, కాషాయ జెండాలు, ఫ్లెక్సీలు, రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున పూజారుల మహాహారతితో వేడుకలు షురూ అయ్యాయి. ఆషాడమాసం చివరి ఆదివారం కావటంతో.. తెల్లవారుజాము నుంచే భక్తులు… అమ్మవారికి బోనం సమర్పించేందుకు క్యూ కట్టారు. డప్పుల దరువులు, పోతరాజుల వీరంగాల మధ్య.. హైదరాబాద్ బోనాల పండుగ సంబురాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అధికంగా తరలివచ్చే లాల్ దర్వాజా సింహవాహిని ఆలయం, అక్కన్న మాదన్న, మీరాలంమండిలోని మహంకాళి ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయాల దగ్గర.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ప్రభుత్వం తరపున అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు

తెల్లవారుజామున మొదలైన బోనాల జాతరలో.. రాష్ట్ర ప్రభుత్వం తరపున   మంత్రులు పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. మీరాలంమండిలోని శ్రీశ్రీశ్రీ మహాకాళేశ్వర ఆలయంలో హోంశాఖా మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారికి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి ఆలయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, దేవాదాయ-ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పిస్తారు. కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ ఆలయంలో నాయిని నర్సింహారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

విస్తృతంగా ఏర్పాట్లు.. 

పాతబస్తీలో వైభవోపేతంగా జరిగే బోనాలకు ప్రభుత్వం ఐదున్నర కోట్ల రూపాయల నిధులతో 220 అభివృద్ధి, మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేశామని GHMC దక్షిణ మండలం జోనల్‌ కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సుమారు రూ.50 లక్షలతో తాత్కాలిక వీధిదీపాలను ఏర్పాటు చేశామన్నారు. ఆలయాల వద్ద 500 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించామన్నారు. మూడు మొబైల్‌ శానిటేషన్‌ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. పాతబస్తీలోని 12 ప్రధాన ఆలయాల వద్ద ఆర్‌అండ్‌బీ వేదికలను ఏర్పాటు చేసింది. ప్రధాన ఆలయాల వద్ద ఆరు మొబైల్‌ మూత్రశాలలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. బోనాల జాతర సందర్భంగా ప్రధాన ఆలయాల దగ్గర.. జానపద కళారూపాల ప్రదర్శనకు ప్రత్యేక వేదికలు ఏర్పాటు చేశారు అధికారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy