వరాలిచ్చే వరలక్ష్మి : రావమ్మా మా ఇంటికి

వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఇవాళ (ఆగస్టు-24) రాష్ట్ర వ్యాప్తంగా  ఆలయాలన్నీ భక్తులతో సందడి నెలకొంది. అమ్మవారి ఆలయాలన్ని కిటకిటలాడుతున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు భక్తులు. శ్రావణ మాసం వచ్చిదంటే మహిళలు పూజలు పురస్కారాలతో బిజీగా ఉంటారు. అందులో శ్రావణ శుక్రవారం నాడు వచ్చిన వరలక్ష్మి వ్రతం  అంటే వారికి ఎంతో ఇష్టం. ఉదయం లేచి ఇంటిల్లి పాది స్నానాలు ఆచరించి.. కనువిందు చేసేలా అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి  పూజలు చేస్తారు. రకరకాల పిండివంటలతో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మరికొందరు  దగ్గర్లో ఉన్న దేవాలయాలకు వెళ్లి సామూహిక వరలక్ష్మి పూజల్లో పాల్గొంటారు. రోజంతా ఇంట్లో పండుగ వాతావరణం కన్పిస్తుంది.  శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం చేస్తారు. ముత్తయిదువులందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీదేవి, స్త్రీలకు సకలసంపదలూ ప్రసాదిస్తుందని నమ్మకం.

హిందూ సంప్రదాయంలో శ్రావణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో వివాహాలు, శుభకార్యాలు, పండుగలకు అనుకూలంగా ఉంటుంది. శ్రీమహావిష్ణువు దేవేరి లక్ష్మీని వరలక్ష్మీగా ఆరాధిస్తారు. ఈ వ్రతాన్ని వివాహిత మహిళలు నిర్వహిస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్మీలను పూజించిన ఫలితం. భర్త ఆరోగ్యం, అష్టైశ్వర్యాలు కలగాలని మహిళలు పూజిస్తారు. స్కంద పురాణంలో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లు ఉంది. స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ పొందే ఏదైనా ఓ వ్రతం గురించి తెలపమని పార్వతీదేవి కోరితే శివుడు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడట. అలాగే చారుమతీదేవి వృత్తాంతాన్ని  తెలియజేశాడట. స్త్రీలందరూ ఆ వ్రతాన్ని ఏటా ఆచరించి, సిరి సంపదల్ని అందుకుందన్నారి మహాదేవుడు తెలిపాడట. పార్వతీ దేవి ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.

అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీకి ఓ ప్రత్యేకత ఉంది. మిగతా పూజలకంటే వరలక్ష్మీ పూజించడం చాలా శ్రేష్ట్రం. శ్రీహరికి ఇష్టమైన, ఆయన జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టం, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని స్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఇంటికి వచ్చిన పేరంటాళ్లకు మర్యాద చేసి, కాళ్లకు పసుపు రాసి, నుదుట బొట్టు, మెడకు గంధం పెట్టి, చేతికి తోరం కట్టి, చేతిలో పండ్లు, తాంబూలం పెట్టి, నమస్కరించి, ఆశీస్సులు అందుకోవాలి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, మడులు పాటించినా, పాటించకపోయినా నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉండాలి. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి.

 

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy