వాటర్ వర్రీ : ఆ ప్రాజెక్టుల్లో అడుగంటాయి

sagarఈఏడాది రాష్ట్రంలో వానలు మంచిగానే పడ్డప్పటికీ.. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు మాత్రం అడుగంటుతున్నాయి. గోదావరి బేసిన్ లో పర్వాలేదనుకున్నా.. కృష్ణా బేసిన్ లో ఉన్న నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులలో  నీటిమట్టాలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. గోదావరి బేసిన్ లోని శ్రీరామ్ సాగర్, ఎల్లంపల్లి, లోయర్ మానేరు, సింగూరు ప్రాజెక్టుల్లోకి ఈసారి నీరు బాగాచేరింది. దీంతో ఈ ప్రాజెక్టుల క్రింద రైతులు రెండు పంటలు పండించుకున్నారు. కృష్ణా బేసిన్ లో  శ్రీశైలం, సాగర్ పూర్తిగా నిండలేదు. అయినా సాగర్ కాల్వలో నుంచి రబీకి నీళ్లు వదలాల్సిరావటంతో నీటిమట్టం పడిపోయింది.

సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ఇప్పుడు  504 అడుగులకు నీరు చేరింది. మొత్తం కెపాసిటీ 312 టీఎంసీలకు.. 121 టీఎంసీల నీరుంది. ఇంకా నాలుగైదు టీఎంసీలకు మించి సాగర్ లో నీళ్లు వాడుకోలేమని అధికారులు అంటున్నారు. శ్రీశైలంలో 885 అడుగుల నీటిమట్టానికి గాను 780.6 అడుగులకు నీరు చేరింది. 215 టీఎంసీలకు కేవలం 21 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. సాగర్ లో 500 అడుగులు, శ్రైశైలంలో 765 అడుగుల వరకు నీళ్లు తీసుకునే అవకాశం ఉంది. కానీ సాగర్ లో 502 అడుగులు, శ్రీశైలంలో 775 అడుగుల వరకే నీటి నిల్వలు వాడుకోవాలని ఇప్పటికే చెప్పింది కృష్ణాబోర్డు. దీంతో  సాగర్ లో 502 అడుగుల వరకు నీటి నిల్వలు ఉండేటట్టు చూడాలని .. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 765 అడుగుల వరకు.. సాగర్ కు నీటి విడుదలకు అనుమతించాలని.. కృష్ణాబోర్డుకు లేఖరాసింది రాష్ట్ర ప్రభుత్వం. జులై 15 వరకు అవే స్థాయి మట్టాలు కొనసాగించాలని కోరింది. తెలంగాణ వాటా నీళ్లు నగరానికి తరలించేందుకు నీటిమట్టం తగ్గడంతో.. ఎమర్జెన్సీ పంపింగ్ మొదలు పెట్టింది వాటర్ బోర్డు.

సాగర్, శ్రీశైలంలో నీటిమట్టాలు పడిపోవడంతో హైదరాబాద్ కు కృష్ణా వాటర్ సప్లై తగ్గే అవకాశముంది. సిటీకి కృష్ణా నుంచి 248, గోదావరి నుంచి 114, సింగూర్ నుంచి 18, మంజీరా నుంచి 30, మొత్తం 410 ఎంజీడీల నీళ్లు సరఫరా అవుతున్నాయి. కృష్ణా నుంచి నీటిని పంపింగ్ చేస్తున్నా.. గోదావరి నుంచి ఆ అవసరం ఉండకపోవచ్చని అనుకుంటున్నారు  అధికారులు. ఎల్లంపల్లిలో నీటి మట్టం బాగానే ఉంది. 485 అడుగులకు 472 అడుగుల నీళ్లున్నాయి. దీంతో గ్రావిటీతోనే నీళ్లొచ్చే అవకాశం ఉందంటున్నారు ఆఫీసర్లు.

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులలో ఆగస్టుకు గానీ నీరుచేరే అవకాశం లేకపోవడంతో .. రానున్న మూడు నెలల్లో గోదావరి బేసిన్ ప్రాజెక్టుల నుంచే నీటిని తీసుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర సర్కారు రిక్వెస్ట్ కు  కృష్ణాబోర్డు స్పందిస్తే.. హైదరాబాద్ కు నీటి కష్టాలు ఉండవు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy