వాట్సప్ ప్రచారంలో అబద్దాలు

fb-postపెద్ద నోట్ల రద్దుపై సోషల్ మీడియాలో చెత్త ప్రచారం జరుగుతోంది. వాట్సప్, ఫేస్ బుక్ లో  జనాన్ని భయపెట్టేలా తప్పుడు సందేహాలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీంతో ఏదీ నిజమో… ఏదీ అబద్ధమో తెలియని పరిస్థితి. సోషల్ మీడియా ప్రచారాన్ని గుడ్డిగా నమ్మొద్దంటున్నారు నిపుణులు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో అర్థంలేని ప్రచారాలు చాలా జరుగుతున్నాయి. సరదాగా జోకులు వేసుకొని నవ్వుకోవడం వరకు ఓకే. కానీ జనాన్ని భయపెట్టేలా కొందరు పనిలేనివాళ్లు ప్రచారాలు మొదలుపెట్టారు. వీటిపై కేంద్రం నుంచిగానీ, ఆర్బీఐ నుంచిగానీ ఎలాంటి ప్రకటనలు లేవు. నిజానికి అలాంటివి జరిగే అవకాశం కూడా లేదు. ఇలా సోషల్ మీడియా వేదికల్లో జరుగుతున్న చెత్త ప్రచారాల్లో ఎక్కువగా జనాన్ని భయపెడుతున్నవి చూద్దాం.

పాత నోట్లు ఇక చిత్తకాగితాలే…

ఇదొక తప్పుడు వాదన. నోట్ల రద్దు వల్ల ఉన్ననోట్లు చెల్లకుండా పోయినా వాటిని బ్యాంకులో మార్చుకోవడం, డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న నోట్లు పొట్లాలకు, తూకానికి వేసుకునేంత పరిస్థితి లేదు.

100, 50 నోట్లు కూడా రద్దవుతాయి..

చిన్న నోట్ల రద్దు ఆలోచనే లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో ఉప్పు కొరత వచ్చింది

నోట్ల రద్దు ముసుగులో జరిగిన ప్రచారం ఉంది. దేశంలో అసలు ఉప్పు కొరతే లేదు. కావాల్సినంత మార్కెట్లో ఉంది. తప్పుడు ప్రచారం వల్ల కొంతమంది బ్లాక్ చేసి ఎక్కువకు అమ్మే ప్రయత్నం చేశారు.

అందరి లాకర్లు తెరిపించి సోదాలు చేస్తారు

అసలు వ్యక్తిగత లాకర్లు తెరిచే అవకాశమే లేదు. చట్ట ప్రకారం, కోర్టుల్లోను కూడా చెల్లదు. ఏదైనా అవినీతి కేసుల్లో ఉన్నవారి లాకర్లును మాత్రమే కోర్టు అనుమతితో తెరిచే అవకాశం ఉంది. కానీ ప్రతి ఒక్కరి లాకర్ నూ తెరిచే చాన్సే లేదు. అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం అంటున్నారు న్యాయనిపుణులు.

కొత్త నోటును స్కాన్ చేస్తే మోడీ ప్రసంగం కనిపించేలా సెక్యూరిటీ

ఇదొక అర్థం లేని ప్రచారం. అలాంటి ఫీచర్ లేదు. ఇది ఒక ప్రైవేటు యాప్ లో చేసిన ప్రయోగం మాత్రమే. 2వేల నోటు సెక్యూరిటీకి దీనికి సంబంధం లేదు.

కొత్త నోట్లలో ఎలక్ట్రానిక్ చిప్ ఉంది

అసలు అలాంటి విధానం ప్రపంచంలో ఏ కరెన్సీలోనూ లేదు. అలాంటిది రాలేదని నిపుణులు చెబుతున్నారు. మన కొత్త కరెన్సీలోనూ ఎలాంటి చిప్ లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు పనిలేనివాళ్లు సృష్టించినవే.

నోటు నలిపేస్తే గాంధీజీ కళ్లజోడు విరిగిపోతుంది

కొత్త నోట్లలో ఇలాంటి సెక్యూరిటీ ఫీచర్ లేదు. నోట్లను నలిపితే త్వరగా దెబ్బతింటాయి. కొత్తనోట్లపై ఏవైనా రాతలు రాస్తే చెల్లనినోట్లు అవుతాయని బ్యాంకులు చెబుతున్నాయి.

బ్యాంకులో ఎంత డిపాజిట్ చేసినా 200 శాతం పెనాల్టీ

ఇది కూడా తప్పుడు ప్రచారమే. రెండున్నర లక్షలు మించిన డిపాజిట్లను పరిశీలిస్తామని మాత్రమే ఐటీశాఖ ప్రకటించింది. వ్యక్తి ఆదాయానికి తగినట్టుగా లేకపోతేనే లెక్కలు అడుగుతామని చెబుతోంది. 10 లక్షలు మించిన డిపాజిట్లలో అక్రమ సంపాదనగా తేలిన సొమ్ముపై మాత్రమే పన్నుతో పాటు అంతకు 200 శాతం పెనాల్టీ వేస్తారని నిపుణులు అంటున్నారు.

గుజరాత్ వ్యాపారి 6వేల కోట్లు తిరిగిచ్చేశారు

గతంలో ప్రధాని మోడీ సూటు కొన్న గుజరాతీ వజ్రాల వ్యాపారి 6వేల కోట్ల డబ్బును ప్రభుత్వానికి ఇచ్చేశారని ప్రచారం జరిగింది. ఇది జాతీయ మీడియాలో కూడా రావడంతో అంతా నిజమే అనుకున్నారు. కానీ అంత డబ్బు, అక్రమ సంపాదన తనకు లేవని ఆ వ్యాపారవేత్త ప్రకటించారు.

ఇలాంటి ప్రచారాలు జనంలో అనవసర ఆందోళన రేపుతున్నాయి. ఇలాంటి నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. వాట్సాప్, ఫేస్ బుక్ లాంటి సోషల్ వేదికల్లో వచ్చే ఇలాంటి తప్పుడు సందేహాలను సర్క్యులేట్ చేయకుండా ఆపాలని సూచిస్తున్నారు.

One Response to వాట్సప్ ప్రచారంలో అబద్దాలు

  1. Bubby says:

    Goodnews. Keep it up. U showed that media is for creating awareness not for trp ratings.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy