వాన్న క్రై.. వచ్చేస్తోంది

hackerవాన్న క్రై.. ప్రపంచవ్యాప్తంగా 100కుపైగా దేశాలను గడగడలాడిస్తున్న మాల్‌వేర్‌. భారత్ తో సహా చాలా దేశాల్లో దీని ప్రభావం పడనుందన్న వార్తలతో ప్రభుత్వాలు బెంబేలెత్తుతున్నాయి. సోమవారం ఉదయానికల్లా దీని తీవ్రత మరింత విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఐరోపా పోలీస్ సంస్థ యూరోపోల్ అధిపతి రాబ్ వెయిన్ రైట్. మరోవిడత దాడికి అవకాశం ఉందని హెచ్చరించారు.

ఏం చేస్తుంది ఇది..?

ఈ సైబర్‌ దాడికి గురైన కంప్యూటర్‌ వ్యవస్థలోని ఫైళ్లను వైరస్‌.. తన పరిధిలోకి తీసేసుకుంటుంది. డబ్బు చెల్లిస్తేనే వాటిని విడుదల చేస్తామని దీని సూత్రధారులు బేరం పెడుతున్నారు. రష్యా, బ్రిటన్‌లు దీని వల్ల ఎక్కువగా నష్టపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల బ్యాంకులు, ఆసుపత్రులు, ప్రభుత్వ వ్యవస్థలపై దీని ప్రభావం కనిపించిన సంగతి తెలిసిందే. మరో విడత సైబర్‌దాడి తప్పదని, దాన్ని నిలువరించడం కష్టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భయంభయంగా…

సోమవారం ఉదయం ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగులు తమ కార్యాలయాల్లో కంప్యూటర్లు ఆన్‌ చేసినప్పుడు ఈ మాల్‌వేర్‌ విస్తృతి మరింత పెరుగుతుందని చెబుతున్నారు వెయిన్‌రైట్‌. పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు కూడా దీని ధాటికి కుదేలయ్యాయని తెలిపారు. ఈ వైరస్‌ చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. మాల్‌వేర్‌ సోకిన కంప్యూటర్‌ నుంచి మొత్తం నెట్‌వర్క్‌కు వ్యాపించేలా ఒక ‘వార్మ్‌’ సంకలనంతో దీన్ని రూపొందించారని తెలిపారు.

విరుగుడు కనుగొన్న హీరో

వాన్నక్రై జోరుకు కళ్లెం వేయడానికి 22ఏళ్ల బ్రిటన్ యువకుడు విశ్వప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు. ఈ యువ టెకీ పూర్తి వివరాలు తెలియకపోయినా.. అతనిపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వర్షం కురుస్తోంది. ‘మాల్‌వేర్‌టెక్‌’ పేరుతో… దీనికి కిల్ స్విచ్ ను కనుగొన్నాడు. ఈ హానికర సాఫ్ట్‌వేర్‌ కోడ్‌కు సంబంధించిన ‘కిల్ స్విచ్ తో’ కనుగొని, దాని వ్యాప్తికి అడ్డుకట్టవేయగలిగాడు. ఇప్పటికే మాల్‌వేర్‌ బారినపడ్డ కంప్యూటర్లను సరిచేయలేకపోయినా.. కొత్తవాటికి వ్యాప్తి చెందకుండా అడ్డుకోవడంలో ఇది దోహదపడింది. ‘‘అది ఒకింత అనుకోకుండా జరిగింది. ఈ వైరస్‌ గురించి శోధిస్తూ.. ఒక రాత్రి మొత్తం నిద్రపోలేదు’’ అంటున్నాడు ఈ హీరో.

వేట మొదలైంది..

ఈ సైబర్‌దాడి కారకులను పట్టుకునేందుకు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐతో కలసి పనిచేస్తున్నట్లు వెయిన్‌రైట్‌ చెప్పారు. ‘‘గోప్యంగా ఇదంతా చేస్తున్నామని సైబర్‌ నేరగాళ్లు భ్రమపడుతున్నారు. మాకు అందుబాటులో ఉన్న అన్ని సాధనాలను ఉపయోగించి, వారిని గుర్తిస్తాం’’ అని బ్రిటన్‌ జాతీయ నేర పరిశోధన సంస్థ తెలిపింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy