వివాదాస్ప‌ద ఆధ్యాత్మిక గురు చంద్ర‌స్వామీజీ క‌న్నుమూత‌

chandra swamiఆధ్యాత్మిక గురు.. త‌న‌ను తానే దేవుడిగా ప్ర‌క‌టించుకున్న స్వామీజీ చంద్ర స్వామి క‌న్నుమూశారు. గ‌త కొద్దిరోజులుగా ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. మ‌ల్టిపుల్ ఆర్గ‌న్ ఫెయిల్యూర్‌తో బాధ‌ప‌డుతూ మ‌ధ్య‌లో గుండెపోటు రావ‌డంతో స్వామీజీ మ‌ర‌ణించారు. దేశంలో పెద్ద జోతిష్యుడిగా పేరుగాంచిన చంద్ర‌స్వామీజీ ఆ త‌ర్వాత మాజీ దివంగ‌త ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు అత్యంత స‌న్నిహితుడిగా మార‌డంతో వెలుగులోకి వ‌చ్చారు.
చంద్ర‌స్వామీజీపై ఎన్నో అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. విదేశీమార‌క నిర్వ‌హ‌ణ చ‌ట్టాన్ని(ఫెమా) ఉల్లంఘించినందుకు  గ‌తంలో ఈడీ కేసు న‌మోదు చేయ‌డంతో సుప్రీంకోర్టు ఈయ‌న‌కు జ‌రిమానా కూడా విధించింది.
ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లువురికి ఆధ్యాత్మికత ప‌రంగా స‌ల‌హాలు ఇచ్చినందుకు కూడా చంద్ర‌స్వామీజీ వార్త‌ల్లో నిలిచారు. వీరిలో బ్రూనే సుల్తాన్‌,బ‌హ్రెయిన్‌కు చెందిన షేక్ ఇసా బిన్ స‌ల్మాన్ అల్ ఖ‌లీఫా, న‌టి ఎలిజ‌బెత్ టేల‌ర్‌, అప్ప‌టి బ్రిటన్ ప్ర‌ధాని మార్గ‌రెట్ థాచ‌ర్‌, ఆయుధాల డీల‌ర్ అద్నాన్ ఖ‌షోగీ, ముంబై పేలుళ్ల ప్ర‌ధాన సూత్ర‌ధారి దావుద్ ఇబ్ర‌హీంలు ఈ జాబితాలో ఉన్నారు.

చంద్ర‌స్వామి ఎవ‌రు?
వివాదాస్ప‌ద స్వామీజీగా పేరుగాంచిన చంద్ర‌స్వామి 1948లో జ‌న్మించారు. రాజ‌స్థాన్‌లోని బెహ్‌రూర్ నుంచి వ‌చ్చిన‌ట్లు చెబుతారు. మాజీ ప్ర‌ధాని రాజీవ్‌గాంధీని హ‌త్య చేసేందుకు కావాల్సిన డ‌బ్బును స్వామీజీ స‌మ‌కూర్చార‌న్న ఆరోప‌ణ‌లు అప్ప‌ట్లో పెద్ద దుమారం రేపాయి. ఈ కేసులో చంద్ర‌స్వామి పాత్ర ఉందంటూ జైన్ క‌మిష‌న్ ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన నివేదిక‌లో పేర్కొంది.1996లో లండ‌న్‌కు చెందిన పారిశ్రామిక‌వేత్తను మోసం చేసిన కేసులో చంద్ర‌స్వామీజీ అరెస్ట్ అయ్యారు. ఆ త‌ర్వాత ప‌లుమార్లు ఫెమా చ‌ట్టాన్ని ఉల్లంఘించినందుకు విచార‌ణ ఎదుర్కొన్నారు.

రాజీవ్ గాంధీ హ‌త్య‌లో ప్ర‌మేయం
చంద్ర‌స్వామీజీకి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప‌రిచ‌యాల‌తో రాజీవ్‌గాంధీని హ‌త్య చేసేందుకు లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ ఈల‌మ్ (LTTE)కు ఆయుధాలు, డ‌బ్బులు స‌మ‌కూర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించార‌ని జైన్ క‌మిష‌న్ త‌న నివేదిక‌లో పేర్కొంది. రాజీవ్‌గాంధీ హ‌త్య కుట్ర‌లో చంద్ర‌స్వామీజీది ప్ర‌ధాన పాత్ర ఉంద‌ని జైన్ క‌మిష‌న్ తెలిపింది. రాజీవ్‌గాంధీ హ‌యాంలోనే చంద్ర‌స్వామీజీ అరెస్ట్ అయ్యాడు. అనంత‌రం విదేశాల‌కు వెళ్లేందుకు అన్ని అనుమ‌తులు ర‌ద్దు చేసింది నాటి రాజీవ్‌గాంధీ స‌ర్కార్. ఇది మ‌న‌సులో పెట్టుకుని రాజీవ్‌గాంధీ హ‌త్య‌కు కుట్ర‌ప‌న్నిన LTTEకి అన్ని విధాలుగా సాయం అందించాడ‌ని ఇంకా పూర్తి స్థాయిలో విచార‌ణ చేయాల‌ని జైన్ క‌మిష‌న్ త‌న నివేదిక‌లో పేర్కొంది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy