విశేషాలు ఇవే : బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కు శంకుస్థాపన

Narendra-Modi-and-Shinzo-Abe-bullet-trainముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు పనులకు గురువారం (సెప్టెంబర్ 14) జపాన్ ప్రధాని షింజో అబేతో కలసి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్ నుంచి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన బుల్లెట్ రైల్ శంకుస్థాపన కార్యక్రమ వేదిక పై నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా రెండు దేశాల ప్రధాన మంత్రులు శిలాఫలకాలను ఆవిష్కరించారు.

మేకిన్ ఇండియా చేస్తాం : జపాన్ ప్రధాని అబే

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభం తర్వాత.. ‘నమస్కార్’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు జపాన్ ప్రధాని షింజో అబే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం ఇప్పటికే 100 మంది ఇంజినీర్లు జపాన్ నుంచి భారత్‌కు వచ్చినట్లు తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్-జపాన్ కీలక భాగస్వాములని అబే చెప్పారు. భారత్‌లో మానవ వనరులకి జపాన్ టెక్నాలజీ తోడైతే ఇండియా ‘ప్రపంచ కర్మాగారం’గా నిలుస్తుందని స్పష్టం చేశారు అబే.

భారతీయ రైల్వే భద్రతకు జపాన్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. జై జపాన్‌-జై ఇండియా నినాదంతో రెండు దేశాలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మళ్లీ భారత్‌కు వచ్చినప్పుడు ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలులో ప్రయాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

హైస్పీడ్ కారిడార్లతోనే అభివృద్ధి : మోడీ

ప్రతిదేశానికి కలులు ఉండాలని.. వాటిని సాకారం చేసుకోవాలన్నారు ప్రధాని మోడీ. అహ్మదాబాద్‌లో బుల్లెట్‌ రైలు మార్గానికి శంకుస్థాపన తర్వాత మాట్లాడిన ప్రధాని.. భారత్‌ చిరకాల స్వప్నం పట్టాలు ఎక్కనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ఉద్యోగాలను, వేగాన్ని, పర్యావరణ పరిరక్షణను, జపాన్‌ స్నేహాన్ని తీసుకువస్తుందన్నారు.

ఏ దేశ అభివృద్ధికైనా రవాణా వ్యవస్థే ప్రాథమిక అవసరమన్నారు. భవిష్యత్ తరాలు హై స్పీడ్‌ కారిడార్‌లతోనే అభివృద్ధి చెందుతాయన్నారు. సాంకేతికతతో పేదలకు సాధికారత ప్రయత్నిస్తే పేదరికంపై విజయం సాధించినట్లేనన్నారు. మన రైల్వే సంస్థ చాలా పెద్దదన్న మోడీ.. ఒక వారం రైళ్లలో ప్రయాణించే మన దేశ ప్రజల సంఖ్య.. జపాన్‌ మొత్తం జనాభాకు సమానమని చెప్పుకొచ్చారు. సగటు భారతీయుడికి మెట్రో రైలు ప్రయాణం అందుబాటులోకి తీసుకురావటమే లక్ష్యమని ప్రకటించారు. ఈ భారీ ప్రాజెక్టు ద్వారా వేగవంతమైన రవాణా వ్యవస్థను నెలకొల్పటంతోపాటు ఉద్యోగాల కల్పన ఆస్కారం లభించదన్నారు. కాలుష్య రహితం అయిన ఈ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు మన జీవితాలలో కీలకంగా మారబోతుందని అభిప్రాయపడ్డారు ప్రధాని మోడీ.

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు విశేషాలు..

ముంబై-అహ్మదాబాద్‌ మధ్య 508 కిలోమీటర్ల వరకు ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. ప్రాజెక్ట్ వ్యయం  లక్షా 10వేల కోట్ల రూపాయలు. ఇందులో జపాన్ రుణం 88 వేల కోట్లు. కేవలం 0.1శాతం వడ్డీకే ఈ రుణం అందిస్తోంది. ఈ రైలు వేగం గంటకి 350 కిలోమీటర్లు. మూడు గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి ముంబై వెళ్లొచ్చు. 20 వేల మంది కార్మికులకు ఉపాధి లభిస్తోంది. ప్రాజెక్ట్ పూర్తయ్యే నాటికి మరో నాలుగు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఇప్పటికే ఇంజినీరింగ్ పనులు ప్రారంభం అయ్యాయి. 2022 అంటే ఐదేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy