వీళ్లు ఎంతమందికి గుర్తున్నారు..?

జీవితమే ప్రజాసేవ… స్వామి రామానంద తీర్థ

srtm01స్వామి రామానంద తీర్థ… తెలంగాణ గడ్డపై ప్రజాస్వామ్యం, స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల కోసం పోరాడిన నాయకుడు. హైద్రాబాద్ సంస్థాన విమోచనానికి పాటు బడ్డ మహానాయకుడు. సన్యాసిగా తన జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేసిన మహనీయుడు. అలాంటి మహానేత పుట్టింది ఇవాళే. రామానంద తీర్థ అసలు పేరు వేంకటరావు ఖేడ్గీకర్‌. తండ్రి భాపూరావు, తల్లి యసుబాయి.1903 అక్టోబరు 3న అప్పటి హైదరాబాదు సంస్థానంలోని గుల్బర్గా జిల్లా, ఝవర్గీ తాలూకా సింద్గీ గ్రామంలో పుట్టారు. హైస్కూల్ స్టూడెంట్ గా ఉన్నప్పుడు 1920 జూలై 31న రాత్రి లోకమాన్య బాలగంగాధర తిలక్‌ కాలధర్మం చెందారన్న వార్త విని బ్రహ్మచారిగా తన జీవితాన్నంతా మాతృభూమి సేవకే అంకితం చేస్తానని ప్రతిజ్ఞ చేసి, జీవితాంతం అలాగే ఉండిపోయిన ధీరోధాత్తుడు. 1932లో సన్యాస దీక్ష తీసుకున్న ఈయన ‘స్వామీ రామానంద తీర్థ’ గా మారారు. స్టేట్‌ కాంగ్రెస్‌ అనే సంస్థను నెలకొల్పడానికి స్వామీజీ ప్రయత్నం చేస్తుండగా, స్టేట్‌ కాంగ్రెస్‌ సంస్థను నిజాం ప్రభుత్వం 1938 సెప్టెంబర్ లో నిషేధించింది.

ఆ నిషేధాజ్ఞలకు నిరసనగా స్వామి రామానంద తీర్థ హైదరాబాదులో 1938 అక్టోబరు 27న సత్యాగ్రహం చేయగా ప్రభుత్వం ఆయన్ను బంధించి, 18 నెలలు కఠిన శిక్షను అమలుచేశారు. దేశీయ సంస్థానాల మహాసభ కార్యనిర్వాహక వర్గ సభ్యులుగా ఉన్నారు. హైదరాబాదు సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావాలని ఉద్యమాన్ని ప్రారంభించినందుకు ఆయనను 1948 జనవరిలో బంధించి, అనేక జైళ్ళల్లో ఉంచారు. నిజాం సైన్యం భారత ప్రభుత్వ సైన్యానికి లొంగిపోయిన 1948 సెప్టెంబర్‌ 17న నిర్బంధం నుంచి విడుదలయ్యారు రామానంద. 1952 నుంచి 1962 వరకు లోకసభ సభ్యులుగా ఉన్నారు.1953లో హైదరాబాదు నగరంలో తొలిసారిగా జరిగిన అఖిల భారత కాంగ్రెస్‌ మహాసభకు స్వామీజీ ఆహ్వాన సంఘాధ్యక్షులుగా వ్యవహరించారు. హైదరాబాదు సంస్థానాన్ని భాషా ప్రాతిపదికపై విభజించాలని 1953లోనే గట్టిగా కోరిన స్వామీజీ ఎనిమిది తెలంగాణా జిల్లాలను…. మద్రాసు రాష్ట్రం నుంచి వేరుచేసిన ఆంధ్ర ప్రాంతంలో కలిపేసి తెలుగు ప్రజల చిరకాల వాంఛయైన విశాలాంధ్రను ఏర్పాటు చేయాలన్న ప్రకటన చేశారు. అంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తర్వాత ఆయన అంధ్రప్రదేశ్‌ పౌరుడుగానే హైదరాబాదులో నివాసమేర్పరచుకొన్నారు.1957 నుంచి ఆయన ఉస్మానియా సెనేట్‌లో శాశ్వత సభ్యులుగా కొంతకాలం ఉన్నారు. వినోభాబావే ప్రారంభించిన భూదాన్‌ ఉద్యమానికి ఆయన చేయూతనిచ్చారు. చిరకాలం దేశసేవలోనే గడిపిన ఆయన 1972 జనవరి 22న తన 69వ ఏట కన్నుమూశారు.

హైదరాబాద్ భగత్ సింగ్… నారాయణరావు పవార్

NarayanaRaoPawarనిజాం నవాబులపై ఎంతో మంది పోరాటం చేశారు. కానీ ఏకంగా మీర్ ఉస్మాన్ అలీ అసఫ్ జాపైనే బాంబు దాడి చేసి చరిత్రకెక్కాడు నారాయణ రావు పవార్. ఆయన పుట్టింది ఈరోజే. నిజాం నవాబుపై దాడితో ఆయనకు హైదరాబాద్ భగత్ సింగ్ గా పిలవడం మొదలెట్టారు. వరంగల్ లో 1926 అక్టోబర్ 3న పుట్టిన పవార్… లా చదివేందుకు హైదరాబాద్ కు వచ్చాడు. చిన్నప్పట్నించి ఉద్యమాలంటే ఆసక్తి. 1946లో దారుస్సలాంలో మైదాన్ లో మహ్మద్ అలీ జిన్నా ప్రసంగంతో కసి రగిలిన పవార్.. నిజాం నవాబుపై బాంబు దాడి చేయాలని డిసైడయ్యారు. దానికి తోడు మీరు రక్తాన్నివ్వండి… మీకు స్వాతంత్ర్యాన్ని నేనిస్తానన్న సుభాష్ చంద్రబోస్ మాటల్ని బాగా ఒంటబట్టించుకున్నారు. అంతే నవాబ్ ను చంపేయాలని ప్లాన్ చేశారు. అతనికి జగదీష్ ఆర్య, గండయ్య అర్య అనే ఇద్దరు సపోర్ట్ చేశారు. బాంబు దాడికి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆర్థిక సాయం చేశారంటారు. 1947డిసెంబర్ 4న నిజాం నవాబ్ పై దాడికి ప్లాన్ చేశారు. నారాయణ్ రావు పవార్ విసిరిన బాంబు పేలింది. కానీ మీర్ అలీ తప్పించుకున్నాడు. పవార్ పట్టుబడ్డాడు. మీర్ అలీ పవార్ కు ఉరిశిక్ష విధించాడు. ఉరిశిక్ష అమలవడానికి పది రోజుల ముందు ఆపరేషన్ పోలోలో భాగంగా మీర్ అలీ లొంగిపోవడంతో… పవార్ బతికిబయటపడ్డారు. రజాకార్ల పోరాటంతో పాటు ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్న పవార్…  85 ఏళ్ల వయసులో 2010 డిసెంబర్ 10న చనిపోయారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy