వెంకన్న కథలు: సప్తగిరుల్లో వెలసిన శ్రీవారు

Venkanna-Kathalu-Part04బ్రహ్మోత్సవం… బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం… ముక్కోటి దేవతలు… కోట్లాది భక్తులు కళ్లార్పకుండా చూసుకునే సంబరం. కోనేటి రాయుణ్ణి తనివి తీరా దర్శించుకొని తన్మయం చెందే మహోత్సవం. అలాంటి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా వీసిక్స్ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రోజుకో స్పెషల్ స్టోరీతో తిరుమల తిరుపతి చరితామృతం మీకోసం…

తిరుమల కొండలు చారిత్రక ఘట్టాలతో పుణ్యప్రదేశాలుగా వెలుగొందుతున్నాయి. ఇక్కడి కనిపించే ప్రతి దృశ్యంలో శ్రీహరి రూపం దర్శనమిస్తుంది. ఇంత ప్రాశస్త్యం ఉన్న కొండలను ప్రతి భక్తుడు జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే. ఇవాల్టి వెంకన్న కథల్లో కొండలలో నెలకొన్న కోనేటిరాయడి గురించి తెలుసుకుందాం..

ఏడు కొండలు…ఈ పేరు వింటేనే భక్తజనుల వళ్లు పులకరిస్తుంది. భక్తి ఆవహిస్తుంది. శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే ఏడుకొండలు. కలియుగంలో స్వామివారికి ఎంతవిశిష్టత ఉందో ఆయన నివశించే ఈ సప్తగిరులకూ అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషదాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు.

తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ ఏడుకొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది.. వైకుంఠంలో అలిగివచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న ఏడుకొండలపై కొలువైనాడని స్థలపురాణం చెబుతుంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ  ఉండే అనుచరులే… భూలోకంలోకి వచ్చి ఏడుకొండలుగా మారారని పురాణాలు చెబతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు. నంది వృషబాద్రి అయ్యాడు, హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీల… నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి  సేవచేస్తున్నాడు. ఇక నారాయణాద్రి, వేంకటాద్రిలు శ్రీవారి రూపాలే. ఈ రెండు కొండలు జయ, విజయులకు ప్రతిరూపాలు.

శ్రీనివాసున్ని కొండలరాయుడు అంటారు. లక్ష్మీపతిని శేషాచలపతి అంటారు. సప్తగిరివాసుడు, ఏడుకొండలవాడు ఇలా చెప్పుకుంటూ పోతే వేంకన్నకు చాలా పేర్లే ఉన్నాయి.  ఎందెందు వెతికి చూసిన అందందు కలవాడే నారాయణడు అన్నాడు పోతనామాత్యుడు తన భాగవతంలో. పురాణాలు. కోటాను కోట్లమంది యోగులు, సాధువులు, మునులు, మహర్షులు తిరుమల కొండల్లో… ఐక్యమయ్యారట.  అందుకే ఈ సప్తగిరి కొండల్లో కనిపించే ప్రతి రాయి, చెట్టూ, పుట్ట అన్ని కూడా చాలా పవిత్రమైనవి….శ్రీవారికి ప్రీతిపాత్రమైనవి.

ఇదిగో …ఈ  మనోహరమైన దృశ్యం చూడండి…స్వామివారు పవళించినట్టు లేదు. తిరుమల కొండల్లో ఏడుకొండల స్వామి ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పడానికి ఈ దృశ్యమే నిదర్శనం. చిరునవ్వులు చిందుస్తున్న స్వామివారి రూపాన్ని వి6 కెమెరామెన్ తిరుపతి అద్భుతంగా చిత్రీకరించాడు.

tirupathi-hillsఏడుకొండలే అలంకారాలుగా  స్వామివారి  రూపానికి సాక్షమిస్తాయి.  విశాలమైన నుదురు, కొటేరైన  ముక్కు, చెరగని చిరునవ్వు రువ్వే పెదవులు ..ఇలా.. కొండలలో నెలకొన్న రాయుడ్ని చూడ్డానికి రెండుకళ్లు చాలావు.

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర్నుంచి చూసినా, భూలోకంలో వేంకన్నను అమ్మలా లాలించిన వకులాదేవి ఆలయం దగ్గర్నుంచి చూసినా ఈ అద్భుత రూపం సాక్షాత్కరిస్తుంది. శేషాద్రిపై వెంకన్న శయనిస్తున్న ఈ దృశ్యాన్ని చూస్తే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. ఏడుకొండలపై సహజసిద్దంగా కనిపించే ఈ రూపం వెంకన్న శక్తిని, కలియుగ దైవత్వాన్ని కళ్లకుకడుతుంది. అందుకే అన్నమయ్య ..కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు అని పులకించిపోయాడు.

ఇక ఏడుకొండల్లో స్వామి మహిమను తెలిపే మరో నిజరూపం కనిపిస్తుంది. రెండో ఘాట్ లో అఖరిమలుపులో కనిపించే నిలువెత్తు స్వామివారి రూపం ఇది. ఇక్కడ మరో విచిత్రం కూడా కనిపిస్తుంది. స్వామివారు కనిపించే రాయి మాత్రమే నల్లగా ఉంటుంది. మిగతా కొండ అంతా తెలుపే. శ్రీవారి ఈ రూపం… అచ్చం ఆనందనిలయంలోని స్వామిరూపాన్ని పోలిఉంటుంది. ఇది…. మాయో, మిథ్యో….. అంతా ఆ స్వామివారికే తెలియాలి. శేషాచలం కొండల్లో ప్రతి అణువులో స్వామివారి రూపం ఉంటుందనటానికి ఈ రూపం కూడా ఓ సాక్ష్యం.

Garuda Rock (3)ఇక స్వామివారి వాహనమైన గరత్మంతుడు కూడా శేషాచలం కొండల్లో కొలువైనాడు. మొదటి ఘాట్ రోడ్ లో వినాయకుడి ఆలయం సమీపంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ఇక్కడి గరుత్మంతుడి రూపంపై ఒక పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. కలియుగం అంతమైనప్పుడు శ్రీనివాసుడు ఈ గరుత్మండిపైనే వైకుంఠం వెళ్తాడట.

ఇవే కాదు శేషాచల కొండల్లో ప్రతిరాయిలో ఒక రూపం కనిపిస్తుంది. ఈ కొండల సమూహం… శయనించిన శ్రీవారి రూపాన్ని కళ్లకుకడుతుంది.  ఇవన్నీ సహజంగా ఏర్పడినవే.  ఇవే కాదు… సహజశిలా తోరణం, వినాయకరూపాలు సప్తగిరుల్లో లెక్కలేనన్ని ఉన్నాయి. 30 ఆమడాల పొడవు, మూడు ఆమడాల వెడల్పు, 30వేల అడుగుల ఎత్తైన కొండలపై  సప్తగిరీషుడు కొలువై…ముల్లోకాలను ఏలుతున్నాడు.

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy