వెంకన్న కథలు – శేషాచలంలో అణువణువులో ఆధ్యాత్మికం

Venkanna-Kathalu-Part04శేషాచల కొండలు మరో అద్భుతమైన  ప్రదేశం. ఎందరో యోగులు తపస్సు చేసిన పరమ పవిత్రమైన స్థలం. దేవతలు నడయాడిన అద్బతమైన లోకం. వెంకన్న కథల్లో ఇవాళ ఆ స్థలాలను చూద్దాం.

తిరుమల కొండల్లో ప్రతి అణువు కు ఓ పవిత్ర గాధ ఉన్నది. స్కాందపురాణం, వేంకటాచల మహత్యం, విష్ణుపురాణాల్లో అనేక గాధలు ఈ కొండ మహాత్యాన్ని చెబుతున్నాయి. ఈ పురాణాల ప్రకారం శ్రీవారి సన్నిదికి 6కిలోమీటర్ల దూరంలో ఓ అధ్బుత ప్రపంచం ఉన్నది. పావవినాశనానికి పోయే దారిలో కనిపించే ఈ స్థలంలో అడుగుపెడితే ఎన్నో తీర్థయాత్రలు చూసిన అనుభూతి కలుగుతుంది. అదే జపాలి హనుమా క్షేత్రం.  ఈ ప్రదేశానికి ఉన్న మహాత్తు ఏంటో  ఓసారి చూడండి.

దట్టమైన అటవీ ప్రాంతంలో హనుమంతుడు స్వయంభువుగా వెలిసిన ఈ క్షేత్రాన్ని జపాలి హనుమ క్షేత్రం అంటారు.   జవాలి అనే ఓ మహర్షి హనుమంతుడి అవతారాన్ని ముందుగా దర్శనం చేసుకునేందుకు ఇక్కడ తపస్సు చేశాడు. జవాలి కఠోరమైన తపస్సుకు మెచ్చిన హనుమంతుడు ఆయనకు దర్శనమిచ్చాడు. ఆయన వెలిగించిన దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉన్నది. జపం కారణంగా అవతరించిన ఈ హనుమంతునికి జపాలి హనుమా అనే పేరు వచ్చిందట. ఇక్కడి ఆంజనేయుడి రూపం చాలా భిన్నంగా కనిపిస్తుంది.

తిరుమల క్షేత్రంలో ఇది చాలా అందమైన ప్రదేశం. ఆకాశం కనిపించనంత గుబురైన, ఎతైన చెట్లు. ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది. ఆలయం చుట్టుపక్కల అనేక రకాలైన పండ్ల చెట్లు కూడా ఉంటాయి. హతీరాంజి ఆశ్రమానికి చెందిన సాధువులే ఈ ఆంజనేయుడికి పూజలు నిర్వహిస్తారు.

ఇక ఈ ఆలయం ముందు కనిపించే కొలనును రామ కొలను అంటారు. ఈ రామకొలను చాలా విశిష్టమైనదిగా చెబుతుంది స్కాందపురాణం. రావణ సంహారం తర్వాత  రాముడు సతీసమేతంగా అయెధ్యకు వెళుతుండగా ఒక రోజు ఇక్కడ బస చేశాడని చెబుతున్నాయి పురాణాలు. రాముడు ఈ కొలనుతో స్నానం చేసిన కారణంగానే దీనికి రామకొలనుగా పేరువచ్చిందట. ఇక ఈ కొలనులో నీటికి చాలా అద్భుతాలు ఉన్నాయి. ఈనీళ్లు ఏ కాలమైన తరగవు, పెరగకుండా ఉంటాయి. ఎప్పుడు స్వచ్ఛంగా కనిపించే ఈ నీళ్లలో స్నానం చేస్తే కష్టాలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. ఈ నీటితోనే ప్రతిరోజు హనుమంతుడికి కైంకర్యం నిర్వహిస్తారు. జన్మశనితో పుట్టిన వాళ్లు ఈ నీళ్లలో స్నానం చేసి జపాలి హనుమకు అభిషేకం చేస్తే శనిపోతుందట. ప్రతి పౌర్ణమిరోజు ఈ కొలను మొత్తం దీపాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు జపాలి భక్తులు.

ఇక జపాలి ఆలయం వెనకభాగంలో కనిపించేది ఈ కొలను కూడా ఓ చరిత్ర ఉంది. పచ్చని వాతావరణంలో అద్దంలా మెరుస్తున్న ఈ కొలనును సీత కొలను అంటారు.  చుట్టూ గుబురైన చెట్ల మధ్యలో ఉన్న ఈ కొలను దగ్గరకు వెళ్లేవరకు కనిపించదు.

సీతమ్మ స్నానం ఆచరించేందుకు లక్ష్మణుడు తన భానంతో తవ్విన కొలను ఇది. అందుకే ఈ కొలను కొంచెం రహస్య ప్రదేశంలో ఉన్నట్లుంటుంది. అందమైన ఈ సీతకొలనును దాటుకుని కొద్ది దూరం వెళితే ద్వాపరయుగంలో ధృవుడు అనే యోగి తపస్సు చేసిన స్థలం కనిపిస్తుంది. కీకారణ్యాన్ని తలపించే ఈ స్థలం కూడా పవిత్రమైనది. మహా విష్ణువు దర్శనం కోసం ఐదేళ్ల వయస్సులో దృవుడు ఇక్కడే అన్నపానియాలు లేకుండా తపస్సు చేశాడు. కఠోరమైన దృవుడి తపస్సుకు మెచ్చి అతనికి మహావిష్ణవు దర్శనమిచ్చాడు. శ్రీనివాసుడి రూపం కంటే ముందు శేషాచలకొండల్లో మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చింది  ఇక్కడే.

దృవుడి దప్పిక తీర్చేందుకు మహావిష్ణువు సృష్టించిన నీటి ధార ఇప్పటికీ అక్కడ ప్రవహిస్తూనే ఉంది. ఆకుల మధ్య నుంచి వస్తున్న ఈ నీటి ఊట యుగాలనుంచి ప్రవహిస్తూన్నది. ఈనీటిలో అనేక ఔషదగుణములు ఉన్నాయని చెబుతున్నాయి పురాణాలు. తీయని రుచితో, ఎండాకాలంలోనూ చల్లగ, అత్యంత స్వచ్చంగా కనిపించే ఈ నీళ్లను  తాగితే రోగాలు నయమవుతాయని నమ్ముతారు భక్తులు. జపాలి క్షేత్రానికి వచ్చిన భక్తులంతా తప్పకుండా ఇక్కడ నీటిని సేవించి వెళ్తారు.

దృవుడు తపస్సు చేసిన ఈ పవిత్ర స్థలంలో ఇప్పటికీ చాలా మంది భక్తులు ఇక్కడ తపస్సు చేసుకుంటుంటారు. ఇక్కడ మరొకథనం కూడా ఉంది. ఈ స్థలంలో హనుమంతుడి తల్లి అంజనాదేవి, దత్తాత్రేయుడు వంటి వాళ్లు కూడా ఇక్కడ తపస్సు చేశారట. నిత్యం గోవింద నామస్మరణ వినిపించే ఈ క్షేత్రంలో రామనామం కూడా కలిసింది. ఓం నమో భగవతే వాసుదేవాయా అన్న మంత్రాన్ని కలియుగంలో దృవుడి నోట మొదటగా ఉచ్చరించింది కూడా ఈ స్థలంలోనే. అందుకే తిరుమల కొండల్లో ఈ స్థలం చాలా శక్తివంతమైనది.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy