వెంకన్న కథలు: తోబుట్టువుల తోడుగా శ్రీవారు

Venkanna-Kathalu-Part04బ్రహ్మోత్సవం… బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం… ముక్కోటి దేవతలు… కోట్లాది భక్తులు కళ్లార్పకుండా చూసుకునే సంబరం. కోనేటి రాయుణ్ణి తనివి తీరా దర్శించుకొని తన్మయం చెందే మహోత్సవం. అలాంటి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా వీసిక్స్ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రోజుకో స్పెషల్ స్టోరీతో తిరుమల తిరుపతి చరితామృతం మీకోసం…

తిరుమల కొండలో గ్రామదేవతలు  ఉన్నారు. యుగాలనుంచి వీళ్లంతా శ్రీవారికి దిష్టి తగలకుండా కాపాడుతున్నారు. అంతేకాదు ఈ వెంకన్నపై దుష్టశక్తుల చూపు పడకుండా రక్షణగా ఉంటున్నారు. వీళ్లకు తిరుమల స్థానిక ప్రజలే పూజలు నిర్వహిస్తారు. ఏటా పండగ చేస్తారు. ఈ దేవతల్ని తమ ఇంటిదేవతలుగా భావిస్తారు. శ్రీవారి సన్నిధిలో ఉన్న ఈ గ్రామదేవతలు సైతం శక్తిరూపిణులే.

వైష్ణవాలయాల దగ్గర శక్తిదేవతలు ఉంటారా…. ?  ఉంటారు… ఉన్నారు… తిరుమల వెంకన్న వెనక ఒకరు కాదు..ఇద్దరు కాదు…. ఏకంగా ఏడుగురు శక్తిదేవతలు ఉన్నారు. ప్రపంచానికి శ్రీనివాసుడొక్కడే తెలుసు కాని ఆయన చుట్టూ ఏడుగురు గ్రామదేవతలు ఉన్నారన్న విషయం చాలా మందికి తెలీదు. వీళ్లంతా తిరుమల తిరుపతి గ్రామదేవతలు. ప్రాచీన కాలం నుంచి స్థానికుల పూజలందుకుంటున్న ఈ అక్కగార్లు…మహా శక్తిమంతులు, మహిమాన్వితులు. ఈ దేవతలు ఎవరోకాదు శ్రీనివాసుడి ఆడపడుచులు.

ఏడుకొండలవాడు…. అఖిలాండ కోటి బ్రహ్మండనాయకుడు… ఒంటరివాడు కాదు. ఆయనది పెద్ద కుటుంబం. శ్రీవారికి ఏడుగురు తోబుట్టువులు ఉన్నారు. అన్న కోసం ఈ ఏడుగురు చెల్లెళ్లు ఏడుకొండల చుట్టూ రక్షణ కవచంగా ఏర్పడ్డారు… కంటికిరెప్పలా ఆయనను కాపాడుకుంటున్నారు. అందుకే తిరుమల స్థానికులు ఈ దేవతల్ని ముద్దుగా అక్కగార్లు అని పిలుచుకుంటారు. ఈ చెల్లెళ్లను గంగమ్మలని, సప్తగంగమ్మలు అని  పిలుస్తారు. లోకాన్నేలే… తమ సోదరుడిపై  దుష్టశక్తుల ప్రభావం పడకుండా, దిష్టి తగలకుండా ఈ ఆడపడుచులు రక్షణ కవచంగా ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. అందుకే  శ్రీనివాసుడి శక్తి వెనక ఈ స్త్రీ దేవతల ఆశిస్సులు ఉన్నాయని నమ్ముతారు ఇక్కడి ప్రజలు.

వెంకన్న చెల్లెళ్లలో అందరికంటే పెద్ద ఆడపడచు తాతయ్య గుంట గంగమ్మ. ఈ గంగమ్మ అంటే ఇక్కడి భక్తులకేకాదు శ్రీవారికి కూడా చాలా ఇష్టమట. తాతాచార్యులు అనే వైష్ణవ ఉపాసకుడు తన మంత్రశక్తిచేత ఈ గంగమ్మను తిరుపతిలో ప్రతిష్టించాడు. తిరుమల కొండపైకి వెళ్లేదారికి ముందుభాగాన ఈ గంగమ్మ ఆలయం ఉంటుంది. ప్రాచీనకాలంలో కొండపైకి వెళ్లే భక్తులు ముందుగా ఈ అమ్మవారిని దర్శించుకున్నాకే శ్రీవారిని సేవించుకునేవారు.

అయితే పురాణాల ప్రకారం ఈ గంగమ్మ అనుమతి తీసుకున్నాకే దేవతలు, మునులు, మహర్షులు వెంకన్నను దర్శించుకునేవారట. ఇక ఈ గంగమ్మకు ఏటా ఏడురోజుల జాతర నిర్వహిస్తారు. ఈ సందర్భంగా తన చెల్లెలైన గంగమ్మకు శ్రీవారు…చీర, సారే, పసుపు, కుంకుమ పంపిస్తారు. ఇది అనాధిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆడపడుచు సారేను నాలుగుమాడ వీదులగుండా ఊరేగింపుగా కొండమీద నుంచి కిందకు తీసుకువస్తారు. ఈ ఉత్సవంలో చెంపనరుకు ఉత్సవం చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. అమ్మవారి ఒంటికి పూసిన మట్టికోసం భక్తులు పోటీపడతారు. ఈ మట్టిని తిన్నవారికి సంతాన భాగ్యం కలుగుతుందని…వ్యాధుల నయం అవుతాయని నమ్ముతారు భక్తులు.

తిరుమల కొండపై ఆరుగురు చెల్లెళ్లు ఉంటారు. వీరిని కొండపై ఉన్న స్థానికులు పూజిస్తారు. కొండపై మొదట్లోనే పాచికాల గంగమ్మ ఆలయం కనిపిస్తుంది. ఈ గంగమ్మ పూర్తిగా అడవిలో ఉంటుంది. ఇక మరో సోదరి బాట గంగమ్మ పాప వినాశనానికి వెళ్లే దారిలో దర్శనమిస్తుంది.  ఈ గంగమ్మకు ప్రతిశుక్రవారం శ్రీవారి సన్నిధి నుంచి పాలు పెరుగు వస్తాయి. టీటీడీ అనాధిగా కొనసాగిస్తున్న ఈ సంప్రదాయం అన్నాచెళ్లెళ్ల అనుబందానికి ప్రతీక.

రాంబగీచ వెనకాల కనిపించే రాజరాజేశ్వరి అమ్మవారు, బాలాజీ నగర్ లో కొలువైన బాలత్రిపుర సుందరి, ఇంకా  ఎల్లమ్మలు, బాల గంగమ్మ శక్తిరూపినిలు తిరుమల వైభవానికి ప్రతీకలు.  అందుకే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ చెల్లెళ్లకు అడపడుచు మర్యాదల్ని ఆడంబరంగా జరుపుతున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోనే ఈ ఆలయాల నిర్వహణ కొనసాగుతుంది.

చరిత్రకారుల పరిశీలన ప్రకారం కొండల తీరాల్లో మొదటగా వెలిసింది గ్రామదేవతలే. గ్రామదేవతల నుంచే దేవతలు పుట్టారు.  వెంకన్న కంటే ముందుగానే ఈ గ్రామదేవతలు కొండల్లో కొలువైయ్యారనీ…అందకే శ్రీనివాసునికి అంత శక్తి, పవిత్రత వచ్చిందని నమ్ముతారు. అయితే గతంలో ఇక్కడ జంతుబలులు కూడా జరిగేవట. మహంతుల ఆలయ నిర్వహణ మొదలయ్యాక వీటిని నిషేధించారు.

అన్నగారు  లోకకళ్యాణంలో… నిమగ్నమై ఉంటే…. ఆ అన్నగారి క్షేమాన్ని ఈ ఏడుగురు తోబుట్టువులు ప్రతినిత్యం కోరుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే….. అనుబంధానికి, ఆత్మీయతకు…. శ్రీవారూ..ఆయన ఏడుగురు చెల్లెళ్ల వృత్తాంతమే ప్రత్యక్ష నిదర్శనం.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy