వెంకన్న కథలు: శ్రీనివాస కల్యాణం జరిగిందెక్కడ..?

Venkanna-Kathalu-Part04బ్రహ్మోత్సవం… బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం… ముక్కోటి దేవతలు… కోట్లాది భక్తులు కళ్లార్పకుండా చూసుకునే సంబరం. కోనేటి రాయుణ్ణి తనివి తీరా దర్శించుకొని తన్మయం చెందే మహోత్సవం. అలాంటి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా వీసిక్స్ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రోజుకో స్పెషల్ స్టోరీతో తిరుమల తిరుపతి చరితామృతం మీకోసం…

శ్రీనివాసుడి లోక కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి నాటి గుర్తులు నేటికి చెరిగిపోలేదు. ఒక్కరు ఇద్దరు కాదు ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలు ఈ పెళ్లికి హాజరై శ్రీనివాసుడి దంపతులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి ఎక్కడ జరిగింది, పద్మావతి అమ్మవారు అలిగి ఎక్కడికి వెళ్లిందో ఈ రోజు వెంకన్న కథల్లో చూద్దాం.

శ్రీనివాసుడి పెళ్లి అంగరంగ వైభోగంగా జరిగింది. ఈ కళ్యాణానికి సకల దేవతామూర్తులు హాజరయ్యారు. ఈ పవిత్రమైన ప్రదేశం ఎక్కడుందో తెలుసా….తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఊరుపేరు నారాయణవనం. ఈ ఊర్లో ఎప్పుడు చూసినా పెళ్లి వాతావరణమే కనిపిస్తుంది. అందుకే ఈ దేవాలయాన్ని కళ్యాణ వేంకటేశ్వరుని దేవాలయం అంటారు.

నారాయణ వనం ఈ ప్రాంతాన్ని ఆకాశరాజు పాలించాడు. అతనికి సంతానం కలగలేదు. ఈ క్రమంలో యజ్ఞ యాగాలు చేసిన రాజుకు భూమిలో ఓ పసిపాప దొరుకుతుంది. ముద్దులొలికే ఆ పాపే అమ్మవారు పద్మావతి అని చెబుతుంది స్థలపురాణం. అంతేకాదు ఆకాశరాజు ఎవరో తెలుసా తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించిన తొండమాన్ చక్రవర్తికి స్వయాన సోదరుడు. వేటకు వచ్చిన వెంకన్న పద్మావతిని చూస్తాడు…ఇక్కడే ఇద్దరూ  ఒకరినొకరు ప్రేమలో పడతారు….ఆ తర్వాత వెంకన్న తల్లిసమానురాలు వకులాదేవి రాయభారిగా ఎరుకలవేశంలో నారాయణవనంకి వెళుతుంది. అక్కడే ఆకాశరాజును ఒప్పించి పెళ్లికి కుదిర్చివస్తుంది.

రెండున్నర వేల సంవత్సరాల కిందట భూలోకంలో ఈ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి నాటి గుర్తులు ఇప్పటికి ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. వెంకన్నకు, పద్మావతి అమ్మవారి నలుగుపిండి తయారుచేసేందుకు వాడిన తిరుగలి ఇప్పటికీ ఉంది. గందం, పారణీలను తీసిన రాతి పనిముట్లు కూడా తిరుగలి పక్కనే భద్రంగా ఉన్నాయి. అటు పక్కనే పద్మావతిని పెళ్లికూతురిగా తయారుచేసిన రాతిపీఠ కూడా మనకు కనిపిస్తుంది.

నారాయణవనమే కల్యాణ వేదికగా జరిగిన ఈ పెళ్లికి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడితోపాటు ముక్కోటి దేవతలు హాజరయ్యారని స్థలపురాణం చెబుతుంది.  ఇక ఈ పెళ్లికి పెద్దగా…శ్రీనివాసునికి మాతృమూర్తిగా వ్యవహరించిన వకుళాదేవి ఉన్నారు. ఈవిడ వెంకటేశ్వరుడు శ్రీకృష్ణుని రూపంలో ఉన్నప్పుడు యశోధగా లాలించింది. అయితే శ్రీనివాసుని రూపంలో మళ్లీ అమ్మగా శ్రీవారికి సేవలు చేసింది. ఆ జన్మలో శ్రీకృష్ణుని పెళ్లిని చూడలేకపోయిన వకుళాదేవికి ఈ జన్మలో ఆ కోరికతీర్చాడు వెంకన్న. అందుకే శ్రీనివాస కల్యాణంలో వకుళాదేవి పెళ్లి పెద్దగా వ్యవహరించింది.  వకుళామాత ఆలయం తిరుపతికి 5కిలోమీటర్ల దూరంలోని పేరూరులో ఉన్నది. దీన్ని గుట్టపై ఉన్న ఆలయం నుంచి నేరుగా ఏడుకొండలు కనిపిస్తాయి. అంతేకాదు ఏడుకొండల్లో శ్రీవారి రూపం కూడా ఇక్కడి నుండే కనిపిస్తుంది. ఏడుకొండల మీద దివిటి వెలిగిస్తే ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తుంది.

ఇక ఏడు కొండల తర్వాత అత్యంత పవర్ ఫుల్ కేంద్రం పద్మావతి అమ్మవారి ఆలయం. తిరుపతికి మూడు కిలోమీటర్ల దూరంలోని తిరుచానూరులో ఈ ఆలయం ఉంది. ఈ ఊరుని అలివేలిమంగాపురంగా కూడ పిలుస్తారు. ఈ ఆలయానికి ఓ సెంటి మెంట్ కూడా ఉన్నది. శ్రీవారి దర్శించుకున్నాక చివర్లో ఈ అమ్మవారిని దర్శించుకుంటేనే యాత్రకు ఫలం ఉంటుందట. అందుకే తిరుమల వెళ్లిన యాత్రికులు ఈ అమ్మవారి ఆశిర్వాదం తీసుకుని వస్తారు. పురాణాల్లో ఈ అమ్మవారి గురించి అనేక గాధలు వినిపిస్తాయి. శ్రీనివాసుడి దగ్గర్నుంచి అలిగివచ్చిన పద్మావతి తిరుచానూరులో కొలువైనది అంటారు. అయితే అమ్మవారి అలకతీర్చేందుకు వచ్చిన వెంకన్న కూడా భక్తుల కోరికమేరకు ఇక్కడ కొలువైనాడని పురాణగాధల్లో వినిపిస్తుంది. ప్రతిరోజు ఏకాంతసేవ తర్వాత వెంకన్న తిరుచానూరుకు వస్తాడని మళ్లీ సుప్రభాత సేవవరకు ఆనందనిలయానికి వెళ్తాడని చెబుతారు. అందుకే ఏకాంతసేవ తర్వాత శ్రీవారి సన్నిధిని మూసేసి తర్వాత సన్నిధి గొల్లలచేత ఉదయం సుప్రభాతసేవకు ఆలయం ద్వారాలు తెరుస్తారు. ఈ తిరుచానూరు అమ్మవారి ఆలయం దగ్గర మరో అద్భుత ఉంది. ఆదిశేషుడిపై వెంకన్న శయనిస్తున్న రూపం ఇక్కడి నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మరో పురాణగాధ కూడా ఉన్నది. ప్రతిశుక్రవారం అమ్మవారు కొండపైకి వెళ్తుందని ఆరోజు నవరత్న స్వర్ణ కిరీటాన్ని ధరించిన శ్రీవారితో విహరిస్తుందట.

తిరుచానూరులో పుష్కరిణి కూడా చాలా పవిత్రమైనది. గతంలో ఈ కొలను నిండా తామరపూలు ఉండేవి. ప్రతిరోజు  ఈ పూలతోనే అమ్మవారికి అభిషేకం చేసేవారు. అమ్మవారి అలకతీర్చేందుకు వేంకటేశ్వరుడు ఈ పుష్కరిణిలో స్వర్ణపద్మాలు కూడా తయారుచేశాడని చెబుతారు. పూర్వం కాలినడకన కొండపైకి వచ్చి తనను దర్శించుకోలేని వారి కోసం వెంకన్న కొండదిగి వచ్చి తిరుచానూరులో వెలిసాడని మరికొందరు చరిత్రకారులు చెబుతారు. అందుకే ఇక్కడ శ్రీవారు చాలా తేజోవంతంగా కనిపిస్తాడట. కొండపైన శ్రీవారి ఎలాంటి సేవలు అందుకుంటున్నాడో…కిందకూడా అలాంటి ఉత్సవాలే జరుగుతాయి.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy