వెంకన్న కథలు – శ్రీనివాసుడి రూపాలెన్ని?

Venkanna-Kathalu-Part04బ్రహ్మోత్సవం… బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం… ముక్కోటి దేవతలు… కోట్లాది భక్తులు కళ్లార్పకుండా చూసుకునే సంబరం. కోనేటి రాయుణ్ణి తనివి తీరా దర్శించుకొని తన్మయం చెందే మహోత్సవం. అలాంటి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ సందర్భంగా వీసిక్స్ ప్రత్యేక కథనాలు అందిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో రోజుకో స్పెషల్ స్టోరీతో తిరుమల తిరుపతి చరితామృతం మీకోసం…

కోనేటి రాయుడికి కోటి నామాలు. ఏ పేరుతో పిలిచినా..ఆయన కరుణిస్తాడు. నమ్మకం ఉండాలేగానీ… శ్రీనివాసుడి చల్లని చూపు వెన్నెలకురిపిస్తుందని నమ్ముతారు భక్తులు. కరుణించి వరాలు కురిపించే వేంకటనాథుడ్ని భక్తులు కొలిచే పద్ధతి వేర్వేరుగా ఉందని చరిత్ర చెబుతోంది. అప్పటి ఆచారవ్యవహరాలు, సంస్కృతి సంప్రదాయాలు… వెంకన్నను కొలిచే పద్ధతిని శాసించాయన్న వాదనలున్నాయి.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు ఎవరి దేవుడు.? ఆయన అసలు రూపం ఏమిటి? శ్రీవారు మా దేవుడంటే మా దేవుడన్న వాదన ఎన్నాళ్లు జరిగింది? ఏ ఏ రూపాల్లో ఆయన్ని కొలిచారు? క్రీశ 1వ శతాబ్దం నుంచి  క్రీశ 14వ శతాబ్దం వరకు తిరుమల కొండల్లో ఏం జరిగింది? శ్రీవారి గురించి అన్నమయ్య చెప్పిన నిజం ఏమిటి? వెంకన్న కథల్లో శ్రీవారు ఎవరి దేవుడో…పురాణాలు, పౌరాణిక గాధలు ఏమి చెబుతున్నాయో… ఓసారి చూద్దాం.

పిలిస్తే పలికే దేవుడు వేంకటేశ్వరుడు. అందుకే ఆయన్ని కలిగియుగ ప్రత్యక్ష దైవం అన్నారు. వేల సంవత్సరాలుగా ఏడుకొండల్లో వెలిసిన వెంకన్నను దర్శించుకునేందుకు కొండలు, కోనలు, అడవుల్ని దాటుకుని వచ్చారు భక్తులు. ఒక్కసారి చూస్తే ఈతిబాధల్ని మర్చిపోయే స్వరూపం వెంకన్నది. మొదట్లో వెంకన్న గిరిజన దేవుడనీ..అందుకే ఆయనకు గరుడాచలం అనే పేరు వచ్చినట్టు జానపదాలు చెబుతున్నాయి. అయితే భక్తజనకోటిని పారవశ్యంలో ముంచెత్తిన వెంకన్నరూపంపై అనేక అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఒక్కటికాదు.. రెండు కాదు కొన్ని వేల సంవత్సరాలు పాటు ఇలాంటి  భిన్న వాదనలు వినిపించాయి, వివాదాలు చోటుచేసుకున్నాయి. చివరకు క్రీశ 1450 తర్వతే …శ్రీనివాసుడు… వైష్ణవ దేవుడిగా వేంకటేశ్వరుడిగా.. స్థిరపపడ్డాడని చెబుతున్నారు.

వెంకన్న అంటే.. కొండల్లో కొలువున్న గిరిజన దేవుడంటారు కొందరు పరిశోధకులు. క్రీపూ 1వ శతాబ్దం నుంచి క్రీశ 300వ సంవత్సరం వరకు ….అంటే గౌతమీపూత్ర శాతకర్ణి పాలనా సమయానికి బౌద్దమతం ప్రభావం తిరుమల కొండకు వ్యాపించింది. ఈ క్రమంలో కొద్ది కాలం పాటు వెంకన్నను గౌతమ బుద్దునిగా కొలిచారు బౌద్దులు. వీళ్ల ప్రభావం రెండో శతాబ్దం వరకు కొనసాగింది. అంటే దాదాపు వంద సంవత్సరాలపాటు భక్తులు వెంకన్నను బుద్దునిగా కొలిచినట్లు చరిత్రకారులు చెబుతారు. మరో ముఖ్యమైన విషయం ….వెంకన్న రూపంలో బుద్దుని ఛాయలు ఉంటాయని చెబుతారు మరికొంతమంది పరిశోధకులు. ఇక.. ఇప్పటికీ..తిరుమలలో బౌద్ధ సన్యాసులు కనిపించడం…తిరుమలలో బౌద్ధమత ఉనికి ఆనవాళ్లుగా భావించేవాళ్లూ లేకపోలేదు.

బౌద్దమతం తర్వాత రెండో శతాబ్దం ప్రారంభంలో తిరుమల కొండపై జైనమతం వ్యాపించింది. తిరుమలేశునిపై కూడా ఈ ప్రభావం పడింది. ఈ సమయంలో వెంకన్నను కపాలి దేవుడిగా, కాట్రేయుడిగా, జినదేవుడిగా కొలిచారు జైనులు. అయితే బౌద్ధంతో పోలిస్తే….తిరుమల కొండమీద జైనుల ప్రభావం చాలా తక్కువగా ఉందటున్నారు చరిత్రకారులు.  జైనుల హయాంలో  కేవలం 50సంవత్సరాలపాటు వివిధ పేర్లతో వెంకటేశ్వరునికి పూజలు చేశారు.

జైనుల తర్వాత క్రిశ 3వ శతాబ్దం ప్రారంభం నాటికి శాక్తేయుల పాలనాసమయం వచ్చింది.  శాక్తేయులు అంటే శక్తిదేవతల్ని పూజించేవారని అర్థం. తిరుమల వెంకన్నను ఆదిశక్తిగా భావించారు శాక్తేయులు. అందుకే వెంకన్నకు ఆదిశక్తి రూపం వచ్చిందని చెబుతారు. అయితే పురాణాల్లో తిరుమలపై శాక్తేయుల ప్రభావం చాలా బలంగా ఉందనడానికి ఆధారాలు చాలా ఉన్నాయి. వాటిలో మొదటిది కుంభం కాల్చడం. ప్రతి గురువారం తిరుమల గుడిముందు తిరుపావడ అనే ఉత్సవం జరుగుతుంది.  మహాముని మండపంలో కుంభం పెట్టి నైవేద్యం పెడతారు. కుంభం పెట్టి నైవేద్యం పెట్టడం శక్తి దేవతల ఆచారం. కాబట్టి వేంకటేశ్వరున్ని శక్తి దేవుడిగా కూడా భావించవచ్చు.

శ్రీవారిని బాలాజీ అన్న పేరుతో పిలవడానికి కూడా చారిత్రక నేపథ్యం ఉంది. బాలాజీ అనే పేరు కూడా శాక్తేయుల కారణంగానే వచ్చిందని అంటుంటారు. ఉత్తర భారతంలో బాల అంటే అమ్మవారని ….జి అంటే గౌరవ సూచకమని అర్థం. అందుకే వేంకటేశుడ్ని బాలాజీగా కొలిచేవారు శాక్తేయులు. వీటితో పాటు ప్రతి శుక్రవారం శ్రీవారిని పసుపుతో అభిషేకం చేస్తారు. వీటన్నింటిని బట్టి శాక్తేయుల ప్రభవాన్ని అంచనా వేయవచ్చు.

శ్రీవారి ఆలయంపై నాలుగు వైపులా సింహాలు కనిపించడం…తిరుమల విశిష్టత. వాస్తవానికి తిరుమల, తిరుపతి పరిధిలోని మిగతా అన్ని ఆలయాలపై నాలుగువైపులా గరుడు ఆశీనుడై ఉంటాడు. కేవలం శ్రీవారి సన్నిధిలో మాత్రమే సింహాలు ఉంటాయి. గరుడు శ్రీనివాసుడి వాహనం. సింహం..ఆదిపరాశక్తి వాహనచిహ్నం. అందుకే  అమ్మవారి ఆలయాలపై మాత్రమే సింహం కనిపిస్తుంటుంది. కానీ శ్రీవారి ఆనందనీలయంపై ఇప్పటికీ నాలుగు సింహాలు దర్శనమివ్వడం శాక్తేయుల ప్రభావానికి, ప్రాభవానికీ..సంకేతం. అంతేకాదు శ్రీవారికి జడలు ఉన్నాయని, ఆయన రూపంలో అమ్మవారి పొలికలు ఉన్నాయని కూడా శాక్తేయులు వాదిస్తారు.

ఇక ఏడు కొండపై  శైవుల ప్రభావం అందరికంటే ఎక్కవనే చెప్పాలి. సుమారు వెయ్యేళ్లపాటు వీళ్ల ప్రభావం శేషాచలంపై కనిపించింది. క్రీశ వెయ్యో.. శతాబ్దం వరకు శైవులు తిరుమల వెంకన్నను శైవ దేవుడిగా పూజించారు. ఆ తర్వాత వైష్ణవుల రాక క్రమంగా మొదలయ్యింది.  క్రిశ 14వ శతాబ్దం వరకు అటు శైవులు, ఇటు వైష్ణవులు శ్రీవారు… తమ దేవుడంటే తమ దేవుడంటూ వాదించుకున్నారు. ఇదర్దూ తమ ఆచార సంప్రదాయల ప్రకారం పూజలు నిర్వహించారు. చివరకు రామానుజ చార్యులు వచ్చాక వైష్ణవుల ఆదిపత్యం పెరిగింది. సుమారు 5వందల ఏళ్లపాటు శైవులు, వైష్ణవుల మధ్య ఈ ఘర్షణలు జరిగాయి. 14వ శతాబ్దం చివరి దశలో సాలువ వంశం వచ్చాక వైష్ణవ మతం స్థిరపడిపోయింది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయల కాలంలో తులువ వంశం ఆధ్వర్యంలో  వెంకన్న దేవాలయాభివృద్ది ఊహించని రీతిలో జరిగింది.

అయితే తిరుమలలో ఇప్పటికీ శైవులకు సంబంధించిన ఒక ఆచారం కొనసాగుతూనే ఉంది. వెంకన్న సన్నిధిలో వేదపఠనం ప్రతిరోజూ శైవులే చేస్తున్నారు.

అన్నమయ్య తన కీర్తనల్లో ఓ చారిత్రక సత్యం చెప్పాడు. ఎవరు ఏ రూపేన కొలిచినా, ఎవరు ఎన్ని రకాలుగా పూజించినా వాళ్లకు …వేంకటనాథుడు దర్శనమిచ్చి…ధన్యులుజేశాడంటూ…అన్నమయ్య తన రచనల్లో వర్ణించాడు. అందుకే…. ఆ ఏడుకొండల వాడు….. జగద్రక్షకుడయ్యాడు…. జగదానందకారకుడయ్యాడు.

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy