వెదర్ రిపోర్ట్: మరో రెండు రోజులు భారీ వర్షాలు

rainsరాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వస్తున్న వరద నీటితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. దీంతో చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో రంగారెడ్డి జిల్లా కొందుర్గులో 18.3 సెంటీ మీటర్లు..తాండూరు పట్టణంలో 10.4 సెంటీమీటర్లు.. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌లో 14 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. ఈ సీజన్ లో ఇలా వర్షం కురవడం ఇదే మొదటి సారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం (జూన్19) కురిసిన వర్షం తో విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి. కొన్ని చోట్ల కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులలోకి వరద నీరు చేరుతోంది. కొన్ని చోట్ల కల్వర్టులు తెగిపోవడం, రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కాజీపేట- బల్లార్ష రైల్వే మార్గంలో పొత్కపల్లి రైల్వేస్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున పిడుగు పడటంతో సిగ్నలింగ్‌ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఈ మార్గంలో 8 గంటలపాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రైళ్లు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌ డివిజనల్‌ సిగ్నలింగ్‌, టెలికాం ఇంజనీర్ల బృందం వెళ్లి మరమ్మతులు చేపట్టింది. ఈ మార్గంలో పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి

ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి మూసీ నది పరవళ్లు తొక్కుతోంది. ఈ వరద నీరంతా హిమాయత్‌ సాగర్‌లోకి చేరడంతో కళకళలాడుతోంది. మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో నాలుగైదు రోజులుగా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువుల్లోకి భారీగా వర్షపు నీరు చేరంది. కాగ్నా, కాక్రవేణి నదుల్లోకి జలకళ సంతరించుకుంది. సంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో నారింజ ప్రాజెక్టు, సింగూరు, నల్లవాగు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతోంది. మహబూబ్‌ నగర్‌ జిల్లా బాదేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలోకి వర్షపు నీరు చేరడంతో బురదమయంగా మారింది. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని సోమారం గ్రామపంచాయతీ మోడల్‌ స్కూల్‌ జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. స్థానికులు తాళ్ల సాయంతో విద్యార్థులను బయటకు తరలించారు.

రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించారు. సోమవారం (జూన్ 19)హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయమయ్యాయి. నగరవాసులు ట్రాఫిక్‌ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. శంషాబాద్‌ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి. నాగపూర్‌, చెన్నై, బెంగళూరు, తిరుపతి, గోవా, కొచ్చిన్‌, చండీగఢ్‌, ముంబై వెళ్లాల్సిన విమానాలు రద్దవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

Leave a Reply

bathukamma song

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy