వెయ్యి లైకులకు లక్ష రూపాయలు

social-likesసోషల్ మీడియాను తిట్టిపోసేవాళ్లున్నారు.. టైమ్ వేస్టని… అన్నీ చెత్త విషయాలేనని.. ఇలా ఎన్నో మాటలు. అయితే ఇప్పుడదే.. సోషల్ మీడియా… బతుకుదెరువు చూపించనుంది.. అవసరానికి డబ్బులిచ్చి ఆదుకోనుంది.. నమ్మడం లేదా… ఆశ్చర్యంగా ఉంది కదూ.. లైక్ లకు రుణమిచ్చే వాళ్లు వచ్చేశారు.. లైక్ కొడితే పర్సనల్ లోన్ ఇస్తామంటున్నారు.  అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. మీ బాధలను, కష్టాలను కథ రూపంలో రాసి.. www.doright.in వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలి. వీడియో కూడా పెట్టొచ్చు. ఇది టాటా క్యాపిటల్ కు చెందిన వెబ్‌సైట్‌. దీనిలో మీ కథకు వెయ్యి కంటే ఎక్కువ లైకులు వస్తే రూ. లక్ష రుణం అందిస్తోంది టాటా క్యాపిటల్. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ధనలక్ష్మి భాయ్‌.. ఇలాగే ఆర్థిక సాయం చేసింది ఆ సంస్థ. వృత్తిరీత్యా టైలర్‌ అయిన ధనలక్ష్మి బాయ్ కి.. ఒక కొడుకున్నాడు. చాలా రోజుల క్రితం భర్త చనిపోయాడు. బతుకు భారమైన ఆమె..  తెలిసిన వారి సాయంతో టాటా క్యాపిటల్‌ వెబ్‌సైట్‌లో తన వ్యధకు అక్షర రూపమిచ్చింది. ఆ పోస్టుకు వెయ్యికి మించిన లైక్ లు వచ్చాయి. దీంతో ఆమెకు లక్ష ఆర్థిక సాయం అందించింది టాటా క్యాపిటల్. దీనికి వాళ్లు పెట్టుకున్న పేరు.. ‘సలామ్ లోన్స్’.

ప్రైవేటు వడ్డీ వ్యాపారుల  బారిన పడకుండా.. సామాజిక బాధ్యతలో భాగంగా ఇలాంటి వినూత్న రుణ ప్రక్రియను ప్రారంభించింది టాటా క్యాపిటల్. ఇప్పుడు ఇదే దారిలో మరిన్ని సంస్థలు నడుస్తున్నాయి. రుణ జారీకి సంబంధించిన దరఖాస్తులు పూరించడం, పూచీకత్తు పత్రాల వంటి అంశాల్లో రుణ గ్రహీతలకు సాయపడతామని చెబుతున్నారు నిర్వాహకులు. ఇప్పటివరకు 700–800 మంది నిరుపేదలు రుణాల కోసం తమ దీనగాథలను సంస్థ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేసినట్లు తెలిసింది. మరో ఏడాదిలో ఈ సంఖ్య రెట్టింపు కానుందని సంస్థ వర్గాలు చెబుతున్నాయి.

ఇవీ నిబంధనలు:  

.. కుటుంబ, వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక పరిస్థితిని ప్రతిబింబించేలా ఉండే ఫొటోలు

.. రుణంతో తాము ఏం చేయాలనుకుంటున్నదీ వివరిస్తూ కథనం

.. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందినవారే రుణం పొందేందుకు అర్హులు

.. రూ.3 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగిన వారు, దారిద్య్ర రేఖకు దిగువనున్న వారు కూడా అర్హులే

.. రుణం జారీ స్థాయి రూ.25 వేల నుంచి రూ.లక్షలోపు మాత్రమే. వడ్డీరేటు పావలా.

.. రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారి వయసు 21 నుంచి 60 ఏళ్లలోపు ఉండాలి

.. రుణ గ్రహీతల యథార్థ గాథకు (కథనానికి) వెయ్యి లైక్స్‌ (సలామ్స్‌)రావాలి

.. ఇలాంటి రుణాలను పొందినవారు ఐదు నుంచి ఆరేళ్ల కాల వ్యవధిలో వాయిదాల పద్ధతిలో చెల్లించే వెసులుబాటు ఉంటుంది

.. ఏడాది తర్వాత ఈ రుణాల జారీతో లబ్ధి పొందినవారి వివరాలు బహిర్గతం చేయడంతోపాటు, పథకంలో మార్పులు చేర్పులు చేసే యోచనలో ఉన్నారు

.. ప్రధానంగా కుటీర పరిశ్రమలు, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు, చేతివృత్తిదారులు, మహిళలకు ఇలాంటి రుణాలు ఆదరువుగా నిలవనున్నాయి

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy