వెలుగులోకి రాని గరగపర్రులు ఎన్నో..?

social-Boycottగరగపర్రులో ఏం జరిగింది? దళితుల పట్ల కులవివక్ష మాత్రమే ఉందా? దానికి మించి ఏదైనా జరిగిందా? ఊరి చెరువు కట్ట మీద ఎందరో నాయకుల విగ్రహాలున్నప్పటికీ అంబేద్కర్ విగ్రహానికే అభ్యంతరం ఎందుకొచ్చింది? కొందరు చెప్తున్నట్లుగా అది రాజకీయ అంశమేనా? అయితే ఏ రాజకీయ అంశం? రెండు నెలలుగా గరగరపర్రు గరంగరంగా ఉన్నా ఎందుకు బయటివారికి తెలియలేదు. గరగపర్రు ఘటన పూర్వపరాల గురించి ఓసారి చూద్దం.

తూర్పుగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని ఓ ఊరు గరగపర్రు. అప్పట్ల సత్యం రామలింగరాజు కుంభకోణం  సందర్భంల ప్రపంచానికి తెల్సిన ఈ పేరు మళ్ల ఇన్ని దినాలకు బయటకు తెల్సింది. అదీ దళితుల పట్ల ఊరి పెత్తందార్లు చూపిస్తున్న వివక్ష రూపంల. రెండు నెలల నుండి దళితులు తీవ్రవివక్షను ఎదుర్కొన్న తర్వాత మెల్లగ బయటికొచ్చింది.

మరి ఆ వూరిలో బాగా చదువుకున్నోళ్లున్నరు. ప్రపంచ దేశాలకు పేరెల్లినోళ్లున్నరు. కమ్యూనికేషన్ ప్రపంచాన్ని పట్టుకుని పరిశ్రమలు పెట్టి కోట్లు సంపాదిస్తున్నవారూ ఉన్నరు. అయినా సాటి మనుషుల పట్ల ఎందుకీ వివక్ష? కేవలం వివక్షేనా? ఇంకేదైనా ఉందా?

‘‘క్యాడర్ కమ్మన్నగాని/లీడర్ కమ్మన్ననా/దళితుడా ఈ దేశాన్ని నిన్నేలొద్దన్ననా’’… దళిత ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన రోజుల్ల ఈ పాట చాలా పాపులర్. 1985లో కారంచేడు, చుండూరు ఘటనల తర్వాత దళిత ఉద్యమాలు  ఉమ్మడి ఏపిలో ఎగిసిపడ్డవి. అప్పట్ల దళితుల సమస్యలు, అంబేద్కర్, రాజకీయాలు అన్నీ చర్చకొచ్చినవి. అప్పటి నుండి దళితులు చైతన్యం అవుతనే ఉన్నరు. తమలోపట చైతన్యం పెంచుకుంటున్నరు.

గరగపర్రుల సరిగ్గా జరిగిందదే. ఈ ఊర్ల 450 పైగా దళిత కుటుంబాలున్నవి. ఈ యేడాది ఏప్రిల్ 23వ తేదీ ముందు వరకు రాజుల పొలాలను కౌలుకు తీసుకుని, వారి ఇండ్ల ముందు పనిచేస్తూ బతికారు. అంతవరకు రాజులకు ఇబ్బందిలేదు. దళితుల్లో అంతోఇంతో చదువుకున్నవాళ్లు కూడా చిన్నాచితకా పనులు చేసుకుని బతుకుతున్నరు. అయితే చుట్టుపక్కల గ్రామాల్ల అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నరు. తమ ఊర్ల కూడ పెట్టాలని అనుకున్నరు. అంబేద్కర్ విగ్రహాన్ని తామే పెడ్తామని ఎన్నికల ముందు అన్నీ పార్టీల నాయకులు దళితులకు హామీ ఇచ్చినరు.

అయితే నాయకులు ఎవ్వరూ పట్టించుకోకపోవడతో వీళ్లే తలా ఇంత వేసుకుని అంబేద్కర్ విగ్రహం పెట్టాలని నిర్ణయించుకున్నరు. ఏప్రిల్ 23న విగ్రహాన్ని ఊరి చెరువ గట్టు వద్ద ఏర్పాటుచేసుకున్నరు. గ్రామ పెత్తందార్లు రాత్రికిరాత్రే దాన్ని తొలగించారు. ఎందుకూ అంటే  దానికి గ్రామ పంచాయతీ అనుమతి లేదన్నరు. మరి అదే ఊరిల అల్లూరి సీతారామరాజు, గాంధీ, ఇతర నాయకుల విగ్రహాలున్నవి. వాటికి ఎవరి అనుమతి తీసుకున్నరు. దీనికి సమాధానం ఉండదు.

ఇన్ని రోజులు ఏ రాజకీయాలు మాట్లాడని దళితులు ఏకంగా అంబేద్కర్ విగ్రహం ఊరి చెరువు కట్ట మీద పెడ్తామంటే ఊకుంటరా? అదే జరిగిందిక్కడ. ఆ గ్రామంలోనే బలమైన సామాజిక వర్గం నాయకుడు బలరామరాజుకు కోపం తెప్పించింది. ఈయన ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేకు కుడిభుజం అసోంటాయన. ఊరి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగే బలమున్న మనిషి. అందుకే ఈయన మాట ప్రకారమే అక్కడ దళితుల వెలివేత జరిగింది.

ఇక్కడున్న పెత్తందారి వర్గం వాళ్లు రెండు నెలల నుండి దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నా విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నరు. అక్కడ దళిత అధికారులను బదిలీ చేయించిన్రు. మీడియాలోనూ విషయం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నరు.

ఇక్కడున్న దళితులందరూ భూమిలేని నిరుపేదలే. వాళ్లకు పెత్తందారి వర్గాల భూములే ఆధారం. ఆ భూములు కౌలుకు తీసుకుని బతుకున్నరు. ఈసారి వాళ్లకు భూములు కూడా కౌలుకియ్యలేదు. బీసీ వర్గాలకు ఇచ్చినరు. తమకు ఎదురు తిరిగితే ఉనికే లేకుండా చేయాలనే ఆలోచన ఇది. భూములు కౌలుకివ్వకుండా ఉంటే దళితులు కాళ్లబేరానికొస్తరని అనుకున్నరు. కానీ అట్లా జరగలేదు. ఎదురుతిరిగి నిలబడి నిరసన చెప్పినరు. విషయం  బయటకు వచ్చిన తర్వాత పార్టీలు, నాయకులు అక్కడికి కదిలినరు.

ముగ్గురు పెత్తందార్ల అరెస్టు తర్వాత దళితులకు వ్యతిరేంగా అందరూ ఒకటయ్యారు. దీనికి బీసీ వర్గాలవాళ్లను కూడా అడ్డుపెట్టుకున్నరు. ఇప్పుడు అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని నిరసన చేసినరు. ఎస్సీఎస్టీ వేధింపుల చట్టం వర్తించే సంఘటనలు జరిగినయని జిల్లా ఎస్పీనే చెబుతుంటే అక్రమ కేసు పెట్టారంటూ ఒత్తిడి చేసే ప్రయత్నాలు జరుగుతున్నయి. సమస్యను దారి తప్పించి దాని తీవ్రత తగ్గించాలని చూస్తున్నరు. రెండు రాష్ట్రాల దళిత సంఘాలు కదిలే వొరకల్లా అరెస్టులు చేయక తప్పలేదు. చంద్రబాబు ప్రభుత్వం దిగిరాకా తప్పలేదు.

కొత్త రాజధాని అమరావతిలో వంద అడుగులకు మించిన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించడానికి సర్కారు ఏర్పాట్లు చేస్తుంటే అదే మహనీయుడి విగ్రహాన్ని ఒక గ్రామ దళితులు పెట్టుకోవడానికి ఆ ఊరి పెద్దమనుషులే ఒప్పుకోవడం లేదు. దీనికి అదే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల మద్దతు కూడా బహిరంగంగానే కనిపిస్తున్నది. గరగపర్రుల పరిస్థితి ప్రజాప్రతినిధులకు విషయం తెల్సినా మొదట్ల అటు పోలేదు. విషయం బయటకు రాకుండ చూసినరు. మీడియా ద్వారా బయటికొచ్చాకే అందరూ కదిలారు.

విచిత్రమో.. విషాదమో.. గరగరపర్రు గ్రామ సర్పంచ్ ఎలిజబెత్ దళితురాలే. అదీ రిజర్వేషన్ లో భాగంగా వచ్చిన అవకాశం అది. ఆ గ్రామ పెత్తందార్లు ప్రజాస్వామికంగా, విశాలంగా ఆలోచించి దళితులకు ఇచ్చిన అవకాశం కాదు అది. ఇప్పటికే దళిత మహిళా సర్పంచి. ఇప్పుడు ఏకంగా అంబేద్కర్ విగ్రహమే తీసుకొచ్చి ఊళ్లో పెడ్తే తమ ఆధిపత్యానికి ఏదో ముప్పు వచ్చేస్తుందని పెద్దలంతా భయపడ్డారు. ఈ చైతన్యం పెరిగి పెద్దదై… తాము చేస్తున్న రాజకీయాలను శాసిస్తే… తమ రాజకీయ పదవుల్లో వాటా అడిగితే… ఇంకేమైనా ఉందా? అందుకే ముందు జాగ్రత్త చర్యగా గ్రామ పెత్తందార్లు ఊర్లో అంబేద్కర్ ఆలోచన లేకుండ చేయాలని అనుకున్నరు. అనుకున్నట్లే చేసినరు.

ఈ గ్రామంలో అన్ని రాజకీయ పార్టీలున్నవి. అన్ని పార్టీల నాయకులు ఈ పెత్తందార్లే. రాజకీయాల కోసం అందరూ ఒకరినొకరు తిట్టుకుంటరు. కానీ దళితులకు రాజకీయ చైతన్యం వస్తుందనుకునే వొరకల్ల అంతా ఏకతాటి మీదికొచ్చేశారు. దళితుల్ని వెలివేపి వారికి బతుకు లేకుండ చేసే కుట్రపన్నారు.

చైతన్యవంతులు కావాలనే అంబేద్కర్ అణగారిన వర్గాలకు చెప్పారు. ఆ చైతన్యం ఆయన విగ్రహం రూపంలోనే ఆ ఊరుకొచ్చింది. అందుకే గరగపర్రు పెత్తందార్లకు కోపం వచ్చింది. ఆ కోపం 21వ శతాబ్దంలో కూడ దళితులను వెలివేసి అణిచేసే అగ్రకుల చైతన్యం తెచ్చింది. అందరినీ సమానంగా కూర్చో బెట్టాలనుకున్న మహనీయుడి విగ్రహం ఇప్పటికీ కొందరిని భయపెడుతూనే ఉంది.

                                                                                    –  బుచ్చన్న 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy