వెళ్లిపోయిన సినీ వసంతం

వసంతకోకిల, నిరీక్షణ లాంటి సినిమాలతో విలక్షణ దర్శకుడిగా పేరుతెచ్చుకున్న బాలూమహేంద్ర ఇక లేరు. గురువారం తెల్లవారుజామున చెన్నైలో గుండెపోటుతో హాస్పిటల్ లో చేరిన ఆయన మధ్యాహ్నం కన్నుమూశారు. కళాత్మక విలువలతో సినిమాలు తీసి జాతీయ స్థాయి డైరెక్టర్ గా, సినిమాటోగ్రాఫర్ గా తన ముద్ర వేసిన బాలూ మహేంద్ర వయసు 74 ఏళ్లు. 1939 మే 20న శ్రీలంకలో బట్టికలోవా ప్రాంతంలో తమిళ కుటుంబంలో పుట్టారు మహేంద్ర. ఆయన అసలు పేరు బాలనాథన్ బెంజిమన్ మహేంద్రన్. అక్కడే చదువుకున్నారు. ఆస్కార్ అవార్డు సాధించిన హాలీవుడ్ క్లాసిక్ ‘బ్రిడ్జ్ ఆన్ ద రివర్ క్వాయ్’ సినిమా చూసి 13 ఏళ్ల వయసులోనే ఈ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు మహేంద్ర. లండన్ యూనివర్శిటీలో బీఎస్సీ చదివాక పుణె ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సులో చేరి గోల్డ్ మెడల్ సాధించారు.

1972లో సినిమాటోగ్రాఫర్ గా జీవితం ప్రారంభించిన బాలూ మహేంద్ర దక్షిణాదిలో అన్ని భాషల్లోను, హిందీలోనూ పనిచేశారు. తెలుగులో సీతాకోకచిలుక, శంకరాభరణం, మనవూరి పాండవులు, లంబాడోళ్ల రాందాసు, సొమ్మొకడిది సోకొకడిది లాంటి సినిమాలకు కెమెరామన్ గా ఉన్నారు. 1977లో డైరెక్టర్ గా మారిన కన్నడంలో ఆయన తీసిన మొదటి సినిమా కోకిలకు బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం. డైరెక్షన్ తో పాటు స్క్రీన్ ప్లే రైటర్ గా, ప్రొడ్యూసర్ గానూ తనను తాను నిరూపించుకున్నారు మహేంద్ర.

1982లో తెలుగులో భానుచందర్, అర్చనతో మహేంద్ర తీసిన నిరీక్షణ సినిమా నటనకు కొత్త అర్థం చెప్పింది. అర్చనకు నటిగా తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది. 1983లో తమిళంలో మహేంద్రన్ తీసిన మూంద్రన్ పిరాయి తెలుగులో వసంత కోకిల పేరుతో వచ్చింది. ఇండియన్ సినిమాల్లో క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయిన ఈ సినిమా శ్రీదేవి, కమల్ హాసన్ సినీజీవితంలో మైల్ స్టోన్ గా చెప్పుకుంటారు. ఆ తర్వాత టాప్ హీరోయిన్లుగా ఎదిగిన ప్రతి నటికీ వసంత కోకిలలో శ్రీదేవి పాత్ర డ్రీమ్ రోల్ గా మిగిలిపోయింది. ఈ సినిమాకు కూడా బెస్ట్ సినిమాటోగ్రాఫర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇదే సినిమాను  హిందీలో సద్మా పేరుతో రిమేక్ చేశారు. 1988లో తమిళంలో ఆయన తీసిన వీడు సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది.

1990లో తెలుగులో సంధ్యారాగం సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు అందుకుంది. 1992లో తమిళంలో మహేంద్ర తీసిన వన్న వన్న పూక్కల్ కూడా జాతీయ అవార్డు సాధించింది. దీంతో మొత్తం ఐదు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నారు బాలు మహేంద్ర. దీంతో పాటు మరో మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులను ఆయన సొంతం చేసుకున్నారు. మనవూరి పాండవులు, నిరీక్షణ సినిమాలకు బెస్ట్ కెమెరామన్ గా నంది అవార్డులు కూడా సాధించారు. 1995లో మహేంద్ర తీసి సతీ లీలావతి విలక్షణ చిత్రంగా నిలిచింది.Balu Mahendra vasantha Nireekshana_1982

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy