వేస్ట్ ఈజ్ గోల్డ్ : ప్లాస్టిక్ బాటిళ్ల బస్ షెల్టర్

bus-shelterఎండ‌లు పెరిగిపోతున్నాయ్‌.. నీడ‌కోసం త‌ల‌దాచుకుందామంటే మ‌హాన‌గ‌రంలో చెట్లు త‌క్కువ‌. పోనీ బ‌స్ షెల్ట‌ర్ల‌కింద కాసేపు సేద‌తీరుదామంటే ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పైనే అవి క‌నిపిస్తాయి. కాల‌నీ కూడ‌ళ్ల‌లో కూడా  బ‌స్ షెల్ట‌ర్లు నిర్మిస్తే బాగుంటుందని ప్ర‌జ‌లు భావిస్తున్న నేప‌థ్యంలో అత్యంత త‌క్కువ ఖ‌ర్చుతో బ‌స్‌షెల్ట‌ర్లు నిర్మిస్తోంది బాంబూ హౌజ్ ఇండియా అనే సంస్థ‌.  ఈషెల్ట‌ర్లను వేటితో నిర్మిస్తారో తెలిస్తే అవాక్క‌వుతారు. కేవ‌లం వాడి ప‌డేసిన ప్లాస్టిక్ బాటిల్స్‌తో  బ‌స్ షెల్ట‌ర్లను నిర్మిస్తోంది.

రీసైకిల్ ఇండియా పేరుతో బాంబూ హౌజ్ ఇండియా ఈ కొత్త నిర్మాణానికి తెర‌తీసింది. ఇప్ప‌టికే వాడి ప‌డేసిన టైర్లు, ప్లాస్టిక్ డ్ర‌మ్స్‌ను రీసైకిల్ చేసి వాటితో సీట్లు,బెంచీలు త‌యారు చేస్తోంది. ఉప్ప‌ల్‌లోని స్వ‌రూప‌న‌గ‌ర్ కాల‌నీలో ప్లాస్టిక్ బాటిల్స్‌తో నిర్మించిన బ‌స్‌షెల్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. హైద‌రాబాద్‌లో స‌రిప‌డా బ‌స్ షెల్ట‌ర్లు లేక‌పోవ‌డంతో… బ‌స్ షెల్ట‌ర్లు నిర్మించేందుకు త‌మ సంస్థ ముందుకొచ్చింద‌ని తెలిపింది యాజ‌మాన్యం. బ‌స్ షెల్ట‌ర్లు నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు పెద్ద‌మొత్తంలో డ‌బ్బుల‌ను డిమాండ్ చేయ‌డంతో ప్ర‌భుత్వం కూడా కాస్త వెన‌క‌డుగు వేసింది. ఈ క్ర‌మంలోనే త‌మ కంపెనీ ప్లాస్టిక్ బాటిల్స్ తో బ‌స్‌షెల్ట‌ర్‌ను నిర్మించింద‌ని యాజ‌మాన్యం పేర్కొంది.

ఈ బ‌స్‌షెల్ట‌ర్‌ను త‌యారు చేసేందుకు 1000 ఒక లీట‌ర్ వాట‌ర్ బాటిల్స్ వినియోగించిన‌ట్లు బాంబూ హౌజ్ ఇండియా వ్య‌వ‌స్థాప‌కులు ప్ర‌శాంత్ తెలిపారు. ఒక్కో బాటిల్ రూ.1.40 కి విక్ర‌యించిన‌ట్లు చెప్పిన ప్ర‌శాంత్‌… బ‌స్ షెల్ట‌ర్ కొల‌త‌లు 8*4 అడుగులుగా ఉంద‌ని, ఫ్రేమ్‌ను మెట‌ల్‌తో తయారు చేసిన‌ట్లు వివ‌రించారు. ఇందుకు మొత్తం అయిన ఖ‌ర్చు కేవ‌లం రూ.15వేలు అని స్ప‌ష్టం చేశారు. అన‌వ‌స‌రం అనుకుంటే మ‌ళ్లీ దీన్ని తొల‌గించొచ్చ‌ని చెప్పారు.

ఇలా త‌యారు చేశారు
ప్లాస్టిక్ బాటిల్స్‌కు ముందుగా రంధ్రం చేశారు. ఆ రంధ్రం నుంచి ఒక్కో బాటిల్‌ను ఓ వైర్‌తో క‌నెక్ట్ చేసి ముడి వేశారు. రెండు ప్లాస్టిక్ బాటిల్స్‌కు మ‌ధ్య గ్యాప్ ఉండ‌టంతో గాలి కూడా వ‌స్తుంద‌ని కంపెనీ యాజ‌మాన్యం వివ‌రించింది. ఇక ఈ షెల్ట‌ర్ లైఫ్ టైమ్ విష‌యానికొస్తే… బాటిల్స్‌ను ఎవ‌రూ ధ్వంసం చేయ‌నంత‌ వ‌ర‌కూ సుదీర్ఘ‌కాలంగా ఉంటుంద‌ని ప్ర‌శాంత్ తెలిపారు. అంతేకాదు బ‌స్ షెల్ట‌ర్‌లో కూర్చునేందుకు టైర్ల‌తో సీట్లు త‌యారు చేసేందుకు ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు చెప్పారు.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ కూడా ఈ త‌ర‌హా బ‌స్‌షెల్ట‌ర్ల ప‌ట్ల ఆస‌క్తి చూపిస్తోంద‌ని … య‌ద్ధ‌ప్రాతిప‌దిక‌న ఏడు ప్రాజెక్టుల నిర్మాణానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయ‌ని తెలిపింది కంపెనీ. ఏడాది పొడ‌వునా అన్ని కాలాల్లో ఈ షెల్ట‌ర్లు త‌ట్టుకునేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. రీసైకిల్ ప‌ద్ధ‌తికి అటు ప్ర‌జ‌ల నుంచి ఇటు ప్ర‌భుత్వం నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు బాంబూ హౌజ్ ఇండియా వ్య‌వ‌స్థాప‌కులు ప్ర‌శాంత్.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy