శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు పది వసంతాలు

airportశంషాబాద్ (హైదరాబాద్‌) అంతర్జాతీయ విమానాశ్రయంకు పదేళ్లు. రేపు (శుక్రవారం) విమానాశ్రయ ప్రాంగణంలోనే ఏర్పాటు చేసిన తొలి దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా, విమానయాన శాఖ కార్యదర్శి రాజీవ్‌ నారాయణ్‌ చౌబే, తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. ఈ వేడుకల సందర్భంగా విమానాశ్రయం విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం కేసీఆర్. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ సిటీని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొనే హైదరాబాద్‌కు పాతిక కిలోమీటర్ల దూరంలోని శంషాబాద్‌లో ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. కేవలం 31 నెలల రికార్డు టైమ్‌లో నిర్మాణం పూర్తి చేసుకొని 2008 మార్చి 14న హైదరాబాద్‌ ఇంటర్‌నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభమైంది. దీనికి రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేశారు. గత పదేళ్ల కాలంలో ఈ ఎయిర్‌పోర్ట్‌ పలు అంతర్జాతీయ అవార్డులను గెల్చుకొని ప్రపంచంలోని అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్‌ల్లో ఒకటిగా నిలబడింది. కార్గో రవాణాలోనూ ఈ ఎయిర్‌పోర్ట్‌ ప్రత్యేకతలను చాటుకుంది. అతిపెద్ద కార్గో టెర్మినల్‌తోపాటు ఏవియేషన్‌ శిక్షణ కేంద్రం, ఎంఆర్‌ఓ కేంద్రం, సోలార్‌ ప్లాంట్‌ వంటి ప్రత్యేకతలున్న ఈ ఎయిర్‌పోర్ట్‌ నుంచి 2017లో కోటి 70 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. ఎయిర్‌పోర్ట్‌ సంస్థలో జిఎంఆర్‌ గ్రూప్‌నకు 63 శాతం వాటా ఉండగా, ఎయిర్‌పోర్ట్స్‌ ఆథార్టీ ఆఫ్‌ ఇండియాకు 13 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. మలేషియా ఎయిర్‌పోర్ట్స్‌ హోల్డింగ్స్‌కు 11 శాతం వాటా ఉంది.

ఈ ఎయిర్‌పోర్ట్‌ను ఎ380తో సహా కొత్త భారీ విమానాల (ఎన్‌ఎల్‌ఎ) రాకపోకలకు కూడా అనువుగా తీర్చిదిద్దారు. ప్రారంభంలో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా ఎయిర్‌పోర్టును నిర్మించినప్పటికీ భవిష్యత్‌ అవసరాలను బట్టి గరిష్ఠ స్థాయిలో 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా విస్తరించే వెసులుబాటు ఉంది. హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రస్తుతం 15 విదేశీ ఎయిర్‌లైన్స్‌, 4 దేశీయ ఎయిర్‌లైన్స్‌ సుమారు 20 అంతర్జాతీయ కేంద్రాలకు సర్వీసులను అందజేస్తున్నాయి. మరో 10 దేశీయ ఎయిర్‌లైన్స్‌ దేశవ్యాప్తంగా ఉన్న చిన్నా, పెద్ద నగరాలకు, పట్టణాలకు సర్వీసులను నిర్వహిస్తున్నాయి.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy