శత్రుదేశాలే టార్గెట్ : త్వరలో అగ్ని-5 ప్రయోగం

5 AGNIత్వరలో  భారత సైన్యం  అమ్ముల  పొదిలోకి  ఖండాంతర  బాలిస్టిక్  క్షిపణి  అగ్ని- 5 చేరనుంది.  పూర్తి  స్వదేశీ  పరిజ్ఞానంతో  రూపుదిద్దుకున్న  అగ్ని 5… చైనాలోని  అన్ని ప్రాంతాలపై  గురిపెడుతుందని  రక్షణ రంగ  నిపుణులు  అంచనా వేస్తున్నారు.   పరీక్షల అనంతరం  5 వేల  కిలోమీటర్ల  లక్ష్యాలను  చేధించగల  ఈ క్షిపణిని …త్వరలోనే  సైన్యానికి అందించనున్నట్లు  సమాచారం.

శత్రుదేశాలకు చెందిన 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఢీకొట్టే సామర్థ్యం ఉన్న అగ్ని-5 పరీక్షలు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయి. అణ్వస్ర్తాలనూ మోసుకెళ్లే ఈ క్షిపణిని సైనిక దళాల్లోకి ప్రవేశపెట్టే ప్రక్రియపై భారత్  కసరత్తు చేస్తోంది. దేశ రక్షణ సామర్థ్యం మరింత పెంచే అగ్ని5… చైనా రాజధాని బీజింగ్ తోపాటు ఆ దేశంలోని షాంఘై, హాంకాంగ్ తదితర నగరాల్లోని లక్ష్యాలనూ ఛేదించగలదు. గత నెలలో ఒడిశా తీరంలో అగ్ని-5 క్షిపణి ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. అమెరికాతోపాటు చైనా, రష్యా, ఫ్రాన్స్, ఉత్తరకొరియా దగ్గర మాత్రమే ఇప్పటి వరకు ఖండాంతర క్షిపణులున్నాయి. తాజాగా భారత్ ఆ జాబితాలో చేరింది. తొలుత 700 కిలోమీటర్ల లక్ష్యంతో కూడిన అగ్ని-1 క్షిపణిని అభివృద్ధి చేసిన భారత్.. తర్వాత 2వేల కిలోమీటర్ల లక్ష్యాలపై గురిపెట్టగల అగ్ని-2, అగ్ని-3ని తయారుచేసింది.

2వేల 500 కిలోమీటర్ల నుంచి 3వేల 500 కిలోమీటర్లకు పైగా దూరంలో లక్ష్యాన్ని ఢీకొట్టగల అగ్ని-4ను అభివృద్ధి చేసింది. 2012 ఏప్రిల్ 19న అగ్ని-5 క్షిపణిని తొలుత ప్రయోగాత్మకంగా పరీక్షించారు. రెండోసారి 2013 సెప్టెంబర్ 15న, మూడోసారి 2015 జనవరి 31న, నాలుగోసారి 2016 డిసెంబర్ 26న పరీక్షించారు. ఐదోసారి జనవరి 18న జరిపారు. ఇప్పటివరకు ఐదుసార్లు ప్రయోగాత్మక పరీక్షలను అగ్ని క్షిపణి విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత నెలలో విజయవంతంగా మరోసారి పరీక్షించిన అగ్ని-5 క్షిపణి.. అగ్ని శ్రేణి క్షిపణుల్లో అధునాతనమైంది. కొత్తగా అభివృద్ధి చేసిన శాస్త్ర పరిజ్ఞానాన్ని అగ్ని-5లో ఉపయోగించారు. ఇందులోని ఇంజిన్, దిక్సూచి, వార్ హెడ్ కూడా కొత్తవే. అగ్ని-5 క్షిపణిలో అత్యంత వేగంగా పని చేసే కంప్యూటర్.. లోపాలకు తావులేని సాఫ్ట్ వేర్, పూర్తిస్థాయి డిజిటల్ నియంత్రణ తదితర వ్యవస్థలు ఉన్నాయి. శత్రుదేశాలు కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన బుద్ది చెప్పేందుకు అగ్ని5 ఉపయోగపడుతుందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy