శరవేగంగా కాళేశ్వరం పనులు : అన్నారం బరాజ్ గేట్ల బిగింపు షురూ

Harishraoతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆగమేఘాల మీద సాగుతున్నాయి. బంగారు తెలంగాణ కోసం జలసిరులు దూకనున్న ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అద్వితీయమైన ప్రాజెక్టు తొలిగేటును సంతరించుకున్నది. కీలకదశకు చేరుకున్న పనులను నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం (మార్చి-17) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులవేగంలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు భారతదేశ చరిత్రలోనే రికార్డు సృష్టిస్తుందని అన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలంలోని అన్నారం, మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై నిర్మిస్తున్న బరాజ్‌లు, కన్నెపల్లి వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

మేడిగడ్డ బరాజ్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా అన్నారం బరాజ్‌కు తరలించటానికి కన్నెపల్లి నుంచి అన్నారంవరకు అటవీ ప్రాంతంలో 13.35 కి.మీ. పొడవు నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పనులను హరీశ్ స్వయంగా పరిశీలించారు. గ్రావిటీ కెనాల్ మట్టి పనులు, స్ట్రక్చర్ల నిర్మాణ పనులను రెండు నెలల్లో పూర్తిచేయాలని కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీర్లు, ఏజెన్సీ ప్రతినిధులను ఆదేశించారు. ప్రధానంగా అన్నారం బరాజ్‌కు గేట్లను అమర్చే పనులు శనివారం మొదలయ్యాయి. తొలిగేటు విజయవంతంగా బిగించారు. కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో తొలిగేటు అమర్చే పనులను ఇంజనీర్లతో కలిసి మంత్రి పర్యవేక్షించారు. అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లు, కన్నెపల్లి పంప్‌హౌజ్ నిర్మాణ పనుల ప్రోగ్రెస్‌పై అన్నారం బరాజ్ వద్ద సమీక్షించారు. వచ్చే వానకాలం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీరు అందించాలనే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు లక్ష్యాన్ని అధిగమించేందుకు ఇంజినీర్లు, ఏజెన్సీల ప్రతినిధులు పనుల్లో మరింత వేగం పెంచాలని ఆదేశించారు.

అన్నారం బరాజ్ వద్ద మీడియాతో మాట్లాడుతూ, మేడిగడ్డ బరాజ్ నుంచి గోదావరి జలాలను ఎల్లంపల్లి బరాజ్ వరకు తీసుకెళ్లే లింక్-1లోని పనులన్నీ కీలకమైనవి, సంక్లిష్టమైనవి. వీటిలో వరుసగా మూడు బరాజ్‌లు, మూడు పంప్‌హౌజ్‌లు, గ్రావిటీ కెనాల్ పనులున్నాయి. అటవీ, పర్యావరణ అనుమతులన్నీ ఇటీవలే వచ్చాయి. గత డిసెంబర్ 7న సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. పనుల పూర్తికి డెడ్‌లైన్ పెట్టారు. సీఎం పర్యటన తర్వాత 13.35 కిలోమీటర్ల కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులకు అటవీ అనుమతులు వచ్చాయి. ఈ పనులు కూడా చాలా క్లిష్టమైనవి. అందుకే సాగునీటిశాఖ కన్నెపల్లి-అన్నారం గ్రావిటీ కెనాల్ పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నది. డే టు డే రివ్యూ చేస్తున్నాం. ఇప్పటివరకు కాళేశ్వరంలో నాకు ఇది నాలుగో పర్యటన ఇది. ఇందులో రెండు రాత్రులు గ్రావిటీ కెనాల్ పనులు జరుగుతున్న అటవీ ప్రాంతంలో గడిచాయి. ఎప్పటికప్పుడు పనులపై సమీక్షిస్తూ ముందుకు వెళ్తున్నాం అని తెలిపారు మంత్రి
హరీశ్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy