శశికళపై సుప్రీం తీర్పు రేపు వచ్చే అవకాశం

sasikala-supreme-court

దివంగత జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండవ నిందితురాలిగా ఉన్న… శశికళ రాజకీయ భవిష్యత్ రేపు తేలిపోనుంది. ఉదయం 10.30గంటలకు సుప్రీం కోర్టు తీర్పు చెప్పనుంది. జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, జస్టిస్ అమితవ్ రాయ్ ల బెంచ్ తీర్పు చెప్పనుంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే… జైలుకు వెళ్లడం ఖాయం. ఒకవేళ నిర్దోషిగా బయటపడితే… సీఎం పీఠమెక్కడం కన్ఫామ్ అయినట్టే.

66 కోట్ల ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన కేసులో జయలలిత మొదటి ముద్దాయిగా ఉన్నారు. రెండో ముద్దాయిగా శశికళ, మూడో ముద్దాయిగా ఇళవరసి, నాలుగో నిందితుడిగా సుధాకరన్ లున్నారు. దాదాపు 21 ఏళ్లుగా ఈ కేసు నడుస్తోంది. 2014 సెప్టెంబర్ లో బెంగళూరులోని ట్రయల్ కోర్టు కీలక తీర్పునిచ్చింది. జయలలితకు 100 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు తలో 10 కోట్ల జరిమానా, నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆమె జైలుకు వెళ్లారు. 2014 అక్టోబర్ 17న ఆమెకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది.  ట్రయల్ కోర్టు తీర్పును బెంగళూరు హైకోర్టులో సవాల్ చేశారు జయలలిత. 2015 మే 11న జయలలితను నిర్దోషిగా విడుదల చేసింది హైకోర్టు. అయితే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కర్ణాటక ప్రభుత్వం. ప్రస్తుతం ఆ కేసులో ఫిభ్రవరి 14న సుప్రీం కోర్టు తీర్పు వెలువడనుంది.

అటు తమిళనాడులో పాలిటిక్స్ హీటెక్కాయి. గత 33 ఏళ్లలో తాను వెయ్యి మంది పన్నీర్ సెల్వంలను చూశానన్నారు శశికళ. పోయెస్ గార్డెన్ దగ్గర అభిమానులనుద్దేశించి మాట్లాడిన శశికళ తానెవరికీ భయపడడంలేదన్నారు. పన్నీర్ సెల్వం అసలు రంగు బయటపడిందన్న శశికళ… నిజాలేంటో తెలుసుకోవాలని కార్యకర్తలు, అభిమానులను కోరారు. మనసులో ఎంత బాధ ఉన్నా… పార్టీ భవిష్యత్ కోసమే తాను నిలబడ్డానన్నారు.

ఇక వరుసగా మూడోరోజూ గోల్డెన్ బే రిసార్ట్స్ కు వెళ్లారు శశికళ. రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పోయెస్ గార్డెన్ నుంచి క్యాన్వాయ్ తో బయలుదేరిన శశికళ… రోడ్డుపై అక్కడక్కడ ఆగుతూ… మద్దతుదారులతో మాట్లాడుతూ వెళ్లారు. గుంపు కనిపించినా ప్రతిచోటల్లా ఆగి… జనాలను పలకరించారు. రిసార్ట్స్ పక్కనే ఉన్న ఓ గుడిసెలోకి వెళ్లి… స్థానికులను పలకరించారు. ఇవాళంతా జనాల్లోనే కనిపించారామె. రాత్రంతా కూడా రిసార్ట్స్ లోనే ఉండనున్న శశికళ… మరోసారి ఎమ్మెల్యేలతో బలప్రదర్శన చేశారు.

మరోవైపు గవర్నర్ పై సైలెంట్ వార్ కొనసాగిస్తోంది శశికళ వర్గం. P.L.శర్మ అనే లాయర్ సుప్రీంకోర్టులో పిల్ వేశారు. 24గంటల్లోగా శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్ ను ఆదేశించాలని కోర్టును కోరారు పిటిషనర్లు. శశికళకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా… ఆమెను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలేదని పిల్ లో ఆరోపించారు P.L.శర్మ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy