సంక్రాంతి నవ్వుల ఖజానా.. F2 : సినిమా రివ్యూ

రివ్యూ: ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)

రన్ టైమ్: 2 గంటల 28 నిమిషాలు

నటీనటులు : వెంకటేష్,వరుణ్ తేజ్,తమన్నా,మెహరీన్,ప్రకాష్ రాజ్,నాజర్,రాజేంద్ర ప్రసాద్, అన్నపూర్ణ,వై విజయ,ప్రియదర్శి, వెన్నెల కిషోర్,రఘుబాబు,ఝాన్సీ, ప్రగతి,మిర్చి కిరణ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: బాబు

మ్యూజిక్: దేవీశ్రీ ప్రసాద్

నిర్మాత: దిల్ రాజు,శిరీష్

రచన,దర్శకత్వం: అనిల్ రావిపూడి

రిలీజ్ డేట్: జనవరి 12,2019

కథేంటి?

కథగా చెప్పుకుంటే ఈ సినిమాది సింపుల్ స్టోరీ. భార్యల వల్ల ఫ్రస్ట్రేట్ అవుతున్న వెంకీ, వరుణ్ లు వాళ్లను విడిచి ఫారిన్ వెళ్లిపోతారు. భార్యలు కోపంతో అక్కడికే వెళ్లి వాళ్లను ఎలా దారిలోకి తెచ్చుకున్నారన్నదే ఈ కథ.

నటీనటుల పర్ఫార్మెన్స్

ఈ సినిమాకు వెంకీ నటన మేజర్ ప్లస్. తన కామెడీ టైమింగ్ తో హిలేరియస్ ఎంటర్ టైన్మెంట్ అందించాడు. మల్లీశ్వరి, నువ్వునాకు నచ్చావ్ తర్వాత మళ్లీ వింటేజ్ కామెడీని వెంకీ అందించాడు. వరుణ్ తేజ్ ఫర్వాలేదనిపించాడు కానీ.. తనకు పెట్టిన తెలంగాణ యాస సూటవలేదు. హీరోయిన్లు తమన్నా, మెహరీన్ నటన పరంగా యావరేజ్ అనిపించినా… ఫుల్ గ్లామర్ పండించారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్, రఘుబాబు, ప్రియదర్శిలు తమకు అలవాటైన పాత్రల్లో రాణించారు.

టెక్నికల్ వర్క్

సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. దేవీశ్రీ ప్రసాద్ పాటలతో మరోసారి నిరాశపరచాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే. ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ వర్క్, నిర్మాణ విలువలు చక్కగా ఉన్నాయి. అనిల్ రావిపూడి రాసిన కామెడీ పంచ్ లు బాగా పేలాయి.

విశ్లేషణ:

టాలీవుడ్ లో కామెడీ సినిమాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. ఒకప్పుడు శ్రీనువైట్ల ఇదే ఫార్మూలా పాటించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు అదే బాటలో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. సింపుల్ కథ అనుకోవడం దానికి పంచ్ డైలాగులు, సిట్యూయేషనల్ కామెడీ సృష్టించడంలో నేర్పరి అనిల్ రావిపూడి. బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తనకంటూ ఓ మార్కు క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ‘‘ఎఫ్ 2’’ తో పాసైపోయాడు. తన రైటింగ్ కూ, టేకింగ్ కూ వెంకటేష్ లాంటి అనుభవమున్న నటుడు తోడవటం వల్ల మాములుగా ఉన్న సీన్లు కూడా హిలేరియస్ గా పండాయి. ఈ సినిమా ఫస్టాఫ్ లో అయితే వెంకటేష్ ఇరగదీసాడు. తన ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్ వల్ల జనాలు పగలబడి నవ్వుతారు. భార్య వల్ల ఫ్రస్టేట్ అయిన భర్త పాత్రలో దుమ్మురేపాడు వెంకీ. ఈ పాత్రకు అందరూ భర్తలు కనెక్టవడం ఖాయం. అయితే.. థిన్ స్టోరి కావడం వల్ల సెకండాఫ్ లో ఏమి చేయలేని పరిస్థితి. దాని వల్ల కథ ఫారిన్ కు షిఫ్ట్ అయినప్పుడు సైడ్ ట్రాక్ అయింది. దాని వల్ల కాస్త బోర్ కొడుతుంది కానీ వెంకటేష్, కామెడీ పంచ్ లు సరిగా వర్కవటం వల్ల పాసైపోతుంది. ఈ పండగ సీజన్ లో ఫ్యామిలీ తో చూసే సినిమా ఇదే అవుతుంది. చూసిన వాళ్లు అందరూ ఎంజాయ్ చేస్తారు.

బాటమ్ లైన్:

ఫన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy