సంచార జాతి కుర్రాడు.. అంతర్జాతీయ అవార్డుకు నామినీ

shakthiసంచార జాతి కుర్రాడు.. ఇప్పుడు దేశం గర్వించదగ్గ పిల్లాడయ్యాడు. అక్షరాస్యతలో ప్రపంచంమెచ్చే బాలుడయ్యాడు. అక్షరాలు దిద్ది తను గొప్పోడు అవ్వడమే కాదు.. తన జాతిలోని పదుగురికి స్ఫూర్తినిచ్చాడు… అదే బాటలో నడిపించాడు. ఇంత ఘనత సాధించినవాడు తమిళనాడుకు చెందిన శక్తి. వయస్సు 12 ఏళ్లు. పేరుకు తగ్గట్టే విద్యాశక్తిని చూపించిన ఈ బుడతడు అంతర్జాతీయ అవార్డుకు అడుగుదూరంలో ఉన్నాడు. అక్షరాస్యత కోసం శక్తి చేస్తున్న కృషిని గుర్తించి ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఫర్ చిల్డ్రన్ – 2017 అవార్డుకు ఎంపిక చేశారు.

ఇంతకూ శక్తి చేసిందేమిటి..?

తమిళ నారికురువర్ తెగకు చెందిన శక్తి… తిరుమన్నామలై జిల్లాలో ఉండేవాడు. ఇతని తల్లిదండ్రులకు మొత్తం ఆరుగురు సంతానం. అందులో శక్తే పెద్దోడు. సంచార తెగకు చెందినవాడు కావడంతో.. ఒక ఊరి నుంచి మరో ఊరికి ప్రయాణాలు సాగిస్తూ ఉండేది వీరి కుటుంబం. దీంతో చదువు సక్రమంగా సాగేది కాదు. టీచర్లు బాగా తిట్టేవారు. దీంతో 8 ఏళ్ల వయస్సులో చదువు మానేశాడు. తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఊరూరా తిరిగేవాడు. అదే సమయంలో హ్యాండ్ అండ్ హ్యాండ్ అనే స్వచ్ఛంద సంస్థ కంటపడ్డాడు. అక్కడే అతని అదృష్టం మారింది. శక్తి తల్లదండ్రులతో మాట్లాడి.. అతన్ని మళ్లీ బడిబాట పట్టించింది ఆ స్వచ్ఛంద సంస్థ. వారి సహకారంతో చదువు మొదలుపెట్టిన శక్తి… తన తెగలోని మరో 25మందితో అక్షరాలు దిద్దించాడు.

రోజూ తను నేర్చుకున్న విషయాలను ఫ్రెండ్స్ దగ్గర చెప్పేవాడు. వారిని మోటివేట్ చేసేవాడు. చదువు గొప్పతనం గురించి చెప్పి.. అబ్బురపరిచేవాడు. దీంతో వాళ్లు కూడా స్కూల్ కి వెళ్లడం  మొదలు పెట్టారు. శక్తిలోని నాయకత్వ లక్షణాలు గుర్తించిన హ్యాండ్ అండ్ హ్యాండ్ సంస్థ ఆశ్చర్యపోయింది. పిల్లాడిలోని పట్టుదల అతన్ని ఇంటర్నేషనల్ అవార్డుకు చేరుకునేలా చేసింది. దేశం నుంచి మొత్తం 10 మంది పిల్లలు నామినేట్ అవ్వగా.. అందులో శక్తే అందరికంటే ముందున్నాడు. డిసెంబర్ 4న విజేతల వివరాలు ప్రకటించనుంది ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ ఫర్ చిల్డ్రన్ సంస్థ.

శక్తి.. చెప్పే మాట…

ఇప్పుడు నాతోపాటు 25 మంది చదువుకుంటున్నారు.. రేపు అది 30 అవుతుంది.. ఎల్లుండి 40 అవుతుంది.. అలా పెరుగుతూనే ఉంటుంది. అందరూ సంతోషంగా ఉండాలన్నదే నా కల. అది సాకారమవుతుందన్న నమ్మకం నాకుంది.

శక్తి ప్రస్తుతం కాంచీపురం స్కూల్లో చదువుకుంటున్నాడు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కావాలన్నది అతని కల.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy