సరదాల సంక్రాంతి

sankrantiమూడు రోజుల ముచ్చటైన వేడుక. సిరులు తీసుకొచ్చే పండుగ. అన్నదాత మొహంలో వెలుగులు తెచ్చే రోజు. పాతదనానికి బైబై చెపుతూ.. కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ చేసుకునే వైభవం. సరదాల సంక్రాంతి వచ్చేసింది. తెలుగు లోగిళ్లు కొత్త శోభతో కళకళలాడుతున్నాయి. సరదాల సంక్రాంతిని మూడు రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఇందులో మొదటిది భోగి. చలిమంటలు…. భోగిపళ్లు, రంగురంగుల హరివిల్లులు… వాటి మధ్యలో గొబ్బొమ్మలు…. చుట్టూ ఆడిపాడే యువతులు. చిన్నారుల సందళ్లతో అంతా సరదాగా సాగుతోంది. భోగి పండుగ అనగానే అందరికీ గుర్తొచ్చేది చలిమంటలే. సూర్యోదయానికి ముందే తెలతెలవారుతుండగా ఇంటి ముందు మంటలు వేస్తారు. గజగజా వణికించే చలిలో… వెచ్చని మంటలతో భానుడికి స్వాగతం పలుకుతారు. అసలు భోగి అంటే మంటలే కాదు….భోగభాగ్యాలకు పండుగ… భోగము సుఖము రెండింటి కారణంగా పండుగను జరుపుకుంటారు. ఈ భోగి మంటలకు ఇతిహాస గాధలతో పాటు ఆరోగ్య రహస్యాలూ ఉన్నాయి.  శరీరానికి భోగం…. పోషణకు సూచికగా చేసే పండుగ. ధనాన్ని చేకేర్చే పండుగగా భోగిగా జరుపుకుంటారు. లౌకిక కామాన్ని కాల్చేసి భక్తి మార్గంలో నడుస్తామని చెప్పడమే భోగి మంటల పరమార్థం. ఆ మంటల కాంతిలో జ్ఞానమార్గంలో నడవాలని చెబుతారు. అందుకే ఆవుపేడతో చేసిన పిడకలను కామానికి గుర్తుగా కాల్చి బూడిద చేస్తారు. పాత ఆలోచనలు… పాతదనాన్ని మంటల్లో కాల్చేయాలని చెబుతారు. అందుకే ఇంట్లో పాత వస్తువులు, కట్టెలు మంటల్లో కాలుస్తారు. అటు హేమంత రుతువులో భోగి పండుగ వస్తోంది. ఈ సీజన్లో రేగిపండ్లు బాగా దొరుకుతాయి. ఈ కాలంలో అమ్మవారు రేగు పళ్లో ఉంటారని  మరో నమ్మకం. చిల్లర పైసలు, బంతి, చామంతి పూలు, చెరకు ముక్కలు కలిపి రేగిపళ్లను పిల్లల నెత్తిపై పోయడం ఆనవాయితీ. కలకాలం భోగభాగ్యాలను కలిగి ఉండాలని ఆశీర్వదిస్తారు. ఇలా చేస్తే జాతక సమస్యలు, అనారోగ్యాలు పోతాయని చెబుతారు.  అటు దక్షిణాయాన కాలంలో చేసిన శ్రావణ, కార్తీక, శ్రావణ, ధనుర్మాస పూజల పుణ్యఫలం సంక్రాంతి వచ్చే ఉత్తరాయణంలో ప్రాప్తిస్తుందని చెబుతారు. అందుకే దక్షిణాయానికి భోగి మంటలతో వీడ్కోలు పలుకుతారు. ఆనందపు సిరులు కురిపించే సంక్రాంతి పండుగకు భోగి స్వాగతం పలికింది. అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనమంతా కోరుకుందాం. భోగి తర్వాత రెండోరోజు మకర సంక్రాంతి, మూడోరోజు కనుమ జరుపుకుంటారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy