సర్కార్ @ 3 : మోడీ ముందున్న సవాళ్లు ఇవే

sarkarకేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కార్ వ‌చ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు కాస్త ఫ‌ర్వాలేద‌నిపించినా.. చివ‌రి రెండేళ్లు మాత్రం మోడీకి సవాల్ కానుంది. ఇందులో భాగంగానే పేద‌ల‌కు వీలైనంత సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లుచేసి వారికి ల‌బ్ధి చేకూరేలా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం. పేద‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల‌ను అందించి ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించాల‌నే కృత‌నిశ్చ‌యంతో మోడీ ఉన్నారు. 2014లో ఉత్త‌ర భార‌తం, ప‌శ్చిమ భార‌తంలో చాలా చోట్ల బీజేపీ విజ‌య‌బాహుటా ఎగురవేసింది. మిగ‌తా చోట్ల కూడా ఇదే పంథాను అమ‌లు చేయాల‌ని.. ఇందుకోసం ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతున్నారు క‌మ‌ల‌నాథులు. పొత్త‌లుపై కూడా చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని భావించ‌డంతో పాటు విప‌క్షాల‌ను కూడా త‌మ‌వైపు తిప్పుకునేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ అధిష్టానం.

ప్ర‌స్తుతం మోడీ ప్ర‌భుత్వాన్ని క‌ల‌వ‌ర‌పెడుతున్న అంశం దేశ‌భ‌ద్ర‌త‌. జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు చొర‌బ‌డి మ‌న జ‌వాన్ల‌ను హ‌త‌మారుస్తుండ‌టం ఒక‌టైతే చ‌త్తీస్‌గ‌ఢ్ లాంటి ప్రాంతాల్లో మావోలు విరుచుకుపడుతున్నారు.ఈ రెండు అంశాల‌పై మోడీ ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన‌ట్లు స‌మాచారం. అంతేకాదు 2018 బ‌డ్జెట్‌లో పెద్ద ఎత్తున తాయిలాలు ప్ర‌క‌టించేందుకు కూడా స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే స్ట్రాట‌జీని అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం అమ‌లు చేసి 2009లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చింది. 2008లో రైతుల‌కు రుణ‌మాఫీలు ప్ర‌క‌టించి 2009లో అధికారం చేప‌ట్టింది యూపీఏ స‌ర్కార్. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా కొలువైన బీజేపీ ప్ర‌భుత్వం రైతుల‌కు రుణ‌మాఫీ ప్ర‌క‌టించ‌డంతో.. మ‌హారాష్ట్ర‌లో కూడా అలాంటి ప్ర‌క‌ట‌నే చేయాల‌ని అక్క‌డి స‌ర్కార్‌పై ఒత్తిడి వ‌స్తోంది. మ‌రోవైపు త‌మిళనాడులో కూడా రైతు ప‌రిస్థితి అద్వానంగా త‌యారైంది.

గ‌తేడాది పెద్ద నోట్లు ర‌ద్దు కావ‌డం.. ఆత‌ర్వాత సామాన్యుడు తన డబ్బును తాను తీసుకునే క్రమంలో నెల‌ల‌పాటు ఇబ్బందుల‌కు గురికావడంతో ప్ర‌భుత్వంపై కొంత వ్య‌తిరేక‌త వచ్చిన‌మాట వాస్త‌వం. ఈ ఇష్యూని చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల‌ని భావిస్తోంది మోడీ టీమ్‌. మ‌రోవైపు అమెరికా హెచ్‌1బీ వీసా అంశం, అమెరికా తీసుకున్న క‌ఠిన నిర్ణ‌యాల‌తో కుదేల‌వుతున్న ఐటీ ఇండ‌స్ట్రీ లాంటి అంశాల‌ను చాలా చాక‌చ‌క్యంగా డీల్ చేయ‌డంపైన కూడా దృష్టి సారించింది.

పాకిస్తాన్ ప‌దేప‌దే చొర‌బాట్ల‌కు పాల్ప‌డ‌టం, కాల్పుల ఒప్పందం ఉల్లంఘించ‌డం లాంటి అంశాల‌పై మోడీ ఏమేర‌కు స్పందిస్తారన్న విష‌యం కూడా ఇక్క‌డ కీల‌కం కానుంది. మ‌రోవైపు పాకిస్తాన్‌కు చైనా మ‌ద్ద‌తు తెల‌ప‌డం, బౌద్ద గురువు ద‌లైలామా అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో ప‌ర్య‌టించ‌డం లాంటి దౌత్య ప‌ర‌మైన అంశాలను కూడా మోడీ చాలా జాగ్ర‌త్త‌గా డీల్ చేయగ‌లిగితే 2019లో విజ‌యావ‌కాశాలు ఉంటాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

2018లో క‌ర్నాట‌క‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, రాజ‌స్థాన్‌, చ‌త్తీస్‌గ‌ఢ్‌లో బీజేపీ ప్ర‌భుత్వ‌మే ఉండ‌టం ఆరాష్ట్రాల్లో కొంత వ్య‌తిరేక‌త కూడా ఉండ‌టంతో ఆ మూడు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు కీల‌కం కానున్నాయి. ఒక‌వేళ బీజేపీ ఓట‌మి చ‌విచూస్తే 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో మోడీకి క‌ష్ట‌మే అవుతుంది.

మోడీ చ‌రిష్మానే ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీకి శ్రీరామ‌ర‌క్ష‌గా నిలిచింది. 2019లో తిరిగి అధికారం చేప‌ట్టాలంటే  మోడీ-షా ద్వ‌యం ఎలాంటి మంత్రాన్ని పాటిస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy