సర్దార్.. ‘ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా’

sardar-patelఉక్కుమనిషి ఒంటిపేరు.. సాహసం ఇంటిపేరు.. ధైర్యానికి, తెగువకు మారుపేరు. స్వాతంత్ర్య ఉద్యమంలో  ముందుండి.. వందలాది సంస్థానాలను ఇండియన్ యూనియన్ లో కలిపిన ధీశాలి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ మహనీయుడు జయంతి ఈ రోజు.

స్వాతంత్ర్య ఉద్యమానికి ముందు.. ఆ తర్వాత దేశం కోసం జీవితాన్ని అంకితం చేసిన అతి కొద్దిమంది త్యాగధనుల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖులు. 1947పంద్రాగస్టున దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక.. 556 సంస్థానాలను స్వతంత్ర భారతావనిలో విలీనం చేసి సంపూర్ణ భారతావనికి రూపునిచ్చేలా కృషి చేశారు.

1875అక్టోబర్ 31న..గుజరాత్ లోని ఖేడా జిల్లా నాడియాద్ లో జన్మించారు పటేల్. చివరి క్షణం వరకూ.. దేశం కోసం పరితపించారు. బారిష్టర్ చదువు పూర్తి చేసుకున్నాక.. స్వాతంత్ర్య ఉద్యమం ఆయన్ను బాగా ఆకర్షించింది. 1908లో భార్య చనిపోయాక.. పూర్తిగా ఉద్యమానికి అంకితమయ్యారు. పక్కా ఆచరణ వాది అయిన పటేల్ 1917 జరిగిన చంపారణ్ ఉద్యమం తర్వాత.. గాంధీజీకి నమ్మిన బంటుగా మారాడు. అతనికి అత్యంత సమర్ధుడైన దళపతిగానూ అయ్యాడు. గాంధీ ప్రణాళికలు ఏవైనా అమలు పరుస్తూ వచ్చారు పటేల్. తన యూరోపియన్ సూట్  లను తగులబెట్టి ఖాదీ ధోవతి కుర్తాలోకి మారిపోయారు.

కష్టపడి పనిచేసే నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు పటేల్. ఆయనది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. న్యాయవాద జీవనంలో ఉన్నా.. రాజకీయాల్లో ఉన్నా.. తనను తాను ఒక రైతుగా వ్యవసాయదారునిగానే చెప్పుకునే వారు పటేల్.

అహ్మదాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ప్రతినిధిగా ఎన్నికయ్యారు పటేల్. వివేకంలో బ్రిటీష్ అధికారుల కన్నా మేధావి అనిపించుకున్నారు. ప్రజల కోసం ఎన్నో నిర్మాణాత్మక కార్యక్రమాలను చేపట్టారు. 1924-28 మధ్య కాలంలో కార్పోరేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలోనే ఆయన స్వచ్చ భారత్ ను తెరమీదకు తెచ్చారు. కార్యకర్తలతో కలిసి చీపురు పట్టి.. అహ్మదాబాద్ వీధులను ఊడ్చారు. అదికూడా ఈ మహత్కార్యాన్ని  దళితవాడ నుంచి మొదలుపెట్టారు పటేల్. 1917లో అహ్మదాబాద్ లోఅంటు వ్యాధులు వ్యాపించినప్పుడు బాధితులకు సహాయంకోసం రోజుకు 24గంటల  పనిచేశారు. తనకు కూడా అంటువ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నప్పటికి భయాన్ని పక్కనపెట్టి ముందుకు సాగారు. ఇలా కార్యదీక్షతో చేసిన ప్రజాసేవే ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రజా నాయకుడిగా ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

ఖేడా సత్యాగ్రహం పటేల్ నాయకత్వ లక్షణాలను ప్రస్పుటం చేసింది. ఖేడా సత్యాగ్రహం రెండు ముఖ్యమైన పర్యావసనాలను ఆవిష్కరించింది. భూమి పన్నుల నిర్ధారణలో రైతులను కూడా భాగస్వాములుగా చేయడానికి నాంది పలికింది. దీంతో పాటు గాంధీ, పటేల్ భుజం, భుజం కలిపి పనిచేసేందుకు కారణమైంది ఖేడా సత్యాగ్రాహం. ఒక దశాబ్ద కాలం తర్వాత గుజరాత్ లో వరదలు వచ్చాయి. వరద బాధితులను కాపాడి పునరాశ్రయం కల్పించే బాధ్యతను తీసుకున్నారు పటేల్. అప్పుడు ఆయన పేరు జాతీయస్థాయిలో మార్మోగింది. పటేల్ పేరును ఒక అవార్డుకు బాంబే ప్రెసిడెన్సీ సిఫారసు చేస్తే దాన్ని సున్నితంగా తిరస్కరించారాయన.

1928డిసెంబర్ లో కలకత్తా కాంగ్రెస్ లో పోటీ చేయడానికి పటేల్ ఇష్టపడలేదు. గుజరాత్ నుంచి తరలివచ్చిన ప్రతినిధుల ఒత్తిడితో ఒప్పుకున్నారు. సూరత్ జిల్లాలోని బార్డోలీ పటేల్ కు కురుక్షేత్రం వంటిదే. మూడు నెలల పాటు సాగిన పన్నుల చెల్లింపు నిరోధక ఉద్యమాన్ని ఆయన తన అసాధారణ నాయకత్వ ప్రతిభతో ముందుండి నడిపించారు. సైనిక తరహా క్రమశిక్షణతో.. పూర్తిగా అహింసా పద్దతిలో ఆచరించి చూపారు. బార్డోలీలో ఆయన చేజిక్కించుకున్న విజయం యావత్తు బ్రిటీష్ సామ్రాజ్యం దృష్టిని ఆకర్షించింది. కానీ సర్వోత్తమ గుర్తింపు మాత్ర బార్డోలీ తాలూకా ననీఫలోద్ కు చెందిన ఒక రైతు నుంచి లభించింది. కువర్ జీ దుర్లభ్ పటేల్ అనే ఒక కార్మికుడు.. ఓ బహిరంగ సభలో పటేల్ మీరు మా సర్ధారు అని ఎలుగెత్తి చాటాడు. అప్పటి నుంచి సర్ధార్ బిరుదు ఆయనను అంటిపెట్టుకుంది.

పటేల్ క్రమశిక్షణ వైఖరి మళ్లీ మళ్లీ అనుసరించేంత గొప్పది. గాంధీ స్వీయ క్రమశిక్షణ మంత్రాన్ని బోధిస్తే.. పటేల్ ప్రజాందోళనకు అసవరమైన సంస్థాగత క్రమశిక్షణను నేర్పారు. భారతదేశ రాజకీయాలు ప్రజాందోళన దశకు చేరుకున్న సమయంలో పటేట్ రాజకీయ రంగస్థలం మీదకు చేరుకున్నారు. 1930లో ఆసియా రాజకీయాలపై సర్వే జరిపాడు అమెరికా పాత్రికేయుడు జాన్ గుంథర్. పటేల్ లో ఒక సర్వశ్రేష్ఠ పార్టీ అధికారిని కనుగొన్నాడు. పటేల్ కార్యదక్షత కలిగినవాడు ఏ పనిని అప్పగించిన దానిని చేసి చూపేవాడు అని ఆయన గుర్తించాడు.

దేశంలో 550కి పైగా ఉన్న రాజసంస్థానాలను స్వతంత్ర భారత్ యూనియన్ లో చేర్చారు. కుదిరినంత వరకు దౌత్య పరంగా చొరవతో పూర్తిచేశారు. కుదరకపోతే బలప్రయోగం ద్వారా సంస్థానాలను దారికి తెచ్చి ఇండియన్ యూనియన్ లో విలీనమయ్యేట్లు చేశారు పటేల్. హైదరాబాద్ విషయంలో సాయుధ దళాలను రంగంలో దించారు.

స్వాతంత్ర భారతదేశ మొదటి హోంమంత్రిగా పెద్ద బాధ్యతే చేపట్టారు పటేల్. పాకిస్థాన్ నుంచి శరణార్ధులుగా తరలివస్తున్న హిందువులను, సిక్కులకు పునరావాసం కల్పించడంతో పాటు వారికి పౌరసేవల వంటివి సమకూర్చారు. స్వతంత్ర్య ఉద్యమంలో చివరి వరకూ మహాత్మాగాంధీ వెంటే నడిచిన సర్దార్.. ఆ తర్వాత కూడా దేశం కోసమే జీవితాన్ని ధారపోశారు. గాంధీ, నెహ్రూ లాంటి ప్రముఖులతో.. సైద్ధాంతికంగా విభేదాలున్నా… దేశం కోసం కలిసి పనిచేశారు.

1950లో డిసెంబర్ 15ముంబైలో కన్నుమూశారు వల్లాభాయ్ పటేల్. తన ప్రాణాలు కోల్పోయేముందు కూడా దేశ స్థితిగతులను ఆవేదన వ్యక్తం చేశారాయన. 1991లో ఉక్కమనిషి సర్ధార్ వల్లాభాయ్ పటేల్ ను భారతరత్నతో గౌరవించింది భారత ప్రభుత్వం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy