సాక్ష్యం పక్కాగా : రిజిస్ట్రేషన్ వీడియో తీస్తారు

tsరాష్ట్రంలో డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఆస్తుల రిజిస్ట్రేషన్‌ పేపర్లతో పాటు రిజిస్ట్రేషన్‌ జరిగిన ఆధారాల సీడీని కొనుగోలుదారులకు అందజేయనున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలోనే మొదటిసారిగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వీడియోలో షూట్ చేయనున్నారు. సీడీగా మార్చి కొనుగోలుదారుడికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలోనే అందిస్తారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక తాము రిజిస్ట్రేషన్‌ చేయలేదని, తమ ఆస్తులను వేరే వాళ్లు రిజిస్టర్‌ చేశారని, బలవంతంగా చేయించారని, డబ్బులు అందలేదని ఇలా అనేక ఆరోపణలు వ్యక్తమవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని 141 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను రికార్డు చేసేందుకు ప్రత్యేకంగా కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. రిజిస్ట్రేషన్‌ సమయంలో సబ్‌రిజిస్ట్రార్‌ నిర్వహించే ప్రక్రియ సహా అంతా రికార్డు చేస్తారు. దీన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో భద్రపరుస్తారు. ఈ వీడియో కాపీని సీడీ రూపంలో కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్‌ పేపర్లతో పాటు అందజేస్తారు. దీనికి ఎలాంటి అదనపు రుసుం వసూలు చేయరు. ఇప్పటికే హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ప్రయోగాత్మకంగా రిజిస్ట్రేషన్లను వీడియో కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు. దేశంలోనే ఇలాంటి విధానం మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర రిజస్ట్రేషన్‌శాఖ అమలు చేస్తోందని ఆ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో త్వరగా సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ 1 నాటికి రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు అత్యాధునిక నెట్‌వర్క్‌తో పరికరాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 60 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు ఆధునిక స్కానర్లు, ఇతర పరికరాలు సమకూర్చారు. రైల్‌ టెల్‌ నెట్‌వర్క్‌తో అవగాహన కుదుర్చుకున్న రాష్ట్ర రిజిస్ట్రేషన్‌శాఖ వేగవంతమైన నెట్‌వర్క్‌తో అనుసంధానం చేస్తోంది. దీని ద్వారా అంతరాయం లేకుండా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఒకటే డేటా ఉంది. త్వరలో తెలంగాణకు ప్రత్యేకంగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు అధికారులు. రిజిస్ట్రేషన్‌ రుసుం చెల్లింపు విధానాన్నీఈజీ చేయనున్నారు. ప్రస్తుతం బ్యాంకు ద్వారా పన్నుచెల్లించిన తర్వాత సుమారు అరగంటకు గానీ ఈ మొత్తం జమ అయినట్లు సబ్‌రిజిస్ట్రార్‌ గుర్తించలేని పరిస్థితి. తాజాగా స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఈ-పే విధానంతో అనుసంధానం చేయనున్నారు. దీంతో రుసుం బ్యాంకులో చెల్లించిన వెంటనే జమ వివరాలు తెలిసే అవకాశముంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy