‘సాగరహారం’ కవాతుకు మూడేళ్లు

8942564945_ef1dc97f2f_bతెలంగాణ డిమాండ్ తీవ్రతను ఎలుగెత్తి నినదించిన రోజు. దక్కన్ పీఠభూమిలో మరుపురాని రోజు. తాడో పేడో తేల్చుకునేందుకు బరిగీసి తెలంగాణ జనం నిలబడిన రోజు. అవురేక్ ధక్కా అంటూ లక్షలాది జనం భాగ్యనగరానికి వెల్లువెత్తిన రోజు. సాగరహారంతో కవాతు చేసిన రోజు. అదే సెప్టెంబర్ 30. సాగరహారానికి నేటితో మూడేళ్లు.

2012 సెప్టెంబర్ 30. సరిగ్గా మూడేళ్ల కింద. ఇదే రోజు. హుస్సేన్ సాగర్  చుట్టూ పోలీసు వలయం. సాగరానికి కిలోమీటర్ల మేర నిషేధాజ్నలు. రెండు రోజుల ముందు నుంచీ ఇదే సీన్. ప్రత్యేక రాష్ర్టం కోసం తెలంగాణ మొత్తం దిక్కులు పిక్కటిల్లేలా జై తెలంగాణ అంటూ నినదించిన రోజు. అదే సాగర హారం. ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో మూడేండ్ల కింద పోలీసు కవాతులు. బాష్పవాయు గోళాలు. ఈ రోడ్డే ఉద్యమానికి సజీవసాక్షి.  యువరక్తం ఉరకలెత్తి పిడికిలి బిగించింది ఇక్కడే. జోరు వానను లెక్కచేయకుండా ఢిల్లీ పెద్దలను కదిలిచిన కెరటమూ ఇదే.

ముందుగా తెలంగాణ మార్చ్ పేరుతో కార్యక్రమం చేపట్టాలని పొలిటికల్ జేఏసీ భావించింది. తరువాత దానికి సాగరహారం అని పేరుపెట్టింది. అన్ని పార్టీలు జెండాలు తీసేసి బేషరతుగా ఉద్యమంలోకి రావాలని జేఏసీ పిలుపునిచ్చింది. పార్టీలు మొదట్లో సపోర్ట్ చేయకపోయినా జనమంతా అండగా నిలిచారు. పార్టీ జెండాలన్నిటికీ తెలంగాణనే ఎజెండా చేసిన ఉద్యమం సాగర హారం.

Telangana-Millenium-March-Photo-Gallery-88ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటిచెప్పాలని తెలంగాణ జేఏసీ ఇచ్చిన పిలుపుతో ముందు జనం, తరువాత  పార్టీలన్నీ హైదరాబాద్ కు కదిలాయి. నాటి కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు నగరంలో నిషేధాజ్ఞలు పెట్టింది. నగరాన్ని బారికేడ్లమయం చేసింది. ఉద్యమ పిడికిళ్ల ముందు బారికేడ్లు బద్దలయ్యాయి. ఇనుప కంచెలు చెల్లా చెదురయ్యాయి.  అంతకు ముందే ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ పేరు తో ఉద్యమగళం కవాతు చేసింది. ఉద్యమ బలాన్ని సర్కారుకు శాంపిల్ చూపించింది. ఆపై మానుకోట పోరాటం. అన్నీ కలిసి ఉద్యమాగ్రహం… సాగర హారం నాటికి పతాక స్థాయికి చేరుకుంది.

నాటి ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ కోదండరాంను ముందే అరెస్టు చేయాలని ప్రభుత్వం భావించింది. వీలుకాలేదు. సాగరహారానికి మద్దతిచ్చిన టీఆర్ఎస్, కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ, సీపీఐ శ్రేణులు సాగరం చుట్టూ పోటెత్తాయి. జనాకాంక్షకు అద్దం పట్టాయి.

Telangana-Millenium-March-Photo-Gallery-81కఠినమైన ఆంక్షలు, అడ్డంకుల మధ్య ఒకరిద్దరితో షూరు అయిన సాగరహారం సాయంత్రానికికల్లా పెను ప్రవాహమే అయింది. నలుదిక్కుల నుంచి నినాదాల హోరు ఊపందుకుంది. అంతకుముందు మధ్యాహ్నం సమైక్య సర్కారు ఉద్యమకారులపై బాష్పవాయు గోళాలతో యుద్ధమే చేసింది. అయినా ఉద్యమ ఉద్వేగంతో ఉరకలెత్తుతున్న జనాన్ని ఆపలేకపోయింది.  బైండోవర్లు, అక్రమ అరెస్టులు ఓవైపు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకోవైపు హైదరాబాద్ నగరం ఉద్యమ వాతావరణంతో వేడెక్కింది. తెలంగాణ ఆకాంక్ష దేశం దృష్టిలో పడింది.

సాగర్ తీరంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించింది జేఏసీ. అందులో భాగస్వామ్య వర్గాలన్నీ పాల్గొన్నాయి. తెలంగాణ సాధనపై తాడోపేడో తేల్చుంటామని అల్టిమేటం ఇచ్చాయి. నాటి సభకు టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, న్యూడెమొక్రసీ నేతలు, ప్రజాసంఘాల నాయకులు మద్దతుగా నిలిచారు.  రాజకీయ నాయకత్వానికి బలమైన అల్టిమేటం ఇచ్చిన ఉద్యమం సాగరహారం. పార్టీలు పక్కనబెట్టి నాయకులు జనంతోనే ఉండాలని సంకేతం ఇచ్చిన పోరాటమది. ఉధృతంగా, కాస్త ఉద్రిక్తంగా సాగిన సాగరహారం… మలిదశ ఉద్యమం చివరిలో కీలకమైన సంఘటనగా చరిత్రకెక్కింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy